గూగుల్‌ వచ్చినా గురువుకు సాటి రాలేదు  | Sakshi
Sakshi News home page

గూగుల్‌ వచ్చినా గురువుకు సాటి రాలేదు 

Published Fri, Oct 14 2022 8:49 AM

Venkaiah Naidu Said No Match For The Guru Who Came Fom Google - Sakshi

సుల్తాన్‌బజార్‌: గూగుల్‌ వచ్చినా గురువుకు ఏ మాత్రం సాటి రాలేదని, గూగుల్‌ అందించేది సమాచారం మాత్రేమేనని గురువులు మాత్రమే విజ్ఞానంతో పాటు, ఆ విజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న వివేకాన్ని ప్రసాదిస్తారని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆడిటోరియంలో పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పురస్కారాన్ని ప్రముఖ రచయిత దూరదర్శన్‌ పూర్వ సహాయ డైరెక్టర్‌ జనరల్‌ రేవూరి అనంత పద్మనాభరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తనకు జీవితంలో లభించిన ఉన్నతమైన గురువుగా హనుమజ్జానకీ రామశర్మ స్థానం తన మనస్సులో పదిలంగా నిలిచిందన్నారు.

అందుకే తన పేరున ఏర్పాటు చేస్తామన్న అవార్డును గురువుల గొప్పతనం ముందు తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో గురువు పేరిట ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. జానకీరామ శర్మ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు  తెలిపారు. నేటికీ నిత్య విద్యార్థిగా పరిశోధనలు కొనసాగిస్తున్న పద్మనాభరావు జానకీరామ శర్మ ప్రియ శిష్యుల్లో ఒక్కరన్నారు. అలాంటి వ్యక్తికి మరో శిష్యుడు అవార్డు అందించడం ద్వారా జానకీరామశర్మ ఆత్మ సంతృప్తి చెందుతుందన్నారు. తన గురువు జానకిరామశర్మ సాక్షాత్తు సరస్వతి సరూపమని కొనియాడారు.

తమ సంస్కృతిని ముందు తరాలకు తెలియజేసే చక్కని వారధి మన భాషే అనే సత్యాన్ని  గుర్తించాలన్నారు. భాషను కాపాడుకుంటే సాహిత్యం ద్వారా సంస్కృతిని భావితరాలకు అందించవచ్చన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్‌లాంటి సంస్థలు చొరవ తీసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషను నేర్పించే వినూత్న పద్ధతులపై దృష్టి పెట్టాలని  సూచించారు. ఈ సందర్భంగా అనంత పద్మనాభరావు రచించిన ఆచార్య దేవోభవ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జె.చెన్నయ్య, శాంత బయోటెక్‌ వ్యవస్థాపకులు వరప్రసాద్‌రెడ్డిలతో పాటు సాహితీవేత్తలు పాల్గొన్నారు.  

(చదవండి:  చదువులు సాగేదెలా?)

Advertisement
Advertisement