Archaeological Museum
-
అద్భుత శిల్పాల మ్యూజియం
అలంపూర్: అద్భుత శిల్పాల రమణీయం పురాతన శిల్ప సౌందర్యంలోనే కన్పిస్తుంది. పురాతన ఇతిహాసాలు, గాథలు, ప్రకృతి వింతలు, విశేషాలు, రాజరికపు గుర్తులు, సిరి సంపదలు, మనుషుల వేషధారణ, సంప్రదాయం వంటి అనేక అంశాలను శిల్పులు తమ శిల్ప కళ ద్వారా భావితరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. పురాతన చరిత్ర కలిగిన ప్రాంతాల్లో ఇలాంటి శిల్ప సంపదలు దర్శనమిస్తాయి. పురాతన ఇతిహాసాలకు, శిల్ప సౌందర్య కళకు అలంపూర్ పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన పురాతన ఆలయాల్లో శిల్పుల కళానైపుణ్యం పర్యాటకుల మనసులను రంజింపజేస్తాయి. అక్కడక్కడ కనిపించే శిల్పాలే పర్యాటకుల మనసులను ఆహ్లాదపరిస్తే.. అబ్బురపరిచే శిల్ప సమూహం ఒకే చోట కనిపిస్తే శిల్పాకళా ప్రేమికుల ఉల్లాసానికి అవధులుండవు. అలాంటి అద్భుత శిల్పాల సమూహం అలంపూర్ క్షేత్రం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ప్రాంతంలో లభించిన పురాతన, అరుదైన శిల్పాలను పురావస్తు శాఖ ఒక చోట భద్రపరిచింది. అదే పురాతన శిల్పాల ప్రదర్శన క్షేత్రం. పురావస్తు మ్యూజియంగా ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనకు అందుబాటులో ఉంచారు. 1952లో ప్రారంభం.. అలంపూర్‌లోని పురావస్తు ప్రదర్శనశాలను 1952లో ప్రారంభించారు. ఆలయాల పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో లభించిన శిలా శాసనాలు, విగ్రహాలు అన్నింటినీ సేకరించి సిద్ధుల మఠంగా పిలవబడే మండపంలో మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇందులో 26 శిలా శాసనాలు, 188 శిలా విగ్రహాలు ఉన్నాయి. క్షేత్రానికి వచ్చే పర్యాటకులు మ్యూజియాన్ని సందర్శించే అవకాశం కల్పించారు. మ్యూజియంలో విశేషం ఇది.. ఉత్తరవాహిణి తుంగభద్ర నదీ తీరాన వెలసిన అలంపూర్ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీజోగుళాంబ అమ్మవారి ఐదవ శక్తి పీఠం ఇక్కడ ఉంది. కోటి లింగాల క్షేత్రంగా అలంపూర్ ప్రసిద్ధిగాంచి.. దక్షిణకాశీగా పిలవబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగల క్షేత్రంగా ఖ్యాతి దక్కించుకుంది. ఇక్కడ ఉన్న ఆలయాల్లో ప్రాచీన శిల్పకళకు అద్దంపట్టే శిల్పాలు పర్యాటకులను ఉల్లాసపరుస్తాయి. ఈ క్షేత్రంలో మరో అద్భుతమైన ప్రదేశం పురావస్తు ప్రదర్శనశాల. 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు రాజుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వారిచే ఆరాధించబడిన దేవతా మూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. 6వ శతాబ్దంలోని బాదామి చాళుక్యుల కళాసంస్కృతికి ఇక్కడ వెలసిన శిల్పాలు నిదర్శనంగా ఉన్నాయి. 1500 ఏళ్ల క్రితం అలంకారానికి ఉపయోగించిన ఆభరణాలు, అప్పటి మహిళల వేషధారణ ఇక్కడి విగ్రహాలలో చూడవచ్చు. ఈ ప్రదర్శన శాలలో వీరాంగవీరులు (భర్త, భార్య ఇద్దరూ శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన వారు), వీరుగల్లు, వీరశిలా విగ్రహాలు, వారి బల ప్రదర్శనలు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి. సతీ సహగమనానికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి.. అలంపూర్‌లో లభ్యమై పురావస్తు మ్యూజియంలో భద్రపరిచిన శిల్పాలు దేశ విదేశాల్లో ఖ్యాతిని తెచి్చపెడుతున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శిల్పాలు కేవలం సందర్శనలకే గాక ప్రపంచ పురావస్తు శిల్పాల ప్రదర్శనలకు వెళ్లి అరుదైన గౌరవాలను దక్కించుకున్నాయి. 1977లో ఇక్కడి నటరాజ మూర్తి విగ్రహాన్ని లండన్‌లో ప్రదర్శించడం జరిగింది. అలాగే 1984లో సూర్య విగ్రహాన్ని జర్మనీలో, 2008లో సూర్య, నాగ, మహిషాసురమర్ధిని విగ్రహాలను బెల్జియంలో ప్రదర్శించగా ఖ్యాతి గడించాయి. మంత్రముగ్ధులను చేసే విగ్రహాలు.. శిల్పాచార్యులు స్థానికంగా లభించే నల్లరాతి శిలతో అందంగా నటరాజ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహంలో కనిపించే శరీర సౌష్టవాలు నాట్యభంగిమలు నాట్యకళాకారులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదే విధంగా 7–8 శతాబ్దాలకు చెందిన సూర్య విగ్రహం కూడా మెత్తటి ఎర్రఇసుక, రాతిని ఉపయోగించి తయారు చేశారు. ‘సప్తాస్వ రథసమారూఢం’అన్నట్టుగా ఏడు గుర్రాలతో ఒకే చక్రం కలిగిన రథం, ఉషా, ఛాయా సమేతంగా సూర్య విగ్రహాన్ని అందంగా మలిచి ఉన్న ఈ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక 6–7 శతాబ్దాలకు చెందిన నాగబంధ విగ్రహాన్ని పరిశీలిస్తే.. పద్మ బంధంలో ఏడు తలలు కలిగి మానవ ఆకృతిని పోలి ఉన్న నాగబంధ విగ్రహం కళాకారులను మనసు దోచుకుంటుంది. 7–8 శతాబ్దాలకు చెందిన మహిషాసురమర్దిని విగ్రహం కూడా అలనాటి దేవీభాగవతాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది. అసుర సంహారం కోసం మహిషాసురిడిని సంహరించి మహిషి తలపై తాండవం చేస్తున్నట్టు ఆదిపరాశక్తి అభయముద్రలో దర్శనమిస్తుంది. అలాగే అలనాటి వైభవాన్ని చాటి చెప్పే స్తంభాలను నేటి తరాలవారిని అదరహో అనిపిస్తాయి. ఈ స్తంభంపై మలచబడిన శిల్పా ఆకృతులను పరిశీలిస్తే పట్టుచీరలపై ఉన్న బార్డర్ల డిజైన్లు తలపిస్తున్నాయి. నంది వాహనంపై శివపార్వతులు.. పరమశివుడి రూపం ఎక్కడ చూసినా లింగరూపంలోనే దర్శనమిస్తుంది. సతీ సమేతుడై ఉన్న పార్వతీ పరమేశ్వరుడు నంది వాహనంపై ఆశీనులై దర్శనమివ్వడం అనేది చాలా అరుదు. కానీ అలంపూర్‌లో మాత్రం దేవతా స్వరూపంలో, అది కూడా శివుడు పార్వతీ సమేతుడై నంది వాహనంపై కూర్చుని ఉండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి విగ్రహం చూడాలంటే అలంపూర్ మ్యూజియానికి రావాల్సిందే. శిలాశాసనం ద్వారా తెలిసేదేమిటంటే.. ఆలయాల మనుగడ కోసం ఆనాటి రాజులు ఎన్నో భూములను మాణ్యాలుగా సమర్పించారు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఈ మాణ్యాలు ఆలయాలకు చెందాల్సిందేనని.. అలాంటి మాణ్యాలను ఎవరైనా హస్తగతం చేసుకుంటే గోవధ చేసినంత పాపం వస్తుందని తెలియజేస్తూ ఆ శాసనంపై సూర్య, చంద్రులు, లింగం, ఆవు, ఖడ్గం వంటి బొమ్మలతో శిలాశాసనం చేశారు. అది హలగన్నడ లిపిలో కనిపిస్తుంది. -
బాపు మ్యూజియం పురావస్తు ప్రదర్శనశాలల్లో సాంకేతిక సొబగులు
సాక్షి, అమరావతి: సంస్కృతి, వారసత్వ సంపద, వాటి విలువలు.. విద్య–విజ్ఞానాన్ని సందర్శకులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పురావస్తు ప్రదర్శనశాల (మ్యూజియం)లను కొత్త సొబగులతో తీర్చిదిద్దుతోంది. పురావస్తు సంపదల సమగ్ర సమాచారాన్ని టెక్నాలజీ సాయంతో సరళమైన భాషలో సులభంగా అర్థం చేసుకునేలా వాటిని ముస్తాబు చేస్తోంది. ఇందులో భాగంగా..దేశంలోనే ఏకైక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మ్యూజియంగా విజయవాడలోని బాపూ పురావస్తు ప్రదర్శనశాల కీర్తిగడించింది. జాతీయ మ్యూజియానికి సైతంలేని విశిష్టతను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఆగుమెంట్ రియాల్టీ, డిజిటల్ వాల్ ప్యానల్, ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ప్లే, కియోస్క్‌లు ఇక్కడ అందుబాటులో ఉండగా.. వర్చువల్ రియాల్టీ, లేజర్ షో, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్, ప్రొజెక్షన్ మ్యాపింగ్, డిజిటల్ వాల్ బుక్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. విభిన్నంగా ఆకర్షించేలా సాంకేతిక శోభ.. దేశంలోనే గొప్ప వారసత్వ నిలయంగా ఆంధ్రప్రదేశ్ విరాజిల్లుతోంది. లక్షల ఏళ్లనాటి పురావస్తు సంపద ఇక్కడి మ్యూజియాల్లో కనువిందు చేస్తోంది. ఈ అపురూప సంపదను సంప్రదాయ తరహా ప్రదర్శనతో పాటు సందర్శకులను విభిన్నంగా ఆకర్షించేలా మ్యూజియాల్లో సాంకేతికతను వినియోగించనున్నారు. రాష్ట్రంలోని మొత్తం 14 మ్యూజియాల్లో తొలిదశ కింద కడపలోని మైలవరం, అనంతపురం, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, పెనుకొండ భువనవిజయం జిల్లా మ్యూజియాలకు సాంకేతికతను అద్దనున్నారు. ఇప్పటికే ఏలూరు, అనంతపురంలో డిజిటల్ వాల్ ప్యానల్ పనులు జరుగుతున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో కొత్తగా అత్యాధునిక 3డీ పరిజ్ఞానంతో స్టేట్ మ్యూజియాన్ని ఏర్పాటుచేసేందుకు పురావస్తు శాఖ సన్నాహాలు చేస్తోంది. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా.. స్మారక, సందర్శనీయ స్థలాల అభివృద్ధిలో భాగంగా కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పురావస్తు శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే బాపూ మ్యూజియం తరహా సాంకేతికతను వినియోగిస్తూనే దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ప్రొజెక్షన్ మ్యాపింగ్ టెక్నాలజీని ఇక్కడ ప్రవేశపెట్టింది. సాయంత్రం వేళల్లో కోటగోడలపైనే క్రీస్తు పూర్వం నుంచి నేటివరకు రాష్ట్రంలో జరిగిన చారిత్రక పరిణామ క్రమాన్ని ప్రదర్శిస్తున్న తీరు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అహోబిలం ఆలయ గోపురంపై కూడా ఆధ్యాత్మిక తరహా ప్రొజెక్షన్ మ్యాపింగ్‌ను తీసుకురానున్నారు. దేశంలో తొలిసారిగా ఈ విధానం సోమనాథ్ ఆలయంలో ఉంది. సాంకేతిక వినియోగం ఇలా.. ఆగుమెంట్ రియాల్టీ : ఈ పరిజ్ఞానం ద్వారా మ్యూజియంలోని విగ్రహాలు తమను తాము సందర్శకులతో పరిచయం చేసుకుంటాయి. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో మ్యూజియం యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని విగ్రహాన్ని స్కాన్‌చేస్తే దాని సమాచారం ఆడియో రూపంలో వినిపిస్తుంది. మ్యూజియంలోని చిత్రపటాలను, డిస్ప్లే బోర్డులను స్కాన్ చేయడం ద్వారా యానిమేషన్ విధానంలో వాటి సమాచారం ఫోన్లో చూడవచ్చు. ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ప్లే (వాల్ ప్యానల్): 16 అడుగుల డిజిటల్ డిస్ప్లేపై మ్యూజియంలోని వస్తువులు ఒకేచోట కనిపిస్తాయి. సందర్శకులు తాకగానే వాటి వివరాలు డిస్ప్లే అవుతాయి. ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్ప్లే కేబినెట్: రాష్ట్రంలోని మ్యూజియాలు, స్మారక, సందర్శనీయ స్థలాల వివరాలను టచ్ అధారిత డిస్ప్లే ద్వారా సందర్శకులు తెలుసుకోవచ్చు. ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ థియేటర్: ఇది వర్చువల్ రియాలిటీని సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఒక గదిలో సందర్శకులను కూర్చోబెట్టి 360 డిగ్రీల కోణంలో వీక్షకుడి చుట్టూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఉదా.. ఆదిమాన వుల జీవన విధానాన్ని ప్రదర్శిస్తుంటే వీక్షకుడికి ఆ ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తారు. ఇంటరాక్షన్ డిజిటల్ కియోస్క్: దీని ద్వారా సందర్శకులు, చిన్నారులు మ్యూజియాన్ని విడిచి వెళ్లే క్రమంలో వారి సంగ్రహణ శక్తిని పరీక్షించుకోవచ్చు. ఇందుకోసం కియోస్క్‌లోని ప్రశ్నలకు జవాబులివ్వాలి. బాపూ మ్యూజియంలోని విక్టోరియా హాల్లో 1921లో గాంధీజీ ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభ జరిగింది. పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ జెండాను ఈ సందర్భంగా గాంధీజీకి అందజేశారు. అలనాటి చారిత్రక ఘట్టాన్ని లేజర్ షో ద్వారా సందర్శకులకు పరిచయం చేయనున్నారు. దశల వారీగా సాంకేతికత బాపూ మ్యూజి యంలో ఉన్న సాంకేతికత దేశంలోని ఏ మ్యూజియంలో లేదు. ఇది రాష్ట్రానికి గర్వకారణం. సందర్శకులకు వారసత్వ విజ్ఞానం, చారిత్రక అంశాలను వివరించడంలో సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోంది. యువ తను మ్యూజియాల వైపు నడిపించేందుకు వర్చు వల్, ఆగుమెంట్ రియాల్టీ, లేజర్ షో, ఇమ్మెర్సివ్ ప్రొజెక్షన్ షోలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. రాష్ట్రంలోని మ్యూజియాల్లో దశల వారీగా సాంకేతికతను ప్రవేశపెడతాం. – వాణీమోహన్, కమిషనర్, పురావస్తు శాఖ -
భువన విజయంతో ‘అనంత’ ఖ్యాతి
అనంతపురం కల్చరల్: పురావస్తు సంపదను భావితరాలకు పదిలంగా అందించడానికి రాష్ట్ర, జాతీయ పురావస్తు శాఖలు నడుంబిగించాయి. అనంతపురం జిల్లా పెనుకొండలో ‘భువన విజయం’ పేరుతో జాతీయ మ్యూజియం ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి పర్యాటకులను రప్పించడానికి సంకల్పించాయి. రాష్ట్రంలోని ప్రసిద్ధ ప్రాచీన కట్టడాలు, శిలా శాసనాలు, సంస్కృతీ కేంద్రాల పరిరక్షణకు పురావస్తు శాఖ అధికారులు ముమ్ముర చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోనే తొలిసారి ఏర్పాటు కానున్న జాతీయ మ్యూజియంను దాదాపు రూ.9 కోట్లతో నిర్మించడానికి పెనుకొండ డీఎస్పీ బంగ్లా సమీపంలో 83 సెంట్ల స్థలాన్ని సేకరించారు. త్వరలోనే పనులు ప్రారంభానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మ్యూజియంలో అపురూప కట్టడాల అవశేషాలు, నాణేలతోపాటు శ్రీకృష్ణదేవరాయల కీర్తిని చాటే శాసనాలను కూడా భద్రపరుస్తారు. జంబూద్వీపానికి ఆధునిక కళ అనంతపురం జిల్లాలోని కొనగండ్ల ప్రాంతంలో ఆకర్షించే కట్టడాలలో.. రససిద్ధుల గుట్టగా ప్రఖ్యాతి చెందిన జంబూద్వీపం చక్రం ఒకటి. ఇక్కడ ప్రపంచంలోనే అరుదైన జైన మత అవశేషాలు బయటపడ్డాయి. ముంబైకి చెందిన ‘దిగంబర్ జైన్స్ కమిటీ’ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చింది. ఈ ప్రాంత అభివృద్ధికి కూడా మ్యూజియం అధికారులు విస్తృత స్థాయిలో చర్యలు తీసుకున్నారు. త్వరలో సందర్శకులకు అన్ని వసతుల ఏర్పాట్లు కానున్నాయి. ముఖ్యంగా జైన్ విగ్రహాలకు కాయకల్పం(శాశ్వతంగా రక్షించడానికి వజ్రలేపనం పేరుతో ప్రకృతి సిద్ధమైన రసాయనాలతో పూత) చేయడానికి చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. అభివృద్ధికి ప్రణాళిక.. - ప్రాచీన కట్టడాలకు సమీపంలో ఎటువంటి నిర్మాణాలు ఉండరాదన్న నిబంధనను మ్యూజియం ఆధికారులు కచ్చితంగా అమలు చేస్తున్నారు. - ప్రపంచంలోనే అపురూప శిల్పంగా పేరున్న లేపాక్షి నందికి సమీపంలో నిర్మిస్తున్న రోడ్డును ఆపివేయించారు. - పెనుకొండలోని గగన్‌మహల్‌కు సమీపంలో సాయి కాళేశ్వర్ ట్రస్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. - ప్రాచీన కట్టడాలకు నిలయమైన పెనుకొండ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. - రాయదుర్గం వద్దనున్న పశుపతనాథ ఆలయం, వేపులపర్తి శ్రీరంగనాథ దేవాలయం, పెనుకొండ దీప స్తంభం, తిమ్మరుసు సమాధి ప్రాంతాలలో అభివృద్ధి పనులు, గోరంట్ల యాష్ మౌంట్స్ (బూడిద దిబ్బలు) వంటి చారిత్రాత్మక ప్రదేశాల్లో రక్షణ కోసం ఫెన్సింగ్ పనులు చేపట్టనున్నారు. చారిత్రక కట్టడాల రక్షణకు ప్రాధాన్యం అనంతపురం జిల్లాలో జాతీయ మ్యూజియం ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మరింత ఖ్యాతి వస్తుంది. పురావస్తు కేంద్రాల వద్ద సౌకర్యాలను కల్పించడం ద్వారా సందర్శకులను మరింత పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికనుగుణంగా జిల్లాలో పెనుకొండ, కొనకొండ్ల, వేపులపర్తి, గోరంట్ల వంటి అనేక చోట్ల అభివృద్ధి పనులను చేస్తున్నాం. ముఖ్యంగా ప్రాచీనమైన వాటి రక్షణకు ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాం. – రజిత, ఏడీ, జిల్లా పురావస్తు శాఖ -
పీస్.. పీసులు! దటీజ్.. చౌదరి
అనంతపురం న్యూటౌన్: మ్యూజియంతో ఆటలు.. స్మారక నిర్మాణానికి రాజకీయ రంగు.. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తీరు వివాదాస్పదమవుతోంది. దశాబ్ధాలుగా స్థానిక ఆదిమూర్తినగర్‌లో ఉన్న పురావస్తు శాఖ కార్యాలయాన్ని మరమ్మత్తుల పేరిట ఇటీవల పూర్తిగా కూల్చేశారు. ఏ మాత్రం భద్రత లేని స్థానిక కోర్టు రోడ్డులోని పురావస్తు శాఖ పరిధిలో ఉన్న చారిత్రాత్మక పీస్ మెమోరియల్ హాలు ప్రాంగణంలోకి మార్చారు. ఈ మార్పును అప్పటి మ్యూజియం ముఖ్య కార్యనిర్వహణాధికారి లక్ష్మిదేవమ్మ(గత జూలై నెలలో పదవీ విరమణ పొందారు) తీవ్రంగా వ్యతిరేకించారు. ఉన్నతాధికారులకు పలుమార్లు లేఖ రూపంలోనూ తెలియజేశారు. అయితే అభివృద్ధి ముసుగులో అనుకున్నదే చేశారు. రూ.ఏడు కోట్లతో ఓ ప్రయివేటు సంస్థకు నూతన నిర్మాణ బాధ్యతలను అప్పగించారు. ఇదే సమయంలో గత నెల 11న స్థానిక కోర్టు రోడ్డులోని పీస్ మెమోరియల్ హాలులోకి మ్యూజియాన్ని మార్పు చేశారు. తాజాగా ఇక్కడొద్దని అధికార పార్టీ మొండికేయడంతో కథ మొదటికొచ్చింది. మ్యూజియం అద్దె భవనంలో ఏర్పాటు చేసుకోవాలని స్వయంగా ఎమ్మెల్యే హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా మ్యూజియం అధికారి రెండు రోజుల క్రితం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు హుటాహుటిన విజయవాడకు బయల్దేరి వెళ్లారు. పీస్ మెమోరియల్ హాలుపై పెత్తనం పాలకులు మారినప్పుడల్లా చరిత్రకు దర్పణంగా నిలిచిన అపురూప కట్టడాల రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రస్తుతం మొదటి ప్రపంచ యుద్ధం కాలం నాటి కట్టడమైన పీస్ మెమోరియల్ హాలుకు ఇలాంటి గతే పట్టింది. 1914–1918 మధ్య ప్రపంచమంతా యుద్ధ భయంతో వణికిపోయింది. ఎప్పుడు ఏమౌతుందోననే ఆందోళనకు తెరదించుతూ వర్సైల్స్ సంధితో ప్రపంచ యుద్ధం నిలిచిపోయింది. నాటి శాంతికి గుర్తుగా దేశమంతటా స్మారక చిహ్నాలు నిర్మించినట్టే.. జిల్లా కేంద్రంలోనూ పీస్ మెమోరియల్ హాలు నిర్మితమైంది. స్థానిక కోర్టురోడ్డులోని ఈ ప్రాచీన కట్టడం అనంతర కాలంలో చాలా మార్పులకు లోనైంది. మూడేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పీస్ మెమోరియల్ హాలును మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, నగరవాసులంతా శ్రమదానంతో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చి కొన్ని నెలల కిందట మరమ్మతులు ప్రారంభించారు. ముఖ్యంగా ఆయనే దగ్గరుండి 2016 జూలై 16న జిల్లా అ«ధికారుల సమక్షంలో పంచనామా చేసి ఆ భవనాన్ని పురావస్తు శాఖకు అధికారికంగా అప్పగించారు. ఇతరులెవరూ తాకరాదన్న 1960 నాటి జీఓను కూడా ఆ సందర్భంగా ప్రదర్శించారు. అయితే ఇప్పుడు పీస్ మెమోరియల్ హాలుపై పూర్తి అధికారాలు తనవే అన్నట్టు ఎమ్మెల్యే పెత్తనం చెలాయిస్తున్నారు. ఉన్నఫళంగా మ్యూజియం వస్తువులను తరలించాలనడంతో దీపావళికి ముందు రోజు రాత్రి కార్యాలయాన్ని ప్రకాష్‌రోడ్డులోని ఓ అద్దె ఇంట్లోకి మార్పు చేయాల్సి రావడం గమనార్హం. ఎన్టీఆర్ మ్యూజియంగా చారిత్రాత్మక కట్టడం చరిత్ర మధుర జ్ఞాపకమైన పీస్ మెమోరియల్ హాలుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని టీడీపీ పెద్దలు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. పీస్ మెమోరియల్ హాలు ప్రాంగణంలోనే కొత్త శిల్పాలను ఏర్పాటు చేస్తూ దానికి ‘ఎన్టీఆర్ మ్యూజియం’గా పేరు మార్చాలనుకున్న ప్రయత్నమే తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అప్పట్లోనే సిటిజన్ ఫోరం సభ్యులు, ఇంటాక్(ఇండియన్ నేషనల్ ట్రస్టు ఫర్ ఆర్ట్ అండ్ హెరిటేజ్ కల్చర్) నిర్వాహకులు తీవ్రంగా వ్యతిరేకించారు. చారిత్రాత్మక కట్టడాలు ఎవరి సొత్తు కాదని, మరో ప్రభుత్వమొస్తే వారు కూడా ఇలానే చేయరని గ్యారెంటీ ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు. కొందరైతే పేరు మార్పు తగదని హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయినప్పటికీ అధికార పార్టీ మొండిపట్టు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నేడు పురాతన వస్తువుల బహిరంగ వేలం జిల్లా పురావస్తుశాలలో వినియోగంలో లేని వస్తువులను బహిరంగ వేలం వేస్తున్నట్టు జిల్లా పురావస్తుశాఖ అధికారి గంగాధర్ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు స్థానిక కోర్టు రోడ్డులోని పీస్ మెమోరియల్ హాలు ప్రాంగణంలో వేలం నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు వేలంలో పాల్గొనవచ్చన్నారు. -
ఏఎస్ఐ ఆధ్వర్యంలో పునరుద్ధరణ కార్యక్రమాలు
► త్వరలో ఉప్పుగుండూరు బుద్ధ స్థూపం పనులు ప్రారంభం ► మోటుపల్లిలో నంది విగ్రహం చోరీపై పోలీసులకు ఫిర్యాదు ► ఒంగోలులో పురావస్తు ప్రదర్శనశాలకు స్థలం కోసం కృషి ► ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కన్సర్వేషన్ అసిస్టెంట్ అన్నంబొట్ల వెంకటేశ్వరరావు ఒంగోలు కల్చరల్: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో పునరుద్ధరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కన్సర్వేషన్ అసిస్టెంట్ అన్నంబొట్ల వెంకటేశ్వరరావు వెల్లడించారు. గురువారం ఆయన సంస్థ కార్యక్రమాల గురించి ’సాక్షి’తో మాట్లాడారు. ఏఎస్ఐ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉప్పుగుండూరు, మోటుపల్లి, కనపర్తి, సత్యవోలు, పిటికాయగుళ్ల, భైరవకోన ఉన్నాయన్నారు. పూసలపాడులో తవ్వకాలు నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. ఉప్పుగుండూరు–చిన్నగంజాం మధ్య కొమ్మమూరు కాలువ సమీపంలోని బౌద్ధ స్థూపానికి సంబంధించిన పనులను త్వరలో పునః ప్రారంభిస్తామన్నారు. ముందుగా అక్కడ ఒక షెడ్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. బాపట్ల భావన్నారాయణస్వామి ఆలయ గాలి గోపురం పనులతోపాటు తమ శాఖ ఆధ్వర్యంలో ఉదయగిరి కోట జీరో్ణద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలోని భైరవకోనలో టాయిలెట్ బ్లాక్‌ను నిర్మించామన్నారు. ఒంగోలులో తమ శాఖకు జిల్లా అధికార యంత్రాంగం స్థలం కేటాయిస్తే ఆర్కియలాజికల్ మ్యూజియం నిర్మించే ందుకు చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో పురావస్తు శాఖ తవ్వకాలలో లభ్యమైన విగ్రహాలను, ఇతర చారిత్రక ఆధారాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దీనివల్ల అవకాశం కలుగుతుందన్నారు. ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయాలను, పురావస్తు ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను పరిరక్షించడం తమ లక్ష్యమని తెలిపారు. చిన్నగంజాం మండలం మోటుపల్లి వీరభద్రస్వామి ఆలయ మండపంలో ఈ నెల 12న అపహరణకు గురైన నంది విగ్రహం గురించి చిన్నగంజాం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.ఆలయాల్లో విగ్రహాల అపహరణ, గుప్తనిధుల ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేసే విషయంలో పోలీసు యంత్రాంగంతోపాటు ప్రజలు కూడా తమవంతు సహకారాన్ని మరింతగా అందజేయాలని ఆయన కోరారు. -
అజంతా అందాలు...
చూసొద్దాం రండి నగరం నడిబొడ్డున పబ్లిక్‌గార్డెన్స్‌లో ఉన్న రాష్ట్ర పురావస్తు మ్యూజియం.. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముందుచూపునకు నిదర్శనం. 95 ఏళ్ల కిందట నిజాం ఒక మ్యూజియం నిర్మించాలనుకున్నాడు. అందుకోసం చారిత్రక పరిశోధకుడు జనాబ్ గులాం యజ్దానీని 1914లో ఆర్కియాలజీ శాఖ డెరైక్టర్‌గా నియమించాడు. 1930లో పబ్లిక్‌గార్డెన్స్‌లోని విశాల ప్రాంగణంలో ఇండో-ఇస్లామిక్ శైలిలో హైదరాబాద్ మ్యూజియం నిర్మితమైంది. అనేక తవ్వకాలలో లభించిన అరుదైన కళాఖండాలకు ఇది నిలయం. రెండంతస్తుల భవనం.. దీని వెనుకే మరో రెండు అంతస్తుల్లో విశాలమైన కాంటెంపరరీ పెవిలియన్ నిర్మించారు. ఈ రెండింటి నడుమ విజయనగర రాజుల కాలంనాటి ఎత్తై కొయ్య రథం ఒక ప్రత్యేక ఆకర్షణ. పక్కనే కాకతీయుల కాలం నాటి మహామండపం, ఆ పిల్లర్లపై చెక్కిన శివపార్వతుల శిల్పాలు, ఇతర దేవతామూర్తుల విగ్రహాలు ఆనాటి శిల్పుల పనితనానికి మచ్చుతునక. ఈజిప్టు దేశపు మమ్మీ.. అజంతా గ్యాలరీ మ్యూజియంలో క్రీ.పూ.2500 ఏళ్లనాటి ఈజిప్టు దేశపు మమ్మీ ప్రధాన ఆకర్షణ. ఇది 16-18 ఏళ్ల వయసుగల ఆడపిల్లకు సంబంధించినదని అధికారులు చెబుతారు. మనదేశంలో కేవలం ఆరు మ్యూజియంలలో మాత్రమే మమ్మీలున్నాయి. ఈ మమ్మీని ఆరో నిజాం అల్లుడు కొనుగోలు చేసి దాన్ని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌ను బహుమతిగా ఇచ్చారు. నిజాం దాన్ని 1930లో గ్యాలరీకి అప్పగించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అజంతా చిత్రాల నకళ్లు ఈ మ్యూజియంలో దగ్గరగా చూడొచ్చు. హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు చిత్రకారులు జనాబ్ సయ్యద్ అహ్మద్, జనాబ్ మహ్మద్ జలాలుద్దీన్‌లు అజంతాలోని చిత్రాలను ఉన్నవి ఉన్నట్టుగా ఎంతో ఓర్పుతో చిత్రించారు. ఇవి బుద్ధుని జాతక కథలతోపాటు ఆనాటి జీవన విధానాన్ని తెలుపుతాయి. చేతివ్రాత ప్రతులు, అరుదైన నాణేలు మొఘల్ చక్రవర్తి షాజహాన్ సీల్‌తో ఉన్న ఖురాన్, ఔరంగజేబు చేతితో రాసిన ఖురాన్ ప్రతులు, క్రీ.శ. 16 నుంచి 19వ శతాబ్దకాలంలో అరబిక్, పర్షియన్, హిందీ భాషలలోని అనేక పత్రాలు, 16, 17 శతాబ్దాల్లో దేవనాగరి లిపిలో రాసిన రామాయణ, భాగవత ప్రతులు చారిత్రకాభిమానులను విశేషంగా అకట్టుకుంటున్నాయి. సుమారు రెండున్నర లక్షల పైబడిన నాణేలు మ్యూజియం గ్యాలరీలో భద్రపరిచారు. రోమన్ కాలం నాటి బంగారు నాణేలు, చైనీయుల రాగి నాణేలు, షాజహాన్ కాలంలోని 200 తులాల బంగారు మొహర్ అరుదైన జ్ఞాపికలుగా ఉన్నాయి. అయితే వీటి ప్రదర్శన ప్రస్తుతం సామాన్యులకు అందుబాటులో లేదు. జైన, బుద్ధుని గ్యాలరీలు అమరావతి, చందవరం, నేలకొండపల్లి ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన బుద్ధుని శిలాప్రతిమలు ఒక ప్రత్యేక గ్యాలరీలో ఉంచారు. ఇందులో ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరులో లభించిన బుద్ధుని నిలువెత్తు విగ్రహం సందర్శకులను కట్టిపడేస్తుంది. కళ్యాణ చాళుక్యుల కాలం నాటి ఐదుగురు జైన తీర్థంకరుల శిల్పాలు, అన్నపూర్ణ, లక్ష్మీనారాయణ, లక్ష్మి, వరాహ, సూర్య, హిందూ దేవతామూర్తులు శిల్పి నైపుణ్యతకు అద్దం పడుతున్నాయి. ఇంకా మొఘల్, రాజస్తానీ, దక్కన్ చిత్రాలతో పాటు స్థానిక ప్రముఖ చిత్రకారుల పెయింటింగ్స్ ఈ గ్యాలరీలో కనువిందు చేస్తాయి. ఈ మ్యూజియమ్‌కు ప్రతి శుక్రవారం సెలవు. ఆదివారం తెరిచే ఉంటుంది!.