‘సీఎంకు ఇచ్చిన సమయం కంటే వారికే ఎక్కువ’

Vemula Prashanth Reddy: House Passed Two Resolutions At Meetings - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అసెంబ్లీ సమావేశాలు ఎనిమిది రోజులపాటు చాలా అర్థవంతంగా జరిగాయని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సభ సజావుగా 'సాగేందుకు సహాకరించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశాల్లో రెండు తీర్మాణాలను సభ ఆమోదించిందని పేర్కొన్నారు. రెవెన్యూ బిల్లు, టీఎస్ బీ-పాస్ బిల్లును సభ ఆమోదించిందన్నారు. 3 అంశాలపై సభ చర్చించగా, 12 బిల్లులకు సభ ఆమోదం తెలిపిందన్నారు. పార్లమెంట్‌తోపాటు, ఇతర రాష్ట్రాలలో చట్ట సభల్లో ప్రశ్నోత్తరాలతో పాటు జీరో అవర్‌ను రద్దు చేశారని తెలిపిన సభ్యులందరికి మాట్లాడే అవకాశం రావాలని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ను కొనసాగించామన్నారు. (కేటీఆర్‌ చేతుల మీదుగా కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం)

‘4 రాష్ట్రాలలో 2,3 రోజులకు మించి సభ నడపలేదు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు సభ నడపాలని సీఎం భావించారు. కానీ రెండు రోజులుగా చేస్తున్న కోవిడ్ టెస్ట్‌లలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో సభ్యులు కొంత భయాందోళనకు గురి అవుతున్నారు. స్పీకర్ సభ్యుల అభిప్రాయం తీసుకొని సభను నిరవధిక వాయిదా వేశారు. సీఎం 4 గంటల 52 నిమిషాలు మాట్లాడారు. ఎంఐఎం అక్బరుద్దీన్ 2 గంటల 27 నిమిషాలు మాట్లాడారు. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క  2 గంటల  37 నిమిషాలు మాట్లాడారు. సీఎంకి ఇచ్చిన సమయం కంటే, ఎంఐఎం ,సీఏల్పీ ఫ్లోర్ లీడర్లకు ఇచ్చిన సమయం ఎక్కువ. 

కాంగ్రెస్ సభ్యులు 3 గంటల 54 నిమిషాలు. ఎంఐఎం సభ్యులు 3 గంటల 5 నిమిషాలు మాట్లాడారు. 103 మంది సభ్యులు కలిగిన టిఆర్ఎస్ 8 గంటల 39 నిమిషాలు మాట్లాడారు. దేశంలోని అన్ని శాసనసభలకు తెలంగాణ శాసనసభ దిక్సూచిలా వ్యవహరిస్తుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ గురించి సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ వెంటనే సమాధానం ఇచ్చారు.’ అని మంత్రి ప్రశాంత్‌రెడ్డి  తెలిపారు. (నేటితో అసెంబ్లీసమావేశాలకు తెర!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top