
బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ మంత్రుల భేటీలో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ రంగంలో రాష్ట్ర పురోగతి, ప్రణాళికలను వివరిస్తూ, ఇంధన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచడం, సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో వేగంగా ముందుకెళ్తున్నామని, దీనిపై కేంద్రం, రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు. బెంగళూరులో శుక్రవారం రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన కేంద్ర విద్యుత్ మంత్రుల ఆధ్వర్యంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రుల సదస్సులో భట్టి మాట్లాడారు.
నెట్‌వర్క్ బలోపేతం
రాష్ట్రంలోని అంతర్గత విద్యుత్ ప్రసార నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ వనరులను సమన్వయం చేస్తూ చర్యలు చేపడుతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ‘2034–35 వరకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు, ఆర్థిక స్థితిని మెరుగుపరిచేలా సరైన ప్రణాళికలు రూపొందించాలి.
ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది’అని చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్‌ను తీర్చేందుకు తెలంగాణ చూపిస్తున్న క్రియాశీలక దృష్టికోణాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్‌డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా గ్రిడ్ స్థిరత్వాన్ని మెరుగుపరిచే ప్రణాళికలపైనా భట్టి మాట్లాడారు.
రాష్ట్రాలు, కేంద్రం కలిసి పనిచేయడం ద్వారా జాతీయ ఇంధన లక్ష్యాలను సాధించవచ్చన్న విషయం ఈ సదస్సులో స్పష్టమైంది. సమావేశంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్, కేంద్ర ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యస్సో నాయక్, కర్ణాటక, తమిళనాడు విద్యుత్ మంత్రులు కేజే జార్జ్, శివశంకర్ పాల్గొన్నారు.