పోల‌వ‌రం ప్రాజెక్టుకు మేం అడ్డుకాదు.. కానీ

We Will Not Oppose Polavaram, Telangana Wrote A letter - Sakshi

తెలంగాణలో ముంపు సమస్యలను పరిష్కరించాలి 

పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు తెలంగాణ లేఖ 

సాక్షి, హైదరాబాద్‌ : గోదావరి జలాలను వినియోగించుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ చేపట్టిన పోలవరం ప్రాజెక్టుకు తామేమాత్రం అడ్డుకాదని తెలంగాణ మరోమారు స్పష్టం చేసింది. అయితే పోలవరం బ్యాక్‌వాటర్‌తో ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ఎదుర్కొనే సమస్యలను పరిగణనలోకి తీసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం, ఏపీలపై ఉందని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నుంచి వరదను దిగువకు విడుదల చేసే సామర్థ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచుతూ డిజైన్‌ మార్చారని ఎత్తిచూపింది. మార్చిన డిజైన్‌కు అనుగుణంగా బ్యాక్‌వాటర్‌తో తెలంగాణ ప్రాంతాల మీద పడే ప్రభావంపై  అధ్యయనం చేసి... ముంపు ప్రాంతాలను గుర్తించి, వాటికి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోకు లేఖ రాసింది. గత నెల 14న పోలవరం అథారిటీ, కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా జరిగిన నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వం తన పరిశీలనలను, వివరణలను ఈ లేఖలో పేర్కొంది.  

గరిష్ట నీటి నిల్వ ఎన్నిరోజులో చెప్పాలి 
పోలవరంలో గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయడం వల్ల కిన్నెరసాని నదిలోకి వరద ఎగబాకుతుందని, దీనివల్ల ఎక్కువ ముంపు సమస్య వస్తుందని తెలిపింది. బూర్గంపాడు మండలంలో కేవలం 200 ఎకరాలు మాత్రమే ముంపు ఉంటుందని ఏపీ చెబుతోందని, నిజానికి 45 వేల ఎకరాలకు పైగా ముంపు ఉంటుందని సీఈవో దృష్టికి తెచ్చింది. బ్యాక్‌వాటర్‌తో మణుగూరు విద్యుత్‌ ప్లాంటు, సీతారామస్వామి దేవాలయం, భద్రాచలానికి నష్టం వాటిల్లకుండా, దేవాలయానికి వచ్చే యాత్రికులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని వివరించింది. ఈ దృష్ట్యా బ్యాక్‌వాటర్‌ ప్రభావాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని కోరింది. బ్యాక్‌వాటర్‌ ప్రభావంపై అధ్యయనం చేయకుండా, ముంపు ప్రాంతాలను గుర్తించకుండా ప్రాజెక్టును నిర్మించడం సహేతుకం కాదని తెలిపింది. పోలవరంలో ఏడాదిలో ఎన్నిరోజులు గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేస్తారని ప్రశ్నిస్తే పోలవరం అథారిటీ, ఏపీ సమాధానం చెప్పడం లేదని, దీనిపై సరైన వివరణ ఇవ్వాలని తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top