
పౌర సరఫరాల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు పొంగులేటి, తుమ్మల సూచనలు
సాక్షి, హైదరాబాద్: ధాన్యం రవాణా కోసం సమస్యలు తలెత్తకుండా రవాణా, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పని చేసి అవసరమైన వాహనాలు అందుబాటులో ఉంచాలని పౌరసరఫరాల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. రైస్ మిల్లర్లు సహకరించని పక్షంలో ఇంటర్మీడియట్ గోదాములకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తమ్ మాట్లాడారు. రైతులకు ధాన్యం చెల్లింపులు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసిన 48 గంటల్లోగా పూర్తి చేస్తున్నామన్నారు.
ధాన్యం కొనుగోలు అంశంపై ఎలాంటి వ్యతిరేక వార్తలొచ్చాయి విచారించి చర్యలు తీసుకోవాలని, తప్పుడు వార్తలొస్తే వెంటనే ఖండించాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద మండలంలో ఎంపిక చేసిన గ్రామాల్లో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో 15 శాతం మాత్రమే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన వాటిని వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
భూ భారతి చట్టం కింద పైలట్ మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను పరిష్కరించి జూన్ 2న పట్టాలు పంపిణీ చేయాలన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వానాకాలం పంట సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధం కావాలని, విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా కలెక్టర్‌లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రుతుపవనాలు వస్తున్న నేపథ్యంలో పెండింగ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సీఎస్ కె.రామకృష్ణారావు సూచించారు.