సర్పగండం: 20 ఏళ్లలో 12 లక్షల మంది పాముకాట్లకు బలి | Sakshi
Sakshi News home page

సర్పగండం: 20 ఏళ్లలో 12 లక్షల మంది పాముకాట్లకు బలి

Published Fri, Aug 12 2022 11:01 AM

WHO Revealed Snakebite Deaths High in India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పాముకాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు అంటే 20 ఏళ్లలో ఏకంగా 12 లక్షల మంది పాముకాటుతో మృతిచెందారని తెలిపింది. అంటే ఏటా సరాసరి 58 వేల మంది చనిపోయారని, పోస్ట్‌మార్టం నివేదికల ఆధారంగానే ఈ లెక్కలు వేసినట్లు స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది.

కానీ కేంద్ర, రాష్ట్రాలు మాత్రం ఆ సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నాయని ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2017లో 1,068 మంది, 2018లో 1,060 మంది, 2018లో 885 మంది పాముకాటుతో చనిపోయారని.. కానీ కేంద్రం లెక్కిస్తున్న దానికన్నా పాముకాటు మృతుల సంఖ్య 60 రెట్లు అధికంగా ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో నివేదిక పేర్కొంది.

విరుగుడుకు కొరత...
దేశంలో కట్లపాము, తాచుపాము, రెండు రకాల రక్తపింజరల వల్ల ఎక్కువగా పాముకాట్లు, మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే నాలుగు కంపెనీలే ఆ నాలుగు రకాల పాముల విషానికి విరుగుడు (యాంటీవీనం) తయారు చేస్తున్నాయని, కానీ వాటి తయారీ ప్రక్రియలో నాణ్యత ఉండటం లేదని వ్యాఖ్యానించింది. దేశంలో ఏటా 15 లక్షల వయల్స్‌ యాంటీవీనం ఉత్పత్తి అవుతుండగా ఒక్కో పాముకాటు బాధితుడికి అవసరాన్ని బట్టి 10 నుంచి 20 వయల్స్‌ అవసరమవుతాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

అంటే ఏటా కేవలం లక్ష మంది పాముకాటు బాధితులకే విరుగుడు మందు అందుబాటులో ఉందని వివరించింది. ఒక అంచనా ప్రకారం దేశంలో ఏటా సరాసరి 10 లక్షల మంది పాముకాటుకు గురవుతున్నారు. కానీ లక్ష మంది బాధితులకు సరిపోయే వయల్స్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బాధితులకు పూర్తిస్థాయిలో మందు దొరకడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

చదవండి: (ఎన్నేళ్ల నాటి పగ ఇది.. పాము కాటుకు కుటుంబంలో ఇద్దరు మృతి)

జూన్‌–సెప్టెంబర్‌ మధ్యే 80% పాముకాట్లు...
90% పాముకాట్లు కట్లపాము, తాచుపాము, రెండు రకాల రక్తపింజర వల్ల జరుగుతున్నాయి. 
పాముకాటు మరణాలకు 10 రెట్లు ఎక్కువగా బాధితులు అంగవైకల్యానికి గురువుతున్నారు.
పాముకాటు కేసుల్లో 30% పూర్తిస్థాయిలో విషం మనిషి శరీరంలోకి వెళ్తోంది. ప్రపంచ సగటు కంటే ఇది ఎక్కువ. దీనికి ప్రధాన కారణం గ్రామాల నుంచి సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లే సౌకర్యం లేకపోవడం, పాముకాటు వైద్యం పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడమే. 
పాము కాటేశాక పల్లెల్లో చాలా మంది పసర వైద్యం తీసుకుంటున్నారు. దీనివల్ల కూడా మరణాలు సంభవిస్తున్నాయి.
80% పాము కాట్లు జూన్‌–సెప్టెంబర్‌ మధ్యనే జరుగుతుంటాయి. వానాకాలం కావడం, రైతులు, కూలీలు పొలాలకు వెళ్తుండటమే దీనికి కారణం.
14% పాముకాటు కేసుల్లో పాము కరిచిన జాడలు కనిపించడంలేదు. 
10–19 ఏళ్ల వయసు వారే ఎక్కువగా పాముకాటుకు గురవుతున్నారు. 
67% పాటుకాట్లు కాళ్లపైనే జరుగుతున్నాయి.
40% పాముకాట్లు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్యలోనే చోటుచేసుకుంటున్నాయి.
60% పాముకాట్లు ఇంట్లో లేదా ఇంటికి దగ్గరలో జరుగుతుంటాయి. 8% పాముకాట్లు మల విసర్జనకు వెళ్లినప్పుడు సంభవిస్తున్నాయి. 10% పాముకాట్లు నిద్రపోయే సమయంలో జరుగుతున్నాయి.
పాముకాటు మరణాల్లో 90% గ్రామాల్లోనే సంభవిస్తున్నాయి.
పాముకాటు మరణాల్లో 77% ఆసుపత్రి బయటే జరుగుతున్నాయి.
దేశంలో సంభవించే మరణాల్లో 0.5% పాముకాటుతోనే జరుగుతున్నాయి.

దోమతెరలతో రక్షణ పొందొచ్చు..
నేలపై పడుకున్నప్పుడు పాము కాటుకు గురైతే విషం సాధారణంకంటే 6 రెట్లు వేగంగా ఒంట్లోకి వ్యాపిస్తుంది. దోమతెరలు వాడితే పాముకాటు నుంచి బయటపడొచ్చు. అలాగే ఎలుకలు ఎక్కువగా తిరిగే ధాన్యం నిల్వ ఉంచిన గదులు, వంటింటి దగ్గర్లోనే పాములు వాటిని తినేందుకు వస్తుంటాయి కాబట్టి అక్కడ పడుకోవద్దు. ఇంటి చుట్టపక్కల వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేసుకోవాలి.
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ  

Advertisement
Advertisement