
తలంబ్రాలు చల్లుకుంటున్న శివపార్వతులు
వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పార్వతీరాజరాజేశ్వరుల కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు కల్యాణోత్సవానికి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, కమిషనర్ శ్యాంసుందర్‌రావు పట్టువస్త్రాలు, ఆలయ ఈవో రమాదేవి తలంబ్రాలు సమర్పించారు.
స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు, బ్రాహ్మణుల మంత్రోచ్ఛరణాల మధ్య రెండున్నర గంటల పాటు కల్యాణం కనులపండువగా సాగింది. ఎదుర్కోళ్ల సమయంలో వరుడి తరఫున స్థానాచార్యులు అప్పాల భీమాశంకరశర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, వధువు పక్షాన ఈవో రమాదేవి కట్నకానుకలు మాట్లాడుకున్నారు.
అనంతరం స్వామివారిని పెద్దసేవపై ఊరేగించారు. కల్యాణ వేడుక ఆలయంలో నిర్వహించడం తో చాలామంది భక్తులు ఆలయం బయటే ఎండలో ఉండిపోయారు. ఎల్‌ఈడీ టీవీలు పనిచేయకపోవడంతో శివపార్వతులు గోల గోల చేశారు. కన్యాదాతలుగా గోపన్నగారి వసంత్–సరిత దంపతులు, వ్యాఖ్యాతగా తిగుళ్ల శ్రీహరిశర్మ, చంద్రగిరిశరత్ వ్యవహరించారు. కల్యాణోత్సవానికి లక్షమంది కిపైగా తరలివచ్చారు. 23న మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం జరగనుంది.