ఆశల పల్లకిలో నేతలు.. కోడ్‌ ముగిశాకే ‘పార్టీ’!!

TRS Nominated Posts To Be Filled After MLC Elections - Sakshi

ఎమ్మెల్సీ కోడ్‌ ముగిశాకే టీఆర్‌ఎస్‌ పార్టీ పదవుల భర్తీ 

అసెంబ్లీ ఎన్నికలలోగా పదవీ యోగానికి ఇదే ఆఖరి అవకాశమనే భావన 

సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌లో మళ్లీ సంస్థాగత పదవుల అంశం తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిశాక.. పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల నియామకం చేపట్టే అవకా శం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. దీనితో శాసన మండలి సభ్యత్వాన్ని ఆశించి, అవకాశం దక్కనివారు.. తమ రూటు మార్చి నామినేటెడ్‌ పదవులు లేదా పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రాధాన్య పదవులపై దృష్టిపెట్టారు. శాసనమం డలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల కోడ్‌ ఈ నెల 16న ముగియనుంది. ఆ తర్వత పదవుల పందే రం మొదలయ్యే అవకాశం ఉందని తెలిసింది.  

ఇప్పుడు అవకాశం వస్తేనే.. చాలాకాలంగా ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఆశించి, అవకాశం రాని నేతలు.. 2023 సాధారణ ఎన్నికలలోపు ఏదో ఒక పదవిని దక్కించుకోవడంపై దృష్టిపెట్టారు. నామినేటెడ్‌ పదవులుగానీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోచోటుగానీ దొరికితేనే.. భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావి స్తున్నారు. 2023 సాధారణ ఎన్నికలలోపు పదవీ యోగం పొందడానికి ఇదే చివరి అవకాశమన్న అభిప్రాయం కూడా వారిలో వ్యక్తమవుతోంది.

రాష్ట్రంలో 80కిపైగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సం స్థలకు సంబంధించిన కార్పొరేషన్లు ఉండగా.. అం దులో ప్రస్తుతం 35 కార్పొరేషన్లకు మాత్రమే పాలక మండళ్లు ఉన్నాయి. కీలక కార్పొరేషన్ల పాలకమండళ్లు ఖాళీగా ఉండటంతో.. తమకు అవకాశం ఇవ్వాలంటూ నేతలు సంబంధిత జిల్లా మంత్రులు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, అధినేత కేసీఆర్‌ల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. 

సంస్థాగత పదవులైనా.. 
టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రారంభించింది. కానీ కోవిడ్‌ లాక్‌డౌన్, పలు ఇతర కారణాలతో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయ్యేలా షెడ్యూల్‌ ప్రకటించినా.. అమలుకాలేదు. వినాయక చవితి, దసరా పండుగలు, అసెంబ్లీ సమావే శాలు, హుజూరాబాద్‌ ఉప ఎన్నిక, శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు తరచూ వాయిదా పడుతోంది.

పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వరంగల్‌లో ‘తెలంగాణ విజయగర్జన’సభ నిర్వహించాలని భావించినా.. ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారు. ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల ప్రక్రియ 16న ముగుస్తుండటంతో జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో రద్దు చేసిన జిల్లా కమిటీలను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రకటించినా.. ప్రస్తుతానికి కేవలం జిల్లా కన్వీనర్లను మాత్రమే నియమించే అవకాశం ఉందని అంటున్నాయి.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top