సాక్షి, జగిత్యాల: జగిత్యాలలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికులను కలచివేసింది. సంక్రాంతి సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చిన యువకులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. పోరండ్ల వద్ద పార్టీ ముగించుకుని కారులో తిరుగు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగం కారణంగా కారు అదుపు తప్పి ముందుగా విద్యుత్ స్తంభానికి ఢీకొని, అనంతరం డివైడర్‌ను మోదింది. ఈ ప్రమాదంలో నవనీత్, సాయి తేజ ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో యువకుడు సృజన్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో జగిత్యాలలో విషాద వాతావరణం నెలకొంది. అతివేగం, మద్యం మత్తుతో పాటు యువకుల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సమాచారం.
నల్లగొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం వద్ద హైవేపై ఒక కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురికీ గాయాల పాలైయ్యారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.


