చరిత్ర గురించి తెలుసుకోవాలి: కిషన్‌రెడ్డి 

Union Minister Kishan Reddy About Museums - Sakshi

విద్యార్థులు మ్యూజియాలను సందర్శించడం పాఠ్య ప్రణాళికలో భాగం కావాలని సూచన 

సాక్షి, న్యూఢిల్లీ: మన చరిత్ర, వారసత్వ సంపద గురించి భవిష్యత్‌ తరాలు తెలుసుకునేందుకు మ్యూజియంలు సరైన వేదికలని,  విద్యార్థులు మ్యూజియంలను సందర్శించడాన్ని తమ పాఠ్యప్రణాళికలో భాగంగా మార్చుకోవాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి సూచించారు. విద్యార్థు లు వివిధ అంశాలపై అవగాహన పెంచుకుని దాన్ని మన చరిత్ర, వర్తమానం, భవిష్యత్తులతో అనుసంధానం చేసుకోవడం అవసరమన్నారు.

గురువారం ఢిల్లీలో ఓ ఆర్ట్‌ గ్యాలరీని ప్రారంభించిన అనంతరం కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ..మన పూర్వీకులు, స్వాతంత్య్ర సమరయోధులు, దేశంలోని వివిధ చారిత్రక ప్రాంతాలు, అక్కడి సంప్రదాయాలు, ప్రత్యేకతలు, మన పూర్వీకులు వినియోగించిన ఆయుధాలు, నాటి వస్త్ర సంపద, వాటిని నేయడంలో మనవాళ్ల కళాత్మక ఆలోచనలు వంటి ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు మ్యూజియాలు ఉపయోగపడతాయని తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా మ్యూజియాల నిర్వాహకులు అలవర్చుకోవాలని, త్రీడీ సాంకేతికతతో బులెటిన్‌ బోర్డుల ఏర్పాటు, స్క్రీన్‌ను టచ్‌ చేయగానే ఆ వస్తువు విశిష్టత తెలిసేలా ఏర్పాట్లు చేయడం ద్వారా సందర్శకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని వివరించారు. ఢిల్లీకి విద్యార్థులు వెళ్లినప్పుడు కర్తవ్యపథ్, నేతాజీ విగ్రహం, ఇండియాగేట్, ప్రధానమంత్రి సంగ్రహాలయం వంటి వాటిని సందర్శించడం ద్వారా మన చరిత్రను తెలుసుకోవడంతోపాటు దాన్నుంచి స్పూర్తి పొందేందుకు వీలవుతుందన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top