బీజేపీ మహాధర్నాకు హైకోర్టు అనుమతి

Tspsc Paper Leak: High Court Permission To Bjp Maha Dharna - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిరుద్యోగులతో కలసి నేడు(శనివారం) ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ నిర్వహించనున్న మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇస్తూ పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. 500 మంది కంటే ఎక్కువ మంది పాల్గొనరాదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆ పార్టీకి షరతులు విధించింది. షరతులను ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ధర్నాలో పాల్గొనే కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నేతల జాబితాను శుక్రవారంరాత్రి 9 గంటల వరకు పోలీసులకు అందజేయాలని పిటిషనర్‌ను కోర్టు ఆదేశించింది.

ఆ మేరకు పోలీసులు భద్రతాఏర్పాట్లు చేయాలని సూచించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్‌ వ్యవహారంలో ప్రభుత్వతీరును నిరసిస్తూ ఈ నెల 25న హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ వద్ద నిరుద్యోగులతో కలసి మహాధర్నా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ధర్నాకు అనుమతి కోరుతూ పోలీసులకు బీజేపీ నేతలు దరఖాస్తు చేసినా ఎటూ తేల్చకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ‘టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై రాజకీయ పారీ్టలు నిరసనలు తెలపకూడదని లేదు కదా. ధర్నాచౌక్‌ ఉన్నది సమస్యలపై నిరసన నిర్వహించేందుకే.. ధర్నా చౌక్‌లో అనుమతి ఇవ్వకుంటే ప్రజలు ఎక్కడ ధర్నా చేసుకుంటారు? నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది’అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top