TS: హైదరాబాద్‌లో రూ. 1,14,000.. ములుగులో రూ. 1,700

TS Government New Value Of Vacant Lands In Telangana - Sakshi

ఖాళీ స్థలాల ప్రభుత్వ విలువలు ఒక్కోచోట ఒక్కోలా..

శ్రీనగర్‌ కాలనీలో ఎంతో చార్మినార్‌ నయాపూల్‌లోనూ అంతే

భూపాలపల్లిలో రూ.2,400... కామారెడ్డిలో రూ.8,800

జనగామలో రూ. 12,500... ఆసిఫాబాద్‌లో రూ.6,800 

జిల్లాలకు చేరిన భూముల కొత్త ప్రభుత్వ విలువలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఖాళీ స్థలాల విలువలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌కు, ములుగుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా నిర్ధారించిన గజం భూమి ప్రభుత్వ విలువ మధ్య ఉన్న తేడా..‘భూమికీ ఆకాశానికీ..’ అనే నానుడిని గుర్తుతెస్తోంది. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ నడిబొడ్డున గజం విలువ రూ.1.14 లక్ష లుగా నిర్ధారణ కాగా, ములుగు జిల్లాలో అత్యధి కంగా గజానికి రూ.1,700గా మాత్రమే నిర్ధారిం చారు. అంటే ఈ రెండు ప్రాంతాల నడుమ ఏకంగా 67రెట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం.

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్రభుత్వ విలువలను జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ల శాఖ ఖరారు చేసి ఆయా జిల్లాలకు పంపింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ములుగు తర్వాత భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా రూ.2,400 గజం విలువ కాగా, హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీ, చార్మినార్, నయాపూల్‌లో రూ.1.05 లక్షలుగా ఖరారయిం ది. హైదరాబాద్‌ దూద్‌బౌలీలో రూ.87,800గా విలువ ఖరారయితే, రంగారెడ్డి జిల్లా మియా పూర్, చందానగర్, రాయ్‌దుర్గ్‌ లాంటి ప్రాం తాల్లో రూ. 52,700గా నిర్ధారించారు. 

మరిన్ని ఆసక్తికర విషయాలివే..
హైదరాబాద్‌ దూద్‌బౌలీలో ప్రస్తుతం రూ.65 వేలుగా ఉన్న గజం విలువను రూ.87,800కు పెంచారు. అదే ఇక్కడ అపార్ట్‌మెంట్లకు సంబంధించి చదరపు అడుగుకు ప్రస్తుతం రూ. 6,200 ఉండగా దాన్ని రూ.7,800 మాత్రమే పెంచారు. 
► బంజారాహిల్స్‌ రోడ్‌ నం:3, 1, పంజాగుట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.84,500 ఉన్న చదరపు గజం విలువను రూ. 1,14,100కు పెంచారు. ఇక్కడ అపార్ట్‌మెంట్‌లకు గాను చదరపు అడుగుకు రూ.7,600 ఉండగా దాన్ని రూ.9,500కు పెంచారు. 
► మాసాబ్‌ట్యాంక్, క్రాస్‌రోడ్స్, ఎస్‌ఆర్‌నగర్, ఖైరతాబాద్‌ అయోధ్య హోటల్, సంత్‌ నిరంకారి టూ రవీంద్రభారతి (లక్డీకాపూల్‌), ఏజీ ఆఫీస్‌ సర్కిల్‌ (సైఫాబాద్‌), అమీర్‌పేట క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట రాజీవ్‌గాంధీ సర్కిల్, ఎర్రగడ్డ థెరెస్సా చర్చి, భరత్‌నగర్‌ ఫ్లైఓవర్, ఉమేశ్‌చంద్ర విగ్రహం తదితర ప్రాంతాల్లోనూ రూ.1.14 లక్షలుగా చదరపు గజం ఖాళీ స్థలం విలువలను నిర్ధారించారు. 
► శ్రీనగర్‌ కాలనీలో రూ.78 వేలుగా ఉన్న విలువలను చదరపు గజానికి రూ. 1,05,300కు సవరించారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. 
►  చార్మినార్‌ సమీపంలోని నయాపూల్‌లో కూడా ప్రభుత్వ విలువను భారీగానే పెంచారు. ఇక్కడ చదరపు గజానికి ఖాళీ స్థలం ప్రస్తుతం రూ. రూ.78 వేలు ఉండగా, దాన్ని రూ.1.05,300కు పెంచారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. 
► రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి, కేశంపేట, చౌదరిగూడ, ఫారూఖ్‌నగర్, కొందుర్గ్, మాడ్గుల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఓ మోస్తరుగానే ధరలు ఖరారు చేశారు. నగర శివార్లలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్‌బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు చోట్ల భారీ ఎత్తున ధరలు నిర్ధారణ అయ్యాయి. 
► సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో గజం భూమి విలువను అత్యధికంగా రూ.26,400గా నిర్ధారించగా, హుజూర్‌నగర్, కోదాడల్లో రూ.17,600, నేరేడుచర్లలో రూ.5,800గా అత్యధిక ధరలను ఖరారు చేశారు. 
► యాదాద్రి జిల్లాలో భువనగిరిలో ఎక్కువ ధర ఉండగా, యాదగిరిగుట్టతో సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగానే ధరలను ఖరారు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top