పలకరింపే పదివేలు

Varaprasad Reddy Chief Guest At Hybiz TV Healthcare Awards 2021 - Sakshi

ఆప్యాయంగా పలకరిస్తే 90 శాతం రోగం నయం

శాంతాబయోటెక్‌ వ్యవస్థాపక చైర్మన్‌ వరప్రసాద్‌రెడ్డి 

గచ్చిబౌలి(హైదరాబాద్‌): రోగులను ఆప్యాయంగా పలకరించి భరోసా కల్పిస్తే 90 శాతం రోగం నయం అవుతుందని, మందులతో పదిశాతం మాత్రమే తగ్గుతుందని శాంతాబయోటెక్‌ వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ వరప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో హైబిజ్‌ టీవీ హెల్త్‌ కేర్‌ అవార్డు–2021 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జబ్బు కన్నా ముందు రోగిని అర్థం చేసుకోవాలని డాక్టర్లకు సూచించారు.

బీపీ తదితర వ్యాధులకు దీర్ఘకాలికంగావాడే మందులతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల్లో ప్రముఖ డాక్టర్లు, వైద్య సంస్థలకు అవార్డులను అందజేశారు. ఏఐజీ ఆస్పత్రి చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు ప్రదానం చేశారు. అనంతరం బెస్ట్‌ ఆర్థోపెడీషియన్‌గా సన్‌షైన్‌ ఆస్పత్రి డాక్టర్‌ గురువారెడ్డి, బెస్ట్‌ కమ్యూనికేటివ్‌ కోవిడ్‌ సర్వీస్‌ అవార్డును మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రమేష్‌రెడ్డి, బెస్ట్‌ కోవిడ్‌ సర్వీస్‌ ఆస్పత్రి విభాగంలో గాంధీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు అవార్డులను అందుకున్నారు.

అలాగే కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి బెస్ట్‌ బ్లాక్‌ ఫంగస్‌ సర్వీస్‌ అవార్డు, మా ఈఎన్‌టీ ఆస్పత్రికి బెస్ట్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా అవార్డులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్, సన్‌షైన్‌ ఆస్పత్రి డాక్టర్‌ శ్రీధర్‌కస్తూరి, జేబీమీడియా ఎండీ ఎం.రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top