అలుగు దుంకిన చేప | TS Government Intends To Distribute Over 77 Crore Fish This Year | Sakshi
Sakshi News home page

అలుగు దుంకిన చేప

Nov 13 2020 3:37 AM | Updated on Nov 13 2020 3:38 AM

TS Government Intends To Distribute Over 77 Crore Fish This Year - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మొన్నటి వర్షాల దెబ్బకు చెరువుల్లో చేపలు అయిపూ అజా లేకుండా కొట్టుకుపోయాయి. నీటి వనరుల్లో ఎదిగి సిరులు పండిస్తాయని ఆశించిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. వాగుల్లో, చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు పోసి వాటిని మత్స్యకారులకు ఆర్థిక వనరుగా మార్చాలనే సర్కారు లక్ష్యానికి ఈసారి వర్షాలు గండికొట్టాయి. ఇప్పటివరకు ఏ చెరువులో ఎన్ని చేపల్ని పోశారనే లెక్కలున్నాయి కానీ.. వర్షా ల తర్వాత ఎన్ని మిగిలాయనేది తెలియట్లేదు. 

ఈ ఏడాది లక్ష్యం 77 కోట్లపైనే.. 
మత్స్యకారుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దాదాపు 77 కోట్లకుపైగా చేపపిల్లల్ని పంపిణీ చేయాలని సంకల్పించింది. హైదరాబాద్‌ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో గల 21,855 చెరువుల్లో జూలై – ఆగస్టు మధ్యకాలంలో దాదాపు 56 కోట్లకుపైగా చేపపిల్లల్ని వదిలింది. లక్ష్యంలో 78.46 మేర పంపిణీ పూర్తయింది. మిగతావి వదలాలనుకునే వేళలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. చెరువులన్నీ అలుగుపోయడంతో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చేపలన్నీ కొట్టుకుపోయాయి. ఇంకా చెరువుల్లో ఎన్ని మిగిలాయో, కొత్తగా మళ్లీ ఎన్ని వదలాలో తెలియక మత్స్యకారులు, మత్స్యశాఖ కిందామీదా పడుతున్నాయి. 

ముందువరసలో ఆ 4 జిల్లాలు 
ఉచిత చేపపిల్లల పంపిణీ 4 జిల్లాల్లో ఇప్పటికే వంద శాతం పూర్తయింది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లోని చెరువుల్లో వంద శాతం చేపపిల్లల్ని పోశారు. అత్యల్పంగా సూర్యా పేట జిల్లాలో 51.51శాతం మేర మాత్రమే లక్ష్యం నెరవేరింది. ఆయా చెరువుల్లో కొద్దోగొప్పో చేపలు మిగిలినా ఎదుగుదల బాగా లేదని మత్స్యకారులు అంటున్నారు. 

నెరవేరని ముందస్తు లక్ష్యం 
ఈ ఏడాది కాస్త ముందే చేపపిల్లల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకుతగ్గట్టే జూలై–ఆగస్టు మధ్యలో పంపిణీ చేపట్టింది. ఇంకో 20 కోట్లకుపైగా చేపలను పోయాలనే సమ యంలోనే భారీ వర్షాలు రావడంతో బ్రేక్‌ పడింది. మిగిలిన చెరువుల్లో లక్ష్యం మేరకు చేపల్ని వదలడంతో పాటు.. కొట్టుకుపోయిన చోట్ల ఏం చేయాలనే దానిపై నివేదిక తయారు చేస్తున్నారు. ‘చేపపిల్లలు చెరువు దాటి వెళ్లినట్టు మత్స్యకారులు భావిస్తే ఆయా జిల్లాల అధికారులకు తెలిపాలి. అవసరమైన మేర మళ్లీ ఉచితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయా చెరువుల్లో మళ్లీ చేపప్లిలలు పోయాలని అధికారులకు ఇప్పటికే తెలిపాం’అని మత్స్యశాఖ అధికారి ఒకరు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement