అప్రూవర్‌గా దస్తగిరి చట్టవిరుద్ధం.. హైకోర్టులో వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్‌  

Viveka Pa Mv Krishna Reddy Petition In High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డిని తామే హత్య చేశామని ఒప్పుకున్న నిందితుడు (ఏ–4) దస్తగిరిని అప్రూవర్‌గా పేర్కొంటూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం చట్టవిరుద్ధం. ఆ ఉత్తర్వులను కొట్టివేయాలి’ అని వివేకా వ్యక్తిగత కార్యదర్శి, ఏపీలోని వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఎంవీ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. స్వయంగా హత్యలో పాల్గొన్న దస్తగిరికి బెయిల్‌ ఇవ్వడం కూడా సరికాదన్నారు.

‘దస్తగిరి విషయంలో వివేకా కుమార్తె సునీత వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగా ఉంది. అతనికి బెయిల్‌ ఇవ్వడం, అప్రూవర్‌గా మార్చడంపై ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆ అంశాన్ని ఏ కోర్టులోనూ సవాల్‌ చేయడం లేదు. ప్రశ్నించడం లేదు. అతన్ని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు. వివేకాను హత్య చేయడానికి నగదు తీసుకున్నానని, చంపడం కోసం గొడ్డలి కూడా కొనుగోలు చేశానని అతను ఒప్పుకున్నాడు.

అలాంటి హంతకుడైన దస్తగిరిని క్షమించడం చట్టవిరుద్ధం. వివేకాతో అతనే బలవంతంగా లేఖ రాయించినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. తద్వారా డ్రైవర్‌ను ఇరికించాలని పథకం వేశాడు’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘షమీమ్‌ అనే ముస్లిం మహిళను వివేకా వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కోపంతో సునీత.. వివేకాను దూరం పెట్టారు. వివేకా మృతి చెందే వరకు ఆమె మాట్లాడ లేదు’ అని కృష్ణారెడ్డి తెలిపారు.

వివేకా తన ఆస్తులను కుమారుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని, బెంగళూరులోని ఓ భూమి సెటిల్‌మెంట్‌లో వచ్చే రూ.8 కోట్లను షమీమ్, కుమారుడికి ఇవ్వాలని భావించారని చెప్పారు. ‘ఇదంతా సునీతకు, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి తెలుసు. వివేకాను కట్టడి చేయాలని వారు ప్రయత్నించారు. అయినా వివేకా వినక పోవడంతో ఆస్తులను కాపాడుకునేందుకు దస్తగిరి, ఇతర నిందితులకు వారే డబ్బిచ్చి ఉండవచ్చు.

చాలా కాలంగా నేను వివేకా వద్ద పనిచేస్తున్నా. వారి కుటుంబ వివాదాలు బాగా తెలుసు. వివేకాను హత్యచేయాల్సిన అవసరం ఆయన కుటుంబ సభ్యులకే ఎక్కువగా ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని దస్తగిరి అప్రూవర్‌ ఉత్తర్వులను కొట్టివేయాలి’ అని కృష్ణారెడ్డి పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిన్‌ కె.సురేందర్‌ గురువారం విచారణ చేపట్టారు. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. కాగా, ఈ పిటిషన్‌లో కూడా సునీత ఇంప్లీడ్‌ అయ్యారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top