ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో కుంగిపోయి తీవ్ర నిర్ణయం
మంచిర్యాల జిల్లాలో విషాదం
జన్నారం: పుట్టుకతో దివ్యాంగుడైన 9 ఏళ్ల కొడుకు భారం మోయలేక.. రెండేళ్లుగా తన అనారోగ్యం కారణంగా పెరిగిన అప్పులు తీర్చే దారిలేక ఓ తండ్రి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. కుమారుడి గొంతుకోసి చంపి తానూ గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రాంపూర్‌లో ఆదివారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపూర్‌కు చెందిన భూమయ్య (38)–స్వరూప దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. భూమయ్య దంపతులు కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పోషిస్తున్నారు. అయితే కొడుకు కార్తీక్ (9) పుట్టుకతో దివ్యాంగుడు. అతనికి చెవులు వినబడవు, మాటలు రావు. అలాగే నడవలేక మంచానికే పరిమితమయ్యాడు.
కొడుకు ఆరోగ్యం కోసం అప్పులు చేసి అనేక ఆస్పత్రుల్లో చూపించినా పరిస్థితి మెరుగుపడలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన భూమయ్య రెండేళ్ల క్రితం లివర్ పాడైపోవడంతో ఆపరేషన్ కోసం రూ. 5 లక్షలు అప్పు చేశాడు. అలాగే కుమారుడి చికిత్స కోసం మరో రూ. లక్ష అప్పు తీసుకొచ్చాడు. అయినా కుమారుడి పరిస్థితి మెరుగవకపోవడంతో తిరిగి మద్యానికి బానిసై ఏడాదిగా ఇంటికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం చిన్న కూతురును పిలిచి తనకు జ్వరం వచ్చిందని.. డాక్టర్‌ను తీసుకురావాలని సూచించాడు.
కూతురు బయటకు వెళ్లగానే తలుపులు వేసి గడియ పెట్టుకొని కొడుకు గొంతు కోశాడు. తర్వాత తాను గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్‌ఎంపీ వచ్చి చూడగా తలుపు లోపల గడియ పెట్టి ఉంది. ఎంత పిలిచినా తీయకపోవడంతో బద్దలు కొట్టారు. అప్పటికే కార్తీక్, భూమయ్య మృతిచెందారు. కాగా, భూమయ్య చనిపోవడానికి ముందు పెద్దకూతురు వర్షితతో రాయించిన లేఖ బయటపడింది. తనతోపాటు కుమారుడి వైద్య ఖర్చుల కోసం తెచ్చిన అప్పులు తీర్చేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నా డబ్బు రావట్లేదని.. కుమారుడికి పింఛన్ కోసం కలెక్టర్‌కు విన్నవించినా ఇవ్వట్లేదని లేఖలో భూమయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.


