రైతులకు దగా.. ప్రజలకు సెగ

Vegetable Farming Farmer Face So Many Difficulties At Telangana - Sakshi

కూరగాయల రైతులకు దక్కని గిట్టుబాటు ధర

వంకాయ, బెండకాయ, మిర్చి, టమాటా.. ఏది పండించినా నష్టమే

ధరలు బాగా తగ్గించి కొనుగోలు చేస్తున్న దళారులు 

సిండికేట్లుగా మారి దోచుకుంటున్న వైనం 

పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేక పంటను పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు 

సాధారణ ప్రజల జేబులకు మాత్రం చిల్లు 

బహిరంగ మార్కెట్లో పది, పదిహేను రెట్లు ఎక్కువగా రేట్లు 

ధరలు పెంచి విక్రయిస్తూ లాభాలు దండుకుంటున్న దళారులు, వ్యాపారులు

కూలీలు, కిరాయికే సరిపోయింది..
►నాకు ఉన్న భూమిల ఎకరం చిక్కుడు తోట పెట్టిన. రూ.14 వేల దాకా పెట్టుబడి అయింది. ఇప్పుడు కోత మొదలైంది. ఒక సంచి (70 కిలోలు) కాయ తెంపేందుకు కూలీ రూ. 200 అవుతోంది. సంచికి రూ.50 లెక్క కిరాయి ఇచ్చి ఆటోలో ఒంటిమామిడి మార్కెట్‌కు 4 సంచులు తీసుకుపోయిన. ధర బాగా పడిపోయింది. 4 రూపాయలకు కిలో కూడ కొంటలేరు. నాలుగు సంచులను గుండు గుత్త లెక్క రూ.1,000 కాడికి అమ్మేసిన. వచ్చిన పైసలు కూలీలకు, కిరాయిలకే సరిపోయాయి.     – లింగరాజు , వర్గల్‌  

ధరలు మండిపోతున్నాయి..
►ఇంట్లో ఫంక్షన్‌ ఉందని కూరగాయలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వచ్చా. కిలో దోసకాయ రూ.40, కిలో కొత్తిమీర రూ.200, కిలో బెండకాయ రూ.40, కిలో పచ్చిమిర్చి రూ.60, కిలో బీరకాయ రూ.60 చొప్పున ధరలున్నాయి. ధరలు అడ్డగోలుగా ఉన్నాయనిపించినా ఇంట్లో వివాహం ఉండడంతో తప్పనిసరిగా కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ ధరలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 
– భూక్యా లక్ష్మి, కొమ్మాల, గీసుకొండ మండలం, వరంగల్‌ జిల్లా  

సాక్షి, నెట్‌వర్క్‌: వంకాయ కిలో 2 రూపాయలు, పచ్చిమిర్చి 10 రూపాయలు, చిక్కుడు నాలుగు రూపా యలు..! నమ్మశక్యంగా లేదు కదూ.. ఎక్కడ? ఏ మార్కెట్‌లో? అనే ప్రశ్నలు మనసులో మెదులు తున్నాయి కదూ..? అయితే ఇవి మన సమీపంలోని మార్కెట్‌ ధరలు కావు. కష్టనష్టాలకోర్చి కూరగాయలు పండిస్తున్న రైతులకు దక్కుతున్న ధర. అవును.. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని హోల్‌సేల్‌ మార్కెట్లలో ధరలు రైతులకు కన్నీళ్లే మిగిలిస్తున్నాయి. కొన్నిసార్లు కూలీలు, రవాణా ఖర్చుల మాట అలా ఉంచితే.. పం టకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కకపోవడంతో తీవ్ర నష్టాలకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంటోంది. అయితే వినియోగదారుడి దగ్గరకు వచ్చేసరికి పది, పదిహేను రెట్లు.. ఒక్కోసారి అంతకుమించి కూడా ధర పలుకుతోంది. రైతుకు, వినియోగదారుడికి మధ్య ఉండే దళారులు, వ్యాపారులు రైతుల కష్టాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు అధిక దిగుబడి పేరుతో, ధర లేదంటూ కమీషన్‌ ఏజెంట్లు రైతుల్ని మోసం చేస్తుంటే.. వ్యాపారులు తమ వంతు లాభం చూసుకుంటుండడంతో వినియోగదారులకు చుక్కలు కనబడుతున్నాయి.  

రూ.4 బెండకాయ రూ.40కి లభ్యం 
వరంగల్‌లో అతి పెద్దదైన లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌ను ఉదాహరణగా తీసుకుంటే.. ఇక్కడికి ప్రతిరోజూ సుమారు రెండువేల క్వింటాళ్ల కూరగాయలు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటాయి. స్థానికంగా టమాటా సాగు ఎక్కువ లేకపోవడంతో ప్రస్తుతం ఏపీలోని అనంతపురం జిల్లా మదనపల్లి నుంచి వస్తున్నాయి. మిగిలిన వంకాయ, బెండకాయ, సొరకాయ, చిక్కుడు, కాకరకాయ, క్యాబేజీ, ఆకుకూరలు తదితరాలు వరంగల్‌ చుట్టుపక్కల ప్రాంతాలైన నర్సంపేట, ఆత్మకూరు, దామెర, మరియపురం, గీసుగొండ, వర్ధన్నపేట, ధర్మసాగరం, వేలేరు, హసన్‌పర్తి, దుగ్గొండి, కమలాపూర్, భీమదేవరపల్లి తదితర ప్రాంతాల నుంచి వేకువజామునే రైతులు ట్రాలీలలో తీసుకొస్తున్నారు. రైతుల నుంచి బెండకాయను కిలో రూ.4 చొప్పున దళారులు కొనుగోలు చేస్తున్నారు. కానీ అదే బెండకాయ ప్రజలు బయట కొనాలంటే రూ.40 వరకు పలుకుతోంది. రైతునుంచి రూ.4కు కొనుగోలు చేసిన కమీషన్‌ ఏజెంట్‌ (దళారి) వ్యాపారులకు ఒక్క కిలోకు ఏకంగా రూ.10 లాభం చూసుకుని రూ.14కు విక్రయిస్తున్నాడు. ఇది హోల్‌సేల్‌ వ్యాపారులు, చిల్లర వ్యాపారుల ద్వారా వినియోగదారులకు చేరేసరికి రూ.40 వరకు అవుతోందన్నమాట.  

మరికొన్ని పంటల పరిస్థితి ఇదీ.. 
►పచ్చిమిర్చి బస్తా (25 కిలోలు)ను రైతులు రూ.250కి మధ్యవర్తులకు అమ్ముతున్నారు. అంటే కిలోకు రూ.10 మాత్రమే రైతుకు దక్కుతోంది. కానీ అదే పచ్చిమిర్చి ప్రజలకు చేరేసరికి రూ.60 వరకు అవుతుంది.  
►వంకాయ బస్తా (25 కిలోలు)ను రైతులు రూ.50కి దళారులకు విక్రయిస్తున్నారు. అంటే కిలో రూ.2 మాత్రమేనన్న మాట. అదే వంకాయ బహిరంగ మార్కెట్‌కు వచ్చేసరికి రూ.30 వరకు పెరిగిపోతోంది. కొన్ని ఇతర ప్రాంతాల మార్కెట్లలో ధరలు కొంత అటుఇటుగా ఉన్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. 

కమీషన్‌ ఏజెంట్లే చక్రం తిప్పుతారు     
హైదరాబాద్‌ నగర మార్కెట్లలకు దాదాపు 2,500 టన్నుల వివిధ రకాల కూరగాయలు దిగుబడి అవుతాయి. అన్ని మార్కెట్లలో కమీషన్‌ ఏజెంట్ల ద్వారానే కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతాయి. ధరల నిర్ధారణ కూడా కమీషన్‌ ఏజెంట్ల ద్వారానే జరుగుతుంది. మార్కెట్‌కు ఏ కూరగాయలు తెప్పించాలనేది కూడా వారే నిర్ణయిస్తారంటే అతిశయోక్తిగా అన్పించినా నిజం. రైతులు గ్రామాల నుంచి తీసుకొచ్చిన కూరగాయలను కమీషన్‌ ఏజెంట్లు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు టమాట పంట కొంత ఎక్కువగా వస్తోందని భావించినప్పుడు కిలో రూ.2 నుంచి రూ. 3కు కొనుగోలు చేస్తారు. తిరిగి దాన్ని హోల్‌సేల్‌ వ్యాపారులకు రూ. 8 నుంచి 10కి విక్రయిస్తారు. హోల్‌సేల్‌ వ్యాపారులు అదే టమాటాను చిల్లర వ్యాపారులకు విక్రయిస్తారు. మొత్తం మీద వినియోగదారుడు బహిరంగ మార్కెట్‌లో కిలో టమాటా కొనాలంటే రూ.20 వరకు ఉటుంది. ఇలా రైతు నుంచి రూ.2/రూ.3కు కొనుగోలు చేసిన టమాట వినియోగదారుడికి చేరేసరికి పదిరెట్లు అవుతోందన్న మాట. ఒక్క టమాటా విషయంలోనే కాదు... అన్ని కూరగాయల విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. 

ఒకవేళ ఏదైనా కాయగూరకు డిమాండ్‌ ఎక్కువ ఉండి తక్కువ మోతాదులో దిగుమతి అయినా దీన్ని కూడా కమీషన్‌ ఏజెంట్లు సిండికేట్‌గా మారి ధరను తగ్గిస్తారు. ఉదాహరణకు బెండకాయ తక్కువ మోతాదులో దిగుమతి అయితే తీసుకొచ్చిన రైతుకు తక్కువ ధర చెబుతారు. ఒకవేళ రైతు ఎక్కువ ధర ఇచ్చే ఏజెంట్‌కు విక్రయించాలని ప్రయత్నించినా.. ఒక కమీషన్‌ ఏజెంట్‌ ధర నిర్ధారించిన తర్వాత వేరే కమీషన్‌ ఏజెంట్‌ అదే ధర నిర్ధారిస్తాడు. ఇలా కమీషన్‌ ఏజెంట్లు మార్కెట్‌లో సిండికేట్‌ అవుతూ రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి హోల్‌సేల్‌ వ్యాపారులకు అధిక ధరలకు విక్రయిస్తారు. రైతు నుంచి కమీషన్‌ ఏజెంట్, కమీషన్‌ ఏజెంట్‌ నుంచి హోల్‌సేల్, రిటైల్‌ నుంచి సబ్‌ రిటైల్‌ ఇలా నాలుగు చేతులు మారడంతో ధరలు విపరీతంగా పెరిగిపోతాయి.  
 
తెంపిన కూలీ డబ్బులు కూడా రావడం లేదు 
మాది వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం. డిగ్రీ వరకు చదివిన. వ్యవసాయంపై ఇష్టంతో నా రెండెకరాల భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నా. 20 గుంటల్లో బెండ, 20 గుంటల్లో సొరకాయ, 30 గుంటల్లో పచ్చిమిర్చి, 10 గుంటల్లో వంకాయ సాగు చేశా. ఈసారి మిరపకు వాతావరణం అనుకూలించక ముడత తెగులు సోకింది. 30 గుంటల చేనుకు పెట్టుబడి రూ.30 వేలు అయింది. 20 గుంటల్లో బెండసాగుకు రూ. 15 వేలు పెట్టుబడి అయింది. ఈ పంటను నర్సంపేట మార్కెట్‌కు తీసుకెళితే కనీసం తెంపిన కూలీలకు ఇచ్చేందుకు సరిపడా డబ్బులు కూడా రావడం లేదు. దీంతో వంకాయ, బెండకాయ పంటను పొలంలోనే వదిలేశా. కష్టపడే రైతుకు డబ్బులు రావడం లేదు కానీ బహిరంగ మార్కెట్‌లో రేట్లు మాత్రం మండిపోతున్నాయి. 
– బుడిగొండ సతీష్, యువరైతు 
––––––– ఇది పైన యువరైతు అభిప్రాయానికి పక్కన పెట్టాలి.––––––––––––– 
బస్తా బెండకాయ తరలిస్తే 172 నష్టం! 
– 25 కిలోల బెండకాయలు తెంపడానికి కూలీకి రూ.200 
– ప్లాస్టిక్‌ సంచి ఖరీదు రూ.12 
– నర్సంపేట మార్కెట్‌కు తరలించడానికి రూ.30 
– మార్కెట్‌లో గంప చిట్టి రూ.30  
 మొత్తం    రూ.272 
మార్కెట్‌లో రైతుకు లభించే ధర రూ.100.  
25 కిలోల సంచి తరలిస్తే కలిగే నష్టం: రూ.172  

 డిమాండ్, సరఫరాను బట్టే ధరల నిర్ణయం 
సాధారణంగా డిమాండ్, సరఫరాలపై ఆధారపడి ధరల నిర్ణయం ఉంటుంది. కూరగాయల సరఫరా ఎక్కువగా ఉంటే రేట్లు తక్కువగా ఉంటాయి. అదే సరఫరా తక్కువగా ఉండి డిమాండ్‌ ఎక్కువగా ఉంటే ధరలు రెట్టింపవుతాయి. మార్కెట్‌లో అడ్డగోలు ధరల ఆరోపణలు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.  
– బీవీ రాహుల్, ఉన్నతశ్రేణి కార్యదర్శి, వరంగల్‌ మార్కెట్‌ 

ధర రాకుంటే పంట తొక్కించ్చేస్తా 
ఈ ఫొటోలో కనిపిస్తున్నది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామానికి చెందిన రైతు ఈర లింగం. తనకున్న 8 గుంటల భూమిలో వంకాయల తోట పెంచుతున్నాడు. రెండు నెలల క్రితం 2,500 మొక్కలను నాటాడు. వంకాయ నారును రూ.1250కు కొనుకోలు చేసి తీసుకొచ్చాడు. ఇప్పటివరకు పురుగు మందులకు రూ.12 వేలు ఖర్చు చేశాడు. నెల రోజుల నుంచి కాత మొదలైంది. దీంతో సిద్దిపేటలోని రైతుబజార్‌కు తీసుకొచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు విక్రయిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు రూ.6 వేలు మాత్రమే వచ్చాయి. ధర ఇదేవిధంగా ఉంటే పెట్టిన పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి కన్పించడం లేదని ఆవేదన చెందుతున్నాడు. వారం రోజులు ధరలు ఇలాగే కొనసాగితే రోటివేటర్‌ పెట్టి పంట తొక్కించ్చేస్తా అని చెబుతున్నాడు.  

సిద్దిపేట జిల్లా ఒంటిమామిడి మార్కెట్‌లో కమీషన్‌ వ్యాపారులు కొనుగోలు చేస్తున్న ధరల వివరాలు 
కూరగాయలు         కిలో ధర రూ.లలో 
వంకాయ                 8 
బెండకాయ                5 
పచ్చిమిర్చి                16 
చిక్కుడు                4 
బీర                8 
కాకరకాయ                8 
దొండకాయ                5 
టమాట                16 
 

హైదరాబాద్‌ రిటైల్‌ మార్కెట్‌లలో శనివారం నాటి సగటు ధరలు (కిలోకి రూ.లలో.) 
కూరగాయ        ధర 
టమాటా        25 
చిక్కుడు        50 
బీన్స్‌        60 
బెండ        40 
బీర        60 
దొండ        50 
ఆలుగడ్డ        30 
పచ్చిమిర్చి        60 
క్యారెట్‌        60 
క్యాబేజీæ        40 
వంకాయ        30  

సిద్దిపేట జిల్లాలో 10వేల హెక్టార్లలో సాగు     
సిద్దిపేట జిల్లాలోని ములుగు, వర్గల్, మర్కూర్, గజ్వేల్, చిన్నకొడూరు, సిద్దిపేట రూరల్, మిరుదొడ్డి మండలాల్లో సుమారు 10వేల హెక్టార్లలో రైతులు కూరగాయలను సాగు చేస్తున్నారు. ఇందులో 4వేల హెక్టార్లలో టమాట, 2వేల హెక్టార్లలో పచ్చిమిర్చి, 2వేల హెక్టార్లలో వంకాయ, బీర, సొర, కాకరకాయ, చిక్కుడు ఉండగా మిగతావి అలుగడ్డ, క్యారెట్, బెండకాయ, ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా ఉన్నాయి.  

రెక్కల కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదు 
నేను ఏడాది పొడుగునా కూరగాయ పంటలు సాగుచేస్తా. ప్రస్తుతం ఎకరంలో వంకాయ సాగు చేసిన. 15వేల దాక పెట్టుబడి అయింది. వంకాయ తోట కోత మొదలైంది. ఎప్పటి లెక్క వంకాయలు తెంపిన. 10 క్వింటాళ్ల వంకాయలను ఒంటిమామిడి మార్కెట్‌కు పంపిన. ధర మొత్తం పడిపోయింది. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. 
– పిట్ల యాదగిరి, మైలారం, వర్గల్‌ మండలం, సిద్దిపేట జిల్లా 

రోజుకు రోజు ధరలు పెంచేస్తున్నారు 
రోజుకు రోజు కూరగాయల ధరలు వ్యాపారులు పెంచేస్తున్నారు. స్థానికంగా ఏ కూరగాయ కొనాలన్నా కేజీ రూ. 40–50 వరకు ఉంటున్నాయి. రైతుబజార్‌లో ధరలు కాస్త తక్కువగా ఉంటాయంటే అవి అన్ని చోట్లా అందుబాటులో లేవు. బండ్లపై తీసుకొచ్చేవారు మరింత ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.  
– సి.అఖిల, సరూర్‌నగర్, హైదరాబాద్‌ 

ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేయాలి 
కూరగాయల ధరలు కమీషన్‌ఏజెంట్లే నిర్ణయిస్తున్నట్లు తెలుస్తోంది. రైతుల నిస్సహాయతను కమీషన్‌ ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. వారికి పెట్టుబడి కూడా దక్కడం లేదు. అయినా వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. కమీషన్‌ ఏజెంట్‌ వ్యవస్థను రద్దు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుంది. 
– సహదేవ్‌యాదవ్, మాజీ కార్పొరేటర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top