మహబూబ్ నగర్ జిల్లా: తనను అనుమానిస్తూ.. వేధిస్తున్నాడనే కోపంతో భర్త తలపై పారతో కొట్టడంతో భర్త మృతిచెందాడు. గోపాల్‌పేట ఎస్‌ఐ జగన్‌మోహన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని ఏదుట్ల గ్రామానికి చెందిన శానాపల్లి చిన్నమల్లయ్య (40), శివమ్మ భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గొర్లు, మేకలు పెంచుకుని జీవనం సాగిస్తున్నారు. ఇంటివద్ద స్థలం లేకపోవడంతో జీవాలను మల్లయ్య తన బామ్మర్ది ఇంటివద్దే ఆపేవాడు.
అయితే కొంతకాలంగా మల్లయ్య తన భార్యపై అనుమానం పెంచుకొని తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే శనివారం మల్లయ్య, తన భార్య శివమ్మ గొర్లు నిలిపే ఇంటివద్దకు వెళ్లగా.. అప్పటికే మల్లయ్య మద్యం తాగి ఉండటంతో ఇద్దరికీ మాటామాటా పెరిగింది. దీంతో క్షణికావేశానికి లోనైన శివమ్మ ఇంటి ముందున్న పార తీసుకుని మల్లయ్య తలపై బాదడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఆ తర్వాత భర్త ఇంటి గడపమీద పడి మరణించాడని చెప్పి అందరినీ నమ్మించింది. మల్లయ్య అన్న వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివమ్మను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో తాను పారతో కొడితేనే మృతిచెందాడని ఒప్పుకోవడంతో అదుపులోకి తీసుకున్నారు.


