breaking news
Telangana Saraswat Parishad
-
గూగుల్ వచ్చినా గురువుకు సాటి రాలేదు
సుల్తాన్‌బజార్: గూగుల్ వచ్చినా గురువుకు ఏ మాత్రం సాటి రాలేదని, గూగుల్ అందించేది సమాచారం మాత్రేమేనని గురువులు మాత్రమే విజ్ఞానంతో పాటు, ఆ విజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న వివేకాన్ని ప్రసాదిస్తారని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పురస్కారాన్ని ప్రముఖ రచయిత దూరదర్శన్ పూర్వ సహాయ డైరెక్టర్ జనరల్ రేవూరి అనంత పద్మనాభరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తనకు జీవితంలో లభించిన ఉన్నతమైన గురువుగా హనుమజ్జానకీ రామశర్మ స్థానం తన మనస్సులో పదిలంగా నిలిచిందన్నారు. అందుకే తన పేరున ఏర్పాటు చేస్తామన్న అవార్డును గురువుల గొప్పతనం ముందు తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో గురువు పేరిట ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. జానకీరామ శర్మ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. నేటికీ నిత్య విద్యార్థిగా పరిశోధనలు కొనసాగిస్తున్న పద్మనాభరావు జానకీరామ శర్మ ప్రియ శిష్యుల్లో ఒక్కరన్నారు. అలాంటి వ్యక్తికి మరో శిష్యుడు అవార్డు అందించడం ద్వారా జానకీరామశర్మ ఆత్మ సంతృప్తి చెందుతుందన్నారు. తన గురువు జానకిరామశర్మ సాక్షాత్తు సరస్వతి సరూపమని కొనియాడారు. తమ సంస్కృతిని ముందు తరాలకు తెలియజేసే చక్కని వారధి మన భాషే అనే సత్యాన్ని గుర్తించాలన్నారు. భాషను కాపాడుకుంటే సాహిత్యం ద్వారా సంస్కృతిని భావితరాలకు అందించవచ్చన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్‌లాంటి సంస్థలు చొరవ తీసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషను నేర్పించే వినూత్న పద్ధతులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అనంత పద్మనాభరావు రచించిన ఆచార్య దేవోభవ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, శాంత బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్‌రెడ్డిలతో పాటు సాహితీవేత్తలు పాల్గొన్నారు. (చదవండి: చదువులు సాగేదెలా?) -
కాలానికి నిలిచిన ‘గడియారం’ కృషి
అతడు నిజంగానే అనేక యుద్ధములలో ఆరితేరిన వృద్ధమూర్తి. జీవించింది ఎనభై ఏడేళ్ళు. స్వాతంత్య్రోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభలు, సంఘ సంస్కరణ, నిజాం వ్యతిరేక పోరాటం, ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదలైన ఉద్యమాల్లో పాల్గొన్న వజ్ర సంకల్ప సదృశ నాయకత్వం, కవితా రచన, పత్రికా రచన, శాసన పరిశోధన, కావ్యాలంకార నాటక వ్యాకరణాది శాస్త్ర పాండిత్యం, అనువాదం, నాటక సమాజస్థాపన, నటన, దర్శకత్వం వంటి సాంస్కృతికాభ్యుదయ శాఖల్లో సాంద్రతరమైన కృషితో తాను సంచరించిన తెలంగాణను వెలిగించిన బహుముఖీన ప్రతిభామూర్తి గడియారం రామకృష్ణశర్మ. 1919 మార్చి 6 న అనంతపురం జిల్లాలో జన్మించారు. బాల్యదశలోనే తెలంగాణలోని ఆలంపురం వచ్చారు. ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్య సాఫీగా సాగలేదు. 4వ తరగతిలో లెక్కల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడంతో ఆగిపోయింది. కానీ ఆ కాలంలో తెలుగుమీద విశేషమైన అభిమానాన్ని ఏర్పరుచుకొని నవలలు, కాశీమజిలీ కథలు, మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైన ప్రబంధాలు అధ్యయనం చేశారు. 16 ఏండ్ల వయసులో పద్యరచన ప్రారంభించారు. సంçస్కృతంలో కావ్య, నాటక, అలంకార శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఆంధ్ర యువజన నాట్యమండలిని స్థాపించి పదేళ్లు తానే సంస్థ నిర్వాహకునిగా, నాటక దర్శకునిగా, ప్రధాన పాత్రల నటునిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్ర మహాసభకు తాలూకా కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. పల్లెల్లో గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలల స్థాపన, స్థానికంగా, రాష్ట్రస్థాయిలో జరిగే సభలు, సమావేశాలకు వెళ్ళడంతో ముఖ్య నాయకునిగా రూపొందారు. 1942 మే నెలలో వరంగల్ సమీపంలోని ధర్మవరంలో నవమ ఆంధ్ర మహాసభ, 1943 మేలో హైదరాబాద్ రెడ్డి హాస్టల్లో దశమాంధ్ర మహాసభ జరిగాయి. అప్పుడే ‘నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రారంభమైంది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా బులెటిన్లు విడుదల చేస్తూ ‘భాగ్యనగర్ రేడియోను’ ప్రారంభించి ప్రచారం చేశారు. కర్నూలు జిల్లా నిడుజురాలో పదేళ్ళ వయసు గల బాల వితంతువుకు పునర్వివాహం చేయించారు. అట్లా 5–6 వితంతు పునర్వివాహాలు చేయించడమే గాక స్వయంగా వితంతువును వివాహం చేసుకున్నారు. కులబహిష్కార దండనను ధైర్యంగా ఎదు ర్కొని నిలిచారు. 1953లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆలంపురంలో సప్తమ మహాసభలు జరుపుకున్నది. సభల్లో 30వేల మంది పాల్గొనడం ఒక రికార్డు. 1953లో గడియారం ‘సుజాత’ పత్రికను తిరిగి ప్రారంభించి మూడేళ్ళపాటు నడిపారు. తెలంగాణ ప్రత్యేక సంచికను వెలువరించారు. లిపిశాస్త్రం, శాసన శాస్త్రాలపై ప్రావీణ్యం సముపార్జించారు. బ్రహ్మీ, వేంగీ లిపి, తెలుగన్నడ లిపి, తెలుగు లిపి, నాగరిలిపులను నేర్చుకున్నారు. ఆలంపూరులోని దాదాపు అన్ని శాసనాలకు పాఠాలు తయారు చేశారు. లక్ష్మణరాయ పరిశోధక మండలిలో వున్న శాసన ప్రతి కృతులను చదివి తెలంగాణ శాసనాల రెండో భాగానికి సంపాదకత్వం వహిం చారు. ‘ఆలంపూరు శిథిలాలు’, ‘ఆలంపూరు చరిత్ర’, ‘దక్షిణ వారణాసి’, ‘దిమాన్యుమెంట్స్ ఆఫ్ ఆలంపూరు’, ‘ఉమామహేశ్వర చరిత్ర’, ‘బీచుపల్లి క్షేత్ర చరిత్ర’, ‘అనిమెల సంగమేశ్వర చరిత్ర’ రాశారు. పరిషత్తు విద్యార్థులకోసం ‘భారతదేశ చరిత్ర’ను నూతన దృక్పథంతో రాశారు. దేవాలయ నిర్మాణ రీతులను అధ్యయనం చేసి ‘భారతీయ వాస్తు విజ్ఞానము’, ‘మన వాస్తు సంపద’, ‘ఆంధ్రుల వాస్తు వైభవం’ గ్రంథాలను ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యునిగా సేవలందించారు. విశిష్ట సభ్యునిగా గౌరవించబడ్డారు. మంచన ‘కేయూర బాహు చరిత్ర’, కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’లను పరిష్కరించి విపుల పీఠికలు రాశారు. కన్నడలోని ‘కవి గదాయుద్ధ’ కావ్యాన్ని, ‘కన్నడ సణ్ణక తెగళ్ళు’ అనే గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ కోసం తెలుగులోకి అనువాదం చేశారు. గదాయుద్ధానికి అనువాద పురస్కారం లభించింది. కాలంతో పోటీపడి అవిరళ కృషి చేసిన గడియారం రామకృష్ణ శర్మ 25 జూలై 2006న కన్నుమూశారు. (తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నేడు గడియారం శతజయంతి సమాపనోత్సవం) వ్యాసకర్త: డా, జె.చెన్నయ్య తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి -
సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా శివారెడ్డి
సినారె స్థానంలో శివారెడ్డి ఎన్నిక హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఎన్నికయ్యారు. 24 ఏళ్లుగా పరిషత్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇటీవల కీర్తిశేషులు కావడంతో ఆయన స్థానంలో శివారెడ్డి ఎన్నికయ్యారు. పరిషత్ కార్యవర్గం, సర్వసభ్య మండలి సమావేశమై శివారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇప్పటివరకు పరిషత్ ట్రస్టు కార్యదర్శిగా కొనసాగిన శివారెడ్డి ఆ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జె.చెన్నయ్య ట్రస్టు కార్యదర్శిగా కూడా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. శనివారం శివారెడ్డి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సినారె అందించిన స్ఫూర్తితో పరిషత్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని శివారెడ్డి తెలిపారు. ఇందుకు అందరి సహకారం తీసుకొని పరిషత్‌ను తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతానన్నారు.