
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఘటన
నాలుగు పేజీల సూసైడ్‌నోట్ లభ్యం
కొండాపూర్ (సంగారెడ్డి): భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అవమానంగా భావించిన భర్త, తన ఇద్దరు పిల్లలకు ఉరేసి, అనంతరం తానూ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచి్చన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, ఇద్దరు పిల్లలతోపాటు తండ్రి విగతజీవిగా కనిపించాడు.
ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ వెంకటేశ్ కథనం ప్రకారం... కొండాపూర్ మండలం గారకుర్తికి చెందిన సుభాష్.. భార్య మంజుల, కుమారుడు మరియన్ (13), కూతురు ఆరాధ్య (9)తో కలిసి మల్కాపూర్‌లోని సా యినగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. సుభాష్ సదాశివపేట మండలం ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
కొద్ది రోజులుగా భార్య మంజుల ప్రవర్తనలో మార్పు రావడంతో తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంజుల 5 రోజుల కిందట ఎవరికీ చెప్ప కుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని భావించిన సుభాష్ అవమానభారం భరించలేకపోయాడని, దీంతో పిల్లకు ఉరి వేసి, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సీఐ తెలిపారు. సుమారు 5 రోజుల కిందటే వారు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ఘటనా స్థలం వద్ద 4 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైందని పోలీసులు తెలిపారు.