
గత వైభవాన్ని చాటుతున్న అలంపూర్ పురావస్తు ప్రదర్శనశాల
పర్యాటకులను మైమరిపించే శిల్ప సౌందర్యం
అంతర్జాతీయ ప్రదర్శనలతో ఖ్యాతి
అలంపూర్: అద్భుత శిల్పాల రమణీయం పురాతన శిల్ప సౌందర్యంలోనే కన్పిస్తుంది. పురాతన ఇతిహాసాలు, గాథలు, ప్రకృతి వింతలు, విశేషాలు, రాజరికపు గుర్తులు, సిరి సంపదలు, మనుషుల వేషధారణ, సంప్రదాయం వంటి అనేక అంశాలను శిల్పులు తమ శిల్ప కళ ద్వారా భావితరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. పురాతన చరిత్ర కలిగిన ప్రాంతాల్లో ఇలాంటి శిల్ప సంపదలు దర్శనమిస్తాయి. పురాతన ఇతిహాసాలకు, శిల్ప సౌందర్య కళకు అలంపూర్ పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది.
ఇక్కడ వెలసిన పురాతన ఆలయాల్లో శిల్పుల కళానైపుణ్యం పర్యాటకుల మనసులను రంజింపజేస్తాయి. అక్కడక్కడ కనిపించే శిల్పాలే పర్యాటకుల మనసులను ఆహ్లాదపరిస్తే.. అబ్బురపరిచే శిల్ప సమూహం ఒకే చోట కనిపిస్తే శిల్పాకళా ప్రేమికుల ఉల్లాసానికి అవధులుండవు. అలాంటి అద్భుత శిల్పాల సమూహం అలంపూర్ క్షేత్రం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ప్రాంతంలో లభించిన పురాతన, అరుదైన శిల్పాలను పురావస్తు శాఖ ఒక చోట భద్రపరిచింది. అదే పురాతన శిల్పాల ప్రదర్శన క్షేత్రం. పురావస్తు మ్యూజియంగా ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనకు అందుబాటులో ఉంచారు.

1952లో ప్రారంభం..
అలంపూర్‌లోని పురావస్తు ప్రదర్శనశాలను 1952లో ప్రారంభించారు. ఆలయాల పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో లభించిన శిలా శాసనాలు, విగ్రహాలు అన్నింటినీ సేకరించి సిద్ధుల మఠంగా పిలవబడే మండపంలో మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇందులో 26 శిలా శాసనాలు, 188 శిలా విగ్రహాలు ఉన్నాయి. క్షేత్రానికి వచ్చే పర్యాటకులు మ్యూజియాన్ని సందర్శించే అవకాశం కల్పించారు.
మ్యూజియంలో విశేషం ఇది..
ఉత్తరవాహిణి తుంగభద్ర నదీ తీరాన వెలసిన అలంపూర్ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీజోగుళాంబ అమ్మవారి ఐదవ శక్తి పీఠం ఇక్కడ ఉంది. కోటి లింగాల క్షేత్రంగా అలంపూర్ ప్రసిద్ధిగాంచి.. దక్షిణకాశీగా పిలవబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగల క్షేత్రంగా ఖ్యాతి దక్కించుకుంది. ఇక్కడ ఉన్న ఆలయాల్లో ప్రాచీన శిల్పకళకు అద్దంపట్టే శిల్పాలు పర్యాటకులను ఉల్లాసపరుస్తాయి. ఈ క్షేత్రంలో మరో అద్భుతమైన ప్రదేశం పురావస్తు ప్రదర్శనశాల.
6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు రాజుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వారిచే ఆరాధించబడిన దేవతా మూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. 6వ శతాబ్దంలోని బాదామి చాళుక్యుల కళాసంస్కృతికి ఇక్కడ వెలసిన శిల్పాలు నిదర్శనంగా ఉన్నాయి. 1500 ఏళ్ల క్రితం అలంకారానికి ఉపయోగించిన ఆభరణాలు, అప్పటి మహిళల వేషధారణ ఇక్కడి విగ్రహాలలో చూడవచ్చు.
ఈ ప్రదర్శన శాలలో వీరాంగవీరులు (భర్త, భార్య ఇద్దరూ శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన వారు), వీరుగల్లు, వీరశిలా విగ్రహాలు, వారి బల ప్రదర్శనలు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి. సతీ సహగమనానికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.

అంతర్జాతీయ ఖ్యాతి..
అలంపూర్‌లో లభ్యమై పురావస్తు మ్యూజియంలో భద్రపరిచిన శిల్పాలు దేశ విదేశాల్లో ఖ్యాతిని తెచి్చపెడుతున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శిల్పాలు కేవలం సందర్శనలకే గాక ప్రపంచ పురావస్తు శిల్పాల ప్రదర్శనలకు వెళ్లి అరుదైన గౌరవాలను దక్కించుకున్నాయి. 1977లో ఇక్కడి నటరాజ మూర్తి విగ్రహాన్ని లండన్‌లో ప్రదర్శించడం జరిగింది. అలాగే 1984లో సూర్య విగ్రహాన్ని జర్మనీలో, 2008లో సూర్య, నాగ, మహిషాసురమర్ధిని విగ్రహాలను బెల్జియంలో ప్రదర్శించగా ఖ్యాతి గడించాయి.
మంత్రముగ్ధులను చేసే విగ్రహాలు..
శిల్పాచార్యులు స్థానికంగా లభించే నల్లరాతి శిలతో అందంగా నటరాజ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహంలో కనిపించే శరీర సౌష్టవాలు నాట్యభంగిమలు నాట్యకళాకారులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదే విధంగా 7–8 శతాబ్దాలకు చెందిన సూర్య విగ్రహం కూడా మెత్తటి ఎర్రఇసుక, రాతిని ఉపయోగించి తయారు చేశారు. ‘సప్తాస్వ రథసమారూఢం’అన్నట్టుగా ఏడు గుర్రాలతో ఒకే చక్రం కలిగిన రథం, ఉషా, ఛాయా సమేతంగా సూర్య విగ్రహాన్ని అందంగా మలిచి ఉన్న ఈ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.
ఇక 6–7 శతాబ్దాలకు చెందిన నాగబంధ విగ్రహాన్ని పరిశీలిస్తే.. పద్మ బంధంలో ఏడు తలలు కలిగి మానవ ఆకృతిని పోలి ఉన్న నాగబంధ విగ్రహం కళాకారులను మనసు దోచుకుంటుంది. 7–8 శతాబ్దాలకు చెందిన మహిషాసురమర్దిని విగ్రహం కూడా అలనాటి దేవీభాగవతాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది.
అసుర సంహారం కోసం మహిషాసురిడిని సంహరించి మహిషి తలపై తాండవం చేస్తున్నట్టు ఆదిపరాశక్తి అభయముద్రలో దర్శనమిస్తుంది. అలాగే అలనాటి వైభవాన్ని చాటి చెప్పే స్తంభాలను నేటి తరాలవారిని అదరహో అనిపిస్తాయి. ఈ స్తంభంపై మలచబడిన శిల్పా ఆకృతులను పరిశీలిస్తే పట్టుచీరలపై ఉన్న బార్డర్ల డిజైన్‌లు తలపిస్తున్నాయి.

నంది వాహనంపై శివపార్వతులు..
పరమశివుడి రూపం ఎక్కడ చూసినా లింగరూపంలోనే దర్శనమిస్తుంది. సతీ సమేతుడై ఉన్న పార్వతీ పరమేశ్వరుడు నంది వాహనంపై ఆశీనులై దర్శనమివ్వడం అనేది చాలా అరుదు. కానీ అలంపూర్‌లో మాత్రం దేవతా స్వరూపంలో, అది కూడా శివుడు పార్వతీ సమేతుడై నంది వాహనంపై కూర్చుని ఉండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి విగ్రహం చూడాలంటే అలంపూర్ మ్యూజియానికి రావాల్సిందే.
శిలాశాసనం ద్వారా తెలిసేదేమిటంటే..
ఆలయాల మనుగడ కోసం ఆనాటి రాజులు ఎన్నో భూములను మాణ్యాలుగా సమర్పించారు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఈ మాణ్యాలు ఆలయాలకు చెందాల్సిందేనని.. అలాంటి మాణ్యాలను ఎవరైనా హస్తగతం చేసుకుంటే గోవధ చేసినంత పాపం వస్తుందని తెలియజేస్తూ ఆ శాసనంపై సూర్య, చంద్రులు, లింగం, ఆవు, ఖడ్గం వంటి బొమ్మలతో శిలాశాసనం చేశారు. అది హలగన్నడ లిపిలో కనిపిస్తుంది.