నువ్వే నా లోకమంటూ ప్రేమ పేరిట దగ్గరై..

Woman Protest Infront Of Lover House To Marry Her At khammam - Sakshi

సాక్షి, ఖమ్మం రూరల్‌ : నువ్వే నా లోకం.. అంటూ ప్రేమ పేరిట దళిత యువతి వెంట పడిన యువకుడు, శారీరకంగా ఒక్కటైన అనంతరం పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆరోపిస్తూ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం రూరల్‌ మండలంలోని కోదాడ క్రాస్‌రోడ్డులో బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. కోదాడ క్రాస్‌రోడ్డులో నివసిస్తున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన గునిగంటి పవన్‌కృష్ణ, భద్రాద్రి జిల్లా చర్లకు చెందిన దళిత యువతి సీహెచ్‌. దీప్తిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.

ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడగా, శారీరకంగా కలవడంతో దీప్తి గర్భం దాల్చింది. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా పవన్‌కృష్ణ కాలయాపన చేస్తుండడంతో ఈనెల 15న ఆయన ఇంటి ఎదుట మౌనదీక్ష చేపట్టింది. ఆ సమయాన పవన్‌కృష్ణ కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు సర్దిచెప్పడంతో దీక్ష విరమించినా ఆ తర్వాత ఫలితం లేకపోవడంతో బుధవారం పురుగుల మందు తాగింది. దీంతో రూరల్‌ పోలీసులు ఆమెను ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో దీప్తి మాట్లాడుతూ.. తనను శారీరకంగా వాడుకుని గర్భవతిని చేసిన పవన్‌ ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని, తల్లిదండ్రులు కూడా లేని తనకు న్యాయం చేయాలని తెలిపారు. గతంలో అబార్షన్‌ చేయించుకోవాలని సూచించగా, భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంతో పాటు చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. అంతేకాక కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్న పవన్‌కృష్ణ, తనపై దుష్ప్రచారం చేయడంతో పాటు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిపారు. ఈమేరకు అధికారులు స్పందించిన పవన్‌తో తన పెళ్లి జరిపించాలని ఆమె కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top