కాలానికి నిలిచిన ‘గడియారం’ కృషి

Chennayya Writes a Special Story On Gadiyaram Ramakrishna Sharma - Sakshi

సందర్భం

అతడు నిజంగానే అనేక యుద్ధములలో ఆరితేరిన వృద్ధమూర్తి. జీవించింది ఎనభై ఏడేళ్ళు. స్వాతంత్య్రోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభలు, సంఘ సంస్కరణ, నిజాం వ్యతిరేక పోరాటం, ఆంధ్ర సారస్వత పరిషత్తు మొదలైన ఉద్యమాల్లో పాల్గొన్న వజ్ర సంకల్ప సదృశ నాయకత్వం, కవితా రచన, పత్రికా రచన, శాసన పరిశోధన, కావ్యాలంకార నాటక వ్యాకరణాది శాస్త్ర పాండిత్యం, అనువాదం, నాటక సమాజస్థాపన, నటన, దర్శకత్వం వంటి సాంస్కృతికాభ్యుదయ శాఖల్లో సాంద్రతరమైన కృషితో తాను సంచరించిన తెలంగాణను వెలిగించిన బహుముఖీన ప్రతిభామూర్తి గడియారం రామకృష్ణశర్మ. 

1919 మార్చి 6 న అనంతపురం జిల్లాలో జన్మించారు. బాల్యదశలోనే తెలంగాణలోని ఆలంపురం వచ్చారు. ఉర్దూ మాధ్యమంలో ప్రాథమిక విద్య సాఫీగా సాగలేదు. 4వ తరగతిలో లెక్కల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడంతో ఆగిపోయింది. కానీ ఆ కాలంలో తెలుగుమీద విశేషమైన అభిమానాన్ని ఏర్పరుచుకొని నవలలు, కాశీమజిలీ కథలు, మనుచరిత్ర, వసుచరిత్ర మొదలైన ప్రబంధాలు అధ్యయనం చేశారు. 16 ఏండ్ల వయసులో పద్యరచన ప్రారంభించారు. సంçస్కృతంలో కావ్య, నాటక, అలంకార శాస్త్రాలను అధ్యయనం చేశారు. ఆంధ్ర యువజన నాట్యమండలిని స్థాపించి పదేళ్లు తానే సంస్థ నిర్వాహకునిగా, నాటక దర్శకునిగా, ప్రధాన పాత్రల నటునిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్ర మహాసభకు తాలూకా కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. పల్లెల్లో గ్రంథాలయాలు, రాత్రి పాఠశాలల స్థాపన, స్థానికంగా, రాష్ట్రస్థాయిలో జరిగే సభలు, సమావేశాలకు వెళ్ళడంతో ముఖ్య నాయకునిగా రూపొందారు. 

1942 మే నెలలో వరంగల్‌ సమీపంలోని ధర్మవరంలో నవమ ఆంధ్ర మహాసభ, 1943 మేలో హైదరాబాద్‌ రెడ్డి హాస్టల్‌లో దశమాంధ్ర మహాసభ జరిగాయి. అప్పుడే ‘నిజాం రాష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు’ ప్రారంభమైంది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా బులెటిన్లు విడుదల చేస్తూ ‘భాగ్యనగర్‌ రేడియోను’ ప్రారంభించి ప్రచారం చేశారు.  

కర్నూలు జిల్లా నిడుజురాలో పదేళ్ళ వయసు గల బాల వితంతువుకు పునర్వివాహం చేయించారు. అట్లా 5–6 వితంతు పునర్వివాహాలు చేయించడమే గాక స్వయంగా వితంతువును వివాహం చేసుకున్నారు. కులబహిష్కార దండనను ధైర్యంగా ఎదు ర్కొని నిలిచారు. 1953లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆలంపురంలో సప్తమ మహాసభలు జరుపుకున్నది. సభల్లో 30వేల మంది పాల్గొనడం ఒక రికార్డు.   

1953లో గడియారం ‘సుజాత’ పత్రికను తిరిగి ప్రారంభించి మూడేళ్ళపాటు నడిపారు. తెలంగాణ ప్రత్యేక సంచికను వెలువరించారు. లిపిశాస్త్రం, శాసన శాస్త్రాలపై ప్రావీణ్యం సముపార్జించారు. బ్రహ్మీ, వేంగీ లిపి, తెలుగన్నడ లిపి, తెలుగు లిపి, నాగరిలిపులను నేర్చుకున్నారు. ఆలంపూరులోని దాదాపు అన్ని శాసనాలకు పాఠాలు తయారు చేశారు. లక్ష్మణరాయ పరిశోధక మండలిలో వున్న శాసన ప్రతి కృతులను చదివి తెలంగాణ శాసనాల రెండో భాగానికి సంపాదకత్వం వహిం చారు. ‘ఆలంపూరు శిథిలాలు’, ‘ఆలంపూరు చరిత్ర’, ‘దక్షిణ వారణాసి’, ‘దిమాన్యుమెంట్స్‌ ఆఫ్‌ ఆలంపూరు’, ‘ఉమామహేశ్వర చరిత్ర’, ‘బీచుపల్లి క్షేత్ర చరిత్ర’, ‘అనిమెల సంగమేశ్వర చరిత్ర’ రాశారు. 

పరిషత్తు విద్యార్థులకోసం ‘భారతదేశ చరిత్ర’ను నూతన దృక్పథంతో రాశారు. దేవాలయ నిర్మాణ రీతులను అధ్యయనం చేసి ‘భారతీయ వాస్తు విజ్ఞానము’, ‘మన వాస్తు సంపద’, ‘ఆంధ్రుల వాస్తు వైభవం’ గ్రంథాలను ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ కార్యవర్గ సభ్యునిగా సేవలందించారు. విశిష్ట సభ్యునిగా గౌరవించబడ్డారు. మంచన ‘కేయూర బాహు చరిత్ర’, కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశిక’లను పరిష్కరించి విపుల పీఠికలు రాశారు. కన్నడలోని ‘కవి గదాయుద్ధ’ కావ్యాన్ని, ‘కన్నడ సణ్ణక తెగళ్ళు’ అనే గ్రంథాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ కోసం తెలుగులోకి అనువాదం చేశారు. గదాయుద్ధానికి అనువాద పురస్కారం లభించింది. కాలంతో పోటీపడి అవిరళ కృషి చేసిన గడియారం రామకృష్ణ శర్మ 25 జూలై 2006న కన్నుమూశారు. (తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నేడు గడియారం శతజయంతి సమాపనోత్సవం)

వ్యాసకర్త: డా, జె.చెన్నయ్య 
తెలంగాణ సారస్వత పరిషత్‌ ప్రధాన కార్యదర్శి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top