‘రాయలసీమ’ను నిలిపివేస్తే చర్చలకు సిద్ధం..

TS Minister Jagadish Reddy And Srinivas Goud On Rayalaseema Project - Sakshi

జల వివాదం అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి 

సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వ్యాఖ్య 

ఆంధ్ర ప్రజలపై తమకు కోపం లేదని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేసి, సంబంధిత జీఓను ఉపసంహరించుకునే పక్షంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి అన్నారు. కృష్ణా జల వివాదం అంశాన్ని కేవలం నేషనల్‌గ్రీన్‌ ట్రిబ్యునల్‌కే పరిమితం చేయకుండా ప్రజల్లోకి కూడా తీసుకువెళ్తామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డితో కలసి శుక్రవారం ఆయన టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్షం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలుపుదలకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని, ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించొద్దని అన్నారు.

తెలంగాణకు జరిగే అన్యాయాలపై పోరాడటంలో సీఎం కేసీఆర్‌కు మించిన వారెవరున్నారని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో తెలంగాణ సమాజానికి అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు ఏపీ ప్రభుత్వ వైఖరికి వంత పాడుతున్నాయని, గతంలో ఏపీకి అక్రమంగా నీటి తరలింపునకు హారతులు పట్టిన వారు ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు ద్రోహం చేసినా రాష్ట్ర నీటి వాటాల కోసం పోరాటం చేస్తామని, కాంగ్రెస్‌ నేతలు బానిస బతుకులు మానుకోవాలని హితవు పలికారు. బీజేపీకి తెలంగాణ సోయి లేదని మండిపడ్డారు.  

‘రాయలసీమ’తో ఐదు జిల్లాలకు నష్టం 
రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకంతో తెలంగాణలో ఐదు జిల్లాలు నష్టపోతాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ పలు దఫాలు కేంద్రానికి లేఖ రాశారని, కేసీఆర్‌ చిత్తశుద్ధిపై కొందరు అర్థం లేని విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసిన వారే ఇప్పుడు కేసీఆర్‌ మీద విమర్శలు చేస్తున్నారన్నారు. 

తెలంగాణకు అన్యాయం జరగనివ్వం
సాక్షి, న్యూఢిల్లీ: సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీలో సాగునీటి ప్రాజెక్టులపై తాము మాట్లాడుతుంటే, కొందరు ఏపీ నాయకులు ఏ మాత్రం సంబంధం లేకుండా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సయోధ్యతో ఉందామనుకుంటే.. కొందరు ఏపీ నేతలు నోట్లో చక్కెర, కడుపులో కత్తెరవంటి వైఖరితో వ్యవ హరిస్తున్నారని విమర్శించారు. అంతేగాక వైఎస్సార్‌ తెలంగాణ ఇస్తామని చెప్పి మభ్యపెట్టారని, అందుకే పోతిరెడ్డిపాడు వ్యవహారంలో మంత్రి పదవులను సైతం టీఆర్‌ఎస్‌ వదులుకుందని చెప్పారు. తమ పోరాటం తెలంగాణ ద్రోహులపైనే కాని, ఆంధ్ర ప్రజలపై కాదన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో ఏపీ సీఎంతో ఎలాంటి వివాదాలకు పోకుండా సఖ్యతతో మెలిగే ప్రయత్నం చేశామన్నారు.

తెలంగాణకు ఏం చేశారు... 
వైఎస్సార్‌ హయాంలో తెలంగాణ నీళ్లను దోచుకుపోతుంటే తమ కడుపు మండిందని మంత్రి అన్నారు. తెలంగాణ అని నినదించిన వాళ్లను నక్సలైట్‌ అనే ముద్ర వేసి చంపారని ఆరోపించారు. ఏపీ సీఎంగా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. తెలంగాణకు వైఎస్సార్‌ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని ఏ కుల వృత్తులను ఎదగనీయలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తిరిగిన ఉద్యోగులను ఏసీబీ కేసుల్లో జైళ్లకు పంపారన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రులు తమకు శత్రువులు కాదని, అన్నదమ్ములుగా చూసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నీళ్లు తోడుకుపోతే, హైదరాబాద్‌కు నీళ్లు ఎట్లా, ఏం నీళ్లు తాగాలని ఏపీ సీఎంను నిలదీయాలని వారికి సూచించారు. ఈ కొత్త పంచాయితీతో ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేట్లు ఉన్నాయని మాట్లాడాలని అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్‌లో మాట ఇచ్చినట్లు అక్రమ ప్రాజెక్ట్‌లు ఆపేయాలని, హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలు అడగాలన్నారు.  
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top