ఆర్నెల్ల కూతురితో కలిసి.. ఆరో అంతస్తు నుంచి దూకి | woman fell to her death from a sixth-floor apartment in Miyapur | Sakshi
Sakshi News home page

ఆర్నెల్ల కూతురితో కలిసి.. ఆరో అంతస్తు నుంచి దూకి

Jun 13 2026 5:20 AM | Updated on Jun 13 2026 12:27 PM

woman fell to her death from a sixth-floor apartment in Miyapur

మృతి చెందిన తల్లి...ఇనుప కంచెకు డ్రెస్‌ చిక్కుకొని ప్రాణాలతో బయటపడిన చిన్నారి

మియాపూర్‌ మయూరీనగర్‌లో ఘటన

హైద‌రాబాద్‌: ఆరు నెలల చిన్నారితో కలిసి ఓ సాఫ్ట్‌వేర్‌ మహిళ తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ ఆరవ అంతస్తుపై నుంచి కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా ప్రహరీ గోడపై ఉన్న ఇనుప కంచెకు డ్రెస్‌ చిక్కుకొని గాయాలతో చిన్నారి బయటపడింది. ఈ ఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. సీఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన భూపేంద్ర సాహు, మధ్యప్రదేశ్‌లోని భూత్‌గావ్‌కు చెందిన ఈషా సాహు (37)లకు 2015లో వివాహం జరిగింది.

గత ఎనిమిదేళ్లుగా వీరు మియాపూర్‌ మయూరీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ రెండవ అంతస్తులో ఉంటున్నారు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురుకు ఎనిమిదేళ్లు, మరో చిన్నారికి ఆరు నెలలు. ప్రస్తుతం ఈషా సాహు ప్రసూతి సెలవులో ఉంది. కొన్ని నెలలుగా ఈషా సాహు తల్లిదండ్రుల ఊళ్లోనే ఉంది. నెల రోజుల క్రితం నాగపూర్‌లోని అత్తారింటికి వెళ్లింది. పెద్ద కూతురుకు స్కూళ్లు ప్రారంభం కావడంతో గత నెల 30న ఆమె తన భర్త, పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది.

సరుకులు తీసుకురమ్మని.. 
కాగా, శుక్రవారం మధ్యాహ్నం ఈషా సాహు తన భర్త భూపేంద్ర సాహు, పెద్ద కూతురు విధిని సరుకులు తీసుకురావాలని చెప్పి డీమార్ట్‌కు పంపించింది. సాయంత్రం సమయంలో ఆరు నెలల కూతురు వాణితో కలిసి ఆమె ఓ బకెట్‌ తీసుకొని ఆరవ ఫ్లోర్‌కు వెళ్లింది. బకెట్‌ పైకి ఎక్కి గోడ మీద నుంచి చిన్నారితో కలిసి ఆమె కిందికి దూకింది. తీవ్ర గాయాలతో ఈషా సాహు అక్కడికక్కడే మృతి చెందగా అపార్ట్‌మెంట్‌ ప్రహరీగోడపై ఉన్న ఇనుప కంచెకు చిన్నారి డ్రెస్‌ చిక్కుకొని స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గమనించి భర్త భూపేంద్ర సాహు, మియాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా ఈషా సాహు మృతి చెందగా, పక్కనే ఉన్న ప్రహరీగోడ ఇనుప కంచెకు గౌను చిక్కుకొని చిన్నారి వేలాడుతూ కనిపించింది. పోలీసులు చిన్నారిని కంచె నుంచి తొలగించి ఆస్పత్రికి తరలించారు. ‘ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నా.. మీరందరూ సంతోషంగా ఉండండి.. నన్ను క్షమించండి’అంటూ ఈషా సాహు ఓ నోట్‌లో రాసిందని పోలీసులు తెలిపారు. కాగా ఆరు నెలలుగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement