
పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి..
గర్భం దాల్చిన వైద్యురాలు..
పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
బంజారాహిల్స్(హైదరాబాద్): నా తల్లితో ఆస్తి గొడవలు ఉన్నాయి..నా భార్య నాతో సఖ్యంగా ఉండదు..అందుకే విడాకులు తీసుకుంటున్నాం..అందుకు సంబంధించిన విడాకులు పత్రాలు ఇవిగో అంటూ వైద్యురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. చివరకు సదరు వైద్యుడి అసలు నిజ స్వరూపం తెలియడంతో తాను మోసపోయానని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన భరత్ గెరా నగరంలోని కొండాపూర్ ప్రైమ్ స్ప్లైండర్‌లో ఉంటూ బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–2లోని డెరెడియా లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో హెచ్‌ఆర్ ఆపరేషనల్ హెడ్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేస్తున్న ఓ వైద్యురాలితో అతడికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో భరత్ సదరు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తనకు గతంలోనే వివాహం జరిగిందని, తన భార్యతో గొడవల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. న్యాయవాది ఎదుట ఇద్దరూ సంతకం చేసిన పత్రాలను కూడా ఆమెకు చూపించాడు. తన తల్లికి తనకు ఆస్తి గొడవలు ఉన్నాయని, తల్లి, సోదరుడు ఢిల్లీలో ఉంటారని చెప్పాడు.
ఈ క్రమంలో మార్చి 31న కంపెనీ పనిపై చంఢీఘడ్ వెళుతున్న భరత్ సదరు వైద్యురాలిని కూడా తీసుకెళ్లి అక్కడ హోటల్ రూంలో బస చేశారు. ఆ సమయంలో భరత్ ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత భరత్‌ను కంపెనీ యాజమాన్యం ఉద్యోగంలో నుంచి తొలగించగా, అతడితో పాటు సదరు యువతి కూడా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఇద్దరూ కలిసి సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పెట్టుబడి నిమిత్తం ఆమె నుంచి భరత్ రూ.2.5 లక్షలు తీసుకున్నాడు.
అంతేగాక భరత్ సదరు యువతి ఫోన్‌లో లోకేషన్‌ను ట్రాక్ చేసి ఆమె ఎక్కడికి వెళ్తుందని ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె భరత్‌తో మాట్లాడేందుకు అతని ఇంటికి వెళ్లగా అతడి భార్య ఇంట్లో ఉండటాన్ని చూసి షాక్‌కు గురైంది. ఆరు నెలల గర్భవతిగా ఉన్న అతని భార్య కూడా వైద్యురాలిని అసభ్యంగా దూషించడమేగాక వివాహితుడితో ఎందుకు సంబంధం కొనసాగిస్తున్నావంటూ నిలదీసింది. ఆ తర్వాత భరత్, అతని భార్య పూణెకు మకాం మార్చారు. కొన్ని రోజుల తర్వాత గర్భం దాల్చిన బాధితురాలు భరత్ తనను శారీరకంగా, ఆర్థికంగా వాడుకుని మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.