ఏడేళ్ల ‘బడి ’కల.. 4 లక్షల మంది ఎదురు చూపు.. నోటిఫికేషన్‌ జాడేది?

Unemployed youth Waiting for teacher recruitment notification - Sakshi

టీచర్‌ జాబ్‌ కోసం ఎదురుచూస్తున్న 4 లక్షల మందికి పైగా టెట్‌ ఉత్తీర్ణులు

వ్యయప్రయాసలకోర్చి శిక్షణ పొంది అర్హత సాధించినా ప్రయోజనం లేదని ఆవేదన 

ఏడేళ్లుగా టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూపులు 

రాష్ట్రంలో 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా 

12 వేల ఖాళీలే ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామన్న ప్రభుత్వం 

పదోన్నతులు, బదిలీలు పూర్తయితే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమంటున్న విద్యాశాఖ 

కోర్టు వివాదాలతో పదోన్నతులు, బదిలీలు పూర్తికాక ముందుకు పడని అడుగులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వం వరుసగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తుండటం నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ల్లో ఉత్తీర్ణులైన వారూ గంపెడాశలు పెట్టుకున్నారు. టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ కూడా వెలువడుతుందని భావించారు. కానీ కల నెరవేరకపోవడంతో, నోటిఫికేషన్‌ వెలువడే సూచనలు లేకపోవడంతో వారంతా నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 2016 నుంచి ఇప్పటివరకు మూడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లు నిర్వహించింది. 2016, 2017ల్లో నిర్వహించిన టెట్‌లలో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. తాజాగా 2022 జూన్‌లో నిర్వహించిన టెట్‌లో మరో రెండు లక్షల మందికి పైగా ఉత్తీర్ణులయ్యారు. మూడు పరీక్షల్లో నాలుగు లక్షల మందికి పైగా అర్హత సాధించినా ఇప్పటివరకు ప్రయోజనం లేకుండా పోయింది. ఏడేళ్లుగా ఎదురుచూపులే మిగులుతున్నాయని టెట్‌ ఉత్తీర్ణులు వాపోతున్నారు. 

పదోన్నతులకు, నియామకాలకు ముడి 
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది ఓ అంచనా కాగా.. ప్రభుత్వం మాత్రం 12 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేస్తామని తెలిపింది. చాలా పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వెంటాడుతోంది. పైగా గత ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టారు. కొన్ని పాఠశాలల్లో ఎస్‌జీటీలను ఉన్నత తరగతులకు పంపుతున్నారు. ఇందులో చాలామంది స్కూల్‌ అసిస్టెంట్లకు అర్హత ఉన్నా, పదోన్నతులు లేకపోవడంతో ఫలితం దక్కడం లేదు. పదోన్నతులు లేకపోవడంతో బదిలీలు జరగడం లేదు.

ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. కానీ ఈ ప్రక్రియ మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావిడి చేసినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. అయితే ఈ వివాదాల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులేయడం లేదనే విమర్శలున్నాయి.  కోర్టు వివాదాలకు దారి తీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముందుకెళ్ళడం లేదనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.    

ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి 
బదిలీలు, ప్రమోషన్స్‌ పేరిట కాలయాపన చేయడం వల్ల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. దీంతో 4 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మేమంతా టీచర్‌ పోస్టులు వస్తాయని ఉన్న ఉద్యోగాలు మానేసి, పోటీ పరీక్షకు రూ.వేలు ఖర్చు పెట్టాం. అన్ని రకాల నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం, టీఆర్టీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సమంజసం కాదు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక శాఖకు అనుమతివ్వాలి.  
– రావుల రామ్మోహన్‌ రెడ్డి (రాష్ట్ర డీఎడ్, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు) 

ప్రభుత్వ స్కూళ్లలో టీచర్ల కొరత తీర్చాలి 
రాష్ట్రంలో 60 శాతానికి పైగా గెజిటెడ్‌ హెచ్‌ఎంలు, వేలాది స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే విద్యాశాఖ ఎంత దారుణంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. కాలయాపన చేయకుండా తక్షణమే బదిలీలు, పదోన్నతుల వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయుల కొరత తీర్చాలి.  – ఎం చెన్నయ్య (పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు) 

వ్యయప్రయాసలకోర్చి శిక్షణ తీసుకుని..
బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన వారు ప్రభుత్వ టీచర్‌ పోస్టునే లక్ష్యంగా పెట్టుకుంటారు. అవకాశం వచ్చే వరకు ప్రైవేటు స్కూళ్ళలో టీచర్లుగా పనిచేస్తుంటారు. కొందరు ఇతర ఉద్యోగాలూ చేస్తుంటారు. టెట్‌ పరీక్ష నిర్వహించే కొన్ని నెలల ముందు వీరంతా తాము అంతకుముందు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, వ్యయప్రయాసలకోర్చి  కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ తీసుకుంటారు. ఇదే క్రమంలో గత ఏడాది జూన్‌లో నిర్వహించిన టెట్‌కు హాజరయ్యారు.

గతానికి భిన్నంగా ఈసారి 6 లక్షల మంది వరకు పరీక్ష రాశారు. 1–5 తరగతులకు బోధించేందుకు డీఎడ్‌ అర్హతతో టెట్‌ పేపర్‌–1 రాస్తారు. గతంలో ఈ పరీక్ష రాయడానికి బీఈడీ చేసిన అభ్యర్థులు అర్హులు కారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులు పేపర్‌–2తోపాటు, పేపర్‌–1 రాసేందుకూ వీలు కల్పించారు. దీంతో అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పరీక్షలో ఏకంగా 2 లక్షల మందికి పైగా అర్హత సాధించడంతో మొత్తం అర్హుల సంఖ్య 4 లక్షలు దాటింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు మొదలవడంతో, తమకూ టీచర్‌ అయ్యే అవకాశం వస్తుందని వీరంతా ఎదురుచూశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top