హద్దులు దాటిన ఆక్రమణ.. 136 కోట్ల సర్కార్‌ భూమికి ఎసరు!

TRS Corporator Husband Encroaching On Government Land - Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే వాటి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్, హెచ్‌ఎండీఏ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భూమిని ప్లాట్లుగా మార్చి.. హద్దురాళ్లు నాటి అమ్మకానికి పెట్టారు. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్‌ భర్త ఈ భూ ఆక్రమణలో ప్రధాన పాత్రదారుగా ఉండటంతో స్థానిక మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు కిమ్మనకపోవడంపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

రూ.156 కోట్ల భూమిపై కన్ను 
రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 80/1లో 5.32 ఎకరాలు, సర్వే నం. 80/2లో 7.07 ఎకరాలు సర్కారు భూమిగా నమోదైంది. దీనిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్‌ 80/3లోని 4.23 ఎకరాల భూమి ప్రభుత్వం మోడల్‌ గ్రేవీ యార్డ్‌ (క్రిస్టియన్‌ శ్మశాన వాటిక)కు, సర్వే నం. 80/19లోని 10.27 ఎకరాల భూమిని మోడల్‌ గ్రేవీ యార్డ్‌ (ముస్లిం శ్మశాన వాటిక)గా నమోదై ఉంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ వెబ్‌సైట్‌లోనూ ఇదే స్పష్టం చేస్తోంది.  

బహిరంగ మార్కెట్లో ఈ 13 ఎకరాల విలువ రూ.156 కోట్ల పైమాటే. విలువైన ఈ ప్రభుత్వ భూములపై బడంగ్‌పేట్‌ నగరపాలక సంస్థ పరిధిలోని అధికార పారీ్టకి చెందిన ఓ కార్పొరేటర్‌ భర్త కన్నేశారు. వీటిపై తమకే హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సర్వే నం. 80/1లోని కొంత భూమిని ఆక్రమించారు. ఆ భూమిని చదును చేశారు. ప్లాట్లుగా చేసి అమ్మకానికి రంగం సిద్ధం చేశారు.  

మూడు ఎకరాలు గుర్తించాం  
ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సర్వే నం. 80/1, 80/2లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు  ఫిర్యాదు కూడా అందింది. గురువారం ఉదయం ఆర్‌ఐ సహా ఇతర సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి, ఆ మేరకు జేసీబీతో నాటిన హద్దు రాళ్లను కూడా తొలగించాం. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఓ బోర్డును కూడా నాటించాం. ఈ భూములను ఎవరు ఆక్రమించారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. వచి్చన వెంటనే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం.  
– జనార్దన్, తహసీల్దార్, బాలాపూర్‌    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top