New Year Celebrations.. మందుబాబులకు హెచ్చరిక..

TS Police And Excise Department Special Focus On New Year Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ ఎంతో జోష్‌తో జరుపుకుంటున్నారు. మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా వేడుకలపై తెలంగాణ పోలీసులు నిఘా పెట్టారు. అటు ఎక్సైజ్‌ శాఖ అధికారులు సైతం వేడుకలపై ఫోకస్‌ పెట్టారు. న్యూ ఇయర్‌ వేడుకలపై మందుబాబులపై ఎక్సైజ్‌ శాఖ నిఘా పెట్టి 26 స్ట్రైకింగ్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు అధికారులు. ఈవెంట్లలో డ్రగ్స్‌ సరఫరాపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెంచారు. ఇక, డిసెంబర్‌ 31 సందర్బంగా రాత్రి 12 గంటల వరకు వైన్స్‌, ఒంటి గంట వరకు బార్లకు అనుమతి ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు హెచ్చరించారు. 

మరోవైపు.. న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు కూడా మందుబాబులను హెచ్చరించారు. పోలీసులు నెక్లెస్‌రోడ్, కేబీఆర్‌ పార్క్‌రోడ్, బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1, 2, 45, 36లతో పాటు జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం. 10, సికింద్రాబాద్, మెహదీపట్నం, గండిపేట దారుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ రేసులు, డ్రంకన్‌ డ్రైవింగ్‌ పైనా కన్నేసి ఉంచుతారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చడం నిషిద్ధం. వాహనాల్లో ప్రయాణిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చేస్తే చర్యలు తప్పవు. వాహనాలు టాప్స్, డిక్కీలు ఓపెన్‌ చేసి డ్రైవ్‌ చేయడం, కిటికీల్లోంచి టీజింగ్‌ చేయడం వంటిని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తారు.  

‘సాగర్‌’ చుట్టూ నో ఎంట్రీ... 
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, దురుసుగా డ్రైవింగ్‌ చేయడం, మితిమీరిన వేగం, పరిమితికి మంచి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని పేర్కొన్నారు. శాంతి భద్రతల విభాగం అధికారులతో పాటు ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తారని, ఉల్లంఘనలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాంక్‌ బండ్‌ పైన భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా హుస్సేన్‌సాగర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్‌ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ప్రత్యామ్నాయాలు లేని బేగంపేట, లంగర్‌హౌస్‌ ఫ్లైఓవర్‌ మినహా మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను శనివారం రాత్రి మూసి ఉంచుతారు.  

ఓఆర్‌ఆర్, వంతెనలు బంద్‌ 
నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు, పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలపై వాహనాలకు అనుమతి లేదు. నేడు రాత్రి 11 గంటల నుంచి 1న ఉదయం 5 గంటల వరకు ఈ అంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. విమాన టికెట్, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలు చూపించిన ప్రయాణికులను మాత్రమే ఆయా మార్గాల్లో అనుమతి ఇస్తారు. అలాగే దుర్గం చెవురు కేబుల్‌ బ్రిడ్జి, శిల్పా లైఅవుట్‌ ఫ్లైఓవర్, గచ్చిబౌలి, బయోడ్రైవర్సిటీ, షేక్‌పేట్, మైండ్‌స్పేస్, రోడ్‌ నం–45, సైబర్‌ టవర్, ఫోరంమాల్‌–జేఎన్‌టీయూ, ఖైత్లాపూర్, బాబు జగ్జీవన్‌రామ్‌ ఫ్లైఓవర్లు రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పూర్తిగా బంద్‌ ఉంటాయి. అలాగే నాగోల్, కామినేని ఫ్లైఓవర్లు, ఎల్బీనగర్, చింతలకుంట అండర్‌పాస్‌లు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు ద్విచక్ర వాహనాలకు, ప్యాసింజర్‌ వాహనాలకు అనుమతి లేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top