‘మధుకాన్‌’లో నేను డైరెక్టర్‌ కాదు: సోదాలపై ఎంపీ నామా వ్యాఖ్యలు

TRS MP Nama Nageswar Rao Comments On ED Investigation - Sakshi

ఎన్ని ఇబ్బందులొచ్చినా కేసీఆర్‌ వెంటే..

మధుకాన్‌ కంపెనీలో నేను డైరెక్టర్‌ను కాదు: ఎంపీ నామా నాగేశ్వర్‌రావు వ్యాఖ్యలు

సాక్షి, హైదరాబాద్‌: ‘నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా మా నాయకుడు కేసీఆర్, ప్రజల వెంట నడుస్తా. నేను నిజాయితీతో ఉంటా. ప్రజాసేవ కోసం రాజ్యాంగం చూపిన బాటలో ముందుకెళ్తున్నా’ అని ఖమ్మం ఎంపీ, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఇటీవల నామాపై ఈడీ విచారణ వార్తల నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నామా మీడియాతో మాట్లాడారు. తన బలం సీఎం కేసీఆర్‌ అని, బలగం ఖమ్మం ప్రజలని, రెండు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న తాను మధుకాన్‌ సంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు చెప్పారు. 40 ఏళ్ల క్రితం తాను స్థాపించిన మధుకాన్‌ గ్రూప్‌ గోల్డెన్‌ క్వాడ్రిలేటర్‌ ట్రయాంగిల్‌ పనుల్లో 7 శాతం రోడ్లు, కొంకణ్‌ రైల్వేస్‌ పనుల్లో 6 శాతం పూర్తి చేసిందన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులు కలుపుకుని సుమారు 8 వేల కి.మీ. మేర నిర్మించిందన్నారు. ప్రజాజీవితంలోకి రావడంతో 2004-2009 మధ్య సంస్థలో అన్ని బాధ్యతల నుంచి తప్పుకుని సోదరులకు అప్పగించినట్లు చెప్పారు.

ట్రిబ్యునల్‌ ముందు వివాదం... 
రాంచీ-జంషెడ్‌పూర్‌ మార్గంలో నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వేస్‌ లిమిటెడ్‌ అనే స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కంపెనీని 2011లో ఏర్పాటు చేసినట్లు నామా చెప్పారు. బీఓటీ పద్ధతిలో 30% ఈక్విటీ, 70% రుణంతో ప్రాజెక్టు ప్రారంభమగా మధుకాన్‌ తన వంతు వాటా రూ. 463 కోట్లకు బదులు రూ.485 కోట్లను ఎస్క్రో ఖాతాకు చెల్లించిందన్నారు. రూ.1,190 కోట్ల వాటా చెల్లించిన బ్యాంకు 2011 నుంచి ఇప్పటివరకు రూ.778 కోట్లు వడ్డీగా తీసుకుందన్నారు. రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలం అప్పగించకపోవడంతో పనులు సకాలంలో పూర్తి కాలేదని, ఆ తర్వాత నేషనల్‌ హైవే అథారిటీ నిధులు విడుదలకు ముందుకొచ్చినా తర్వాత వెనక్కి వెళ్లిందన్నారు. ప్రస్తుతం ఈ వివాదం ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ ముందు నడుస్తోందన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top