అంగన్‌వాడీల సమ్మె యథాతథం

TS Anganwadi workers: Chalo Hyderabad will be held on October 4 - Sakshi

మంత్రి హరీశ్‌తో చర్చలు జరిగాయే కానీ స్పష్టత రాలేదు 

ఈనెల 4న చలో హైదరాబాద్‌ నిర్వహిస్తాం 

సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు 

తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జేఏసీ స్పష్టికరణ 

సాక్షి, హైదరాబాద్, ముషీరాబాద్‌: అంగన్‌వాడీ ఉద్యో­గుల సమ్మె య«థాతథంగా కొనసాగుతుందని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందువల్లే సమ్మెను కొనసాగిస్తున్నామని, సామాజిక మాధ్య­మాల్లో సమ్మె విరమించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఈ మేరకు జేఏసీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన వేతనాలను ఏమేరకు పెంచుతామనే అంశాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. వేతనాల అంశాన్ని సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినప్పుడు అంగన్వాడీలకు కూడా పెంచుతామని హామీ ఇచ్చారని వివరించింది. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌కు సంబంధించి టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రతిపాదనలు అమలు చేయాలని కోరితే మంత్రి హరీశ్‌రావు పరిశీలిస్తామని చెప్పారని, స్పష్టతనివ్వలేదని జేఏసీ నేతలు తెలిపారు.

గ్రాట్యుటీ అంశాన్ని సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారని పేర్కొన్నారు. సమ్మె విరమించాలని మంత్రి హరీశ్‌రావు కోరారని, కానీ జేఏసీ మంత్రికి నిర్ణయాన్ని వెల్లడించలేదని స్పష్టం చేశారు. సోషల్‌ మీడియా­లో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ నెల 4న ఛలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయా­లని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్‌తో భేటీ అయి­న వారిలో సీఐటీయూ నేతలు పి.జయలక్ష్మి, సునీ­త, ఏఐటీయూసీ నేతలు ఎన్‌.కరుణకుమారి, ఎం.సాయిశ్వరి, కె.చందన, జేఏసీ నేతలు భూపాల్, ఓ.ఈశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఉన్నారు.

మరింత పట్టుదలతో సమ్మె: ఏఐటీయూసీ నేత విజయలక్ష్మి 
అంగన్వాడీలు మరింత పట్టుదలతో సమ్మె కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ నా­యకురాలు బి.వి.విజయలక్ష్మి, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డీ.యూసఫ్, ఎస్‌.బాలరాజులు పిలుపునిచ్చారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి సరిగ్గా హామీ రాకపోవడం, మిగిలిన డిమాండ్లపైనా స్పష్టత లేకపోవడంచో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సోషల్‌ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top