రాత పరీక్షపై పీఆర్‌బీ కసరత్తు

TSPRB Exercise On Preliminary Written Test In Telangana - Sakshi

తొలుత సబ్‌ ఇన్‌స్పెక్టర్, తత్సమాన ఉద్యోగాలకు నిర్వహించే యోచన 

జూలై రెండు లేదా మూడో వారంలో ఉండే అవకాశం 

పరీక్ష కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపికపై కూడా బోర్డు దృష్టి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌పీఆర్‌బీ) నేతృత్వంలో జరుగుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. దరఖాస్తులకు గడువు ఈ నెల 26వ తేదీతో ముగియనుండటంతో పరీక్ష తేదీని ఖరారు చేయడం, రాత పరీక్ష కోసం ఏర్పాటు చేయాల్సిన పరీక్ష కేంద్రాలు, ఇన్విజిలేటర్ల ఎంపిక తదితర అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలిసింది.

జూలై రెండు లేదా మూడో వారంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసు ఉద్యోగాలకు ఇప్పటికే దాదాపు 13 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో చాలామంది రెండు నుంచి మూడు ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పెద్ద సంఖ్యలో రాత పరీక్ష కేంద్రాల ఎంపిక కత్తిమీద సాములా మారినట్టు తెలుస్తోంది.

ముందుగా సబ్‌ ఇన్‌స్పెక్టర్, సమాన ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. దీనితో అభ్యర్థుల సంఖ్యకు తగ్గట్టుగా కాలేజీలు, స్కూళ్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పరీక్ష ఆదివారం రోజు నిర్వహించాల్సి ఉంటుందని భావిస్తున్న అధికారులు ఈ మేరకు యాజమాన్యాలతో చర్చిస్తున్నారు. ఆయా జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు, కలెక్టర్లతో సంపద్రించి ఎన్ని కాలేజీలు, స్కూళ్లు సెంటర్లుగా ఏర్పాటు చేయాలన్నదానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.  

ఒకే తేదీల్లో రాకుండా.. 
ఒకవైపు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, మరోవైపు టీఎస్‌పీఆర్‌బీ నిర్వహించే పరీక్షల తేదీలు ఒకేరోజు రాకుండా చూడటంపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. రైల్వేతో పాటు వివిధ పోటీ పరీక్షలు సైతం జూన్, జూలైలో ఉండటంతో ఈ పరీక్షలు రాసే అభ్యర్థులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జూలై రెండో వారం లేదా మూడో వారంలో ప్రిలిమినరీ రాతపరీక్ష నిర్వహించాలని టీఎస్‌పీఆర్‌బీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తొలుత జూన్‌ ఆఖరులో లేదా జూలై మొదటి వారంలో నిర్వహించాలని భావించినా, ప్రభుత్వం ఈ ఉద్యోగాలకు మరో రెండేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇవ్వడంతో.. దరఖాస్తు దాఖలుకు గడువును కూడా పొడిగించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండు వారాలు ఆలస్యంగా రాత పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నట్టు బోర్డు అధికార వర్గాలు తెలిపాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top