
వర్షాలతో తెలంగాణలోని జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కొండల నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహాలను చూసి సందర్శకులు పులకించిపోతున్నారు. జలకాలాటలతో సందడిగా గడుపుతున్నారు.
సందడిగా బొగత..
ములుగు జిల్లా వాజేడు మండల పరిధి చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకుంది. చిలుకల పార్క్, ప్రకృతి అందాలను వీక్షిస్తూ పర్యాటకులు ఆనందంగా గడిపారు.
– వాజేడు
సదర్‌మాట్‌కు జలకళ
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, కడెం మండలాల ఆయకట్టుకు సాగు నీరందించే సదర్‌మాట్ 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలకళ సంతరించు కుంది. కనీస నీటిమట్టం 7.6 అడుగులు కాగా ప్రస్తుతం 8 అడుగుల మేర నుంచి వరద వెళుతోంది. జల సోయగాన్ని తిలకించేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.
– ఖానాపూర్
ఆహ్లాదం.. భీమునిపాదం
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు కొమ్ములవంచ సమీపంలోని అటవీ ప్రాంతంలో భీమునిపాదం జలపాతం కనువిందు చేస్తోంది. ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి గుట్టలపైనుంచి వరద నీరు జలపాతానికి చేరడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది.
– గూడూరు
జలజల జలపాతం..
ఇటీవల కురిసిన వర్షాలతో కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. శని, ఆదివారాల్లో భారీవర్షాలు కురవడంతో జలపాతం ఉధృతి పెరిగింది.
దీంతో పర్యాటకుల రద్దీ నెలకొంది.
– సైదాపూర్ (హుస్నాబాద్)
కన్నుకుట్టేలా.. మిట్టే
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మిట్టే జలపాతం జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ వాగుపై సప్తగుండాలు ఉండటం విశేషం.
– సిర్పూర్ (యూ) (ఆసిఫాబాద్)