రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు

TS Government Establish Registration Sub Districts - Sakshi

హైదరాబాద్‌ మినహా మండలాల వారీగా రిజిస్ట్రేషన్‌ సబ్‌ జిల్లాల ఏర్పాటు

తహసీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా

పునర్వ్యవస్థీకరణ ఉత్తర్వులు జారీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 570 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటినుంచి అమల్లోకి రానున్న తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం –2020లో భాగంగా మండల కేంద్రాల్లోని తహసీల్దారు కార్యాలయాల్లో    వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు వీలుగా రిజిస్ట్రేషన్ల శాఖను పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టం –1908 ప్రకారం రాష్ట్రంలోని 32 జిల్లాలను (హైదరాబాద్‌ మినహా) 10 కొత్త సబ్‌ జిల్లాలుగా పరిగణిస్తూ ఒక్కో సబ్‌ జిల్లాలో తహసీల్దార్‌ కార్యాలయాల వారీగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 570 తహసీల్‌ కార్యాలయాలను రిజిస్ట్రేషన్ల చట్టం–1908లోని సెక్షన్‌ 5 ప్రకారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలుగా నోటిఫై చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా రిజిస్ట్రేషన్ల చట్టం–1908 లోని సెక్షన్‌ 7(1) ప్రకారం తహశీల్దార్లకు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదా కల్పించారు. తహశీల్దారు అందుబాటులో లేని సమయాల్లో జిల్లా కలెక్టర్‌ అనుమతితో నాయబ్‌ తహశీల్దార్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ విధులు నిర్వహిస్తారని, తెలంగాణ భూమి హక్కులు మరియు పట్టాదారు పాసు పుస్తకాల చట్టం –2020 పరిధిలోనికి వచ్చే భూములను రిజిస్ట్రేషన్‌ చేసే అధికారం సబ్‌ రిజిస్ట్రార్ల నుంచి తప్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందుకోసం 2018లో రిజిస్ట్రేషన్ల శాఖ జారీ చేసిన 94,95 జీవోలు రద్దవుతాయని, తాజా ఉత్తర్వులు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని, ఈ మేరకు ప్రభుత్వ గెజిట్‌లో నోటిఫై చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. 

మ్యుటేషన్‌ ఫీజు ఖరారు

  • రిజిస్ట్రేషన్‌ విలువలో 0.1 శాతం.. లేదా పురపాలికల్లో రూ. 1000..     
  • కార్పొరేషన్లలో రూ. 3 వేలు.. 
  • ఉత్తర్వులు జారీ  

సాక్షి, హైదరాబాద్‌: స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ సమయంలో ఆటో మ్యుటేషన్‌ కోసం వసూలు చేయాల్సిన రుసుమును ఖరారు చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి సి.సుదర్శన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సదరు ఆస్తి రిజిస్ట్రేషన్‌ విలువలో 0.1 శాతం లేదా పురపాలికల్లో రూ.1000, మునిసిపల్‌ కార్పొరేషన్లలో రూ.3 వేలు.. రెండింటిలో ఏది ఎక్కువ అయితే దానిని మ్యుటేషన్‌ ఫీజుగా వసూలు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని పురపాలికల్లో నిర్దేశిత మ్యుటేషన్‌ ఫీజులు లేకపోవడంతో కొత్త ఫీజులను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top