జంక్షన్‌ క్లోజ్‌.. ట్రాఫిక్‌ జామ్‌

traffic jam in sagar society signal junction hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: ట్రాఫిక్‌ సజావుగా సాగేందుకు బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రయోగాలకు తెరలేపారు. ఇప్పటికే జూబ్లీహిల్స్‌లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పలు సిగ్నళ్ల వద్ద జంక్షన్లను మూసివేయడంతో పాటు యూ టర్న్‌లను కొనసాగిస్తున్నారు. అదే పంథాను ఇప్పుడు బంజారాహిల్స్‌లో అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 2లో ఎంతో కీలకమైన సాగర్‌ సొసైటీ సిగ్నల్‌ జంక్షన్‌ను అధికారులు మంగళవారం మూడు గంటల పాటు మూసివేశారు.

మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ట్రయల్‌ రన్‌గా ఈ జంక్షన్‌ను మూసివేసి వాహనాల రాకపోకలను ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డేతో పాటు బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ సీఐ నరసింహ రాజు పరిశీలించారు. నాన్‌ పీక్‌ హవర్స్‌లో వాహనాల రాకపోకలు జంక్షన్‌ మూసివేత వల్ల ఎంత వరకు ఒత్తిడి పెరుగుతుంది, తగ్గుతుంది అనేది పరిశీలించారు.

 అయితే ఈ మూడు గంటల్లో రద్దీ లేని సమయాలు కాబట్టి వాహనాలు ముందుకు సాగాయని ట్రాఫిక్‌ పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. టీవీ9 జంక్షన్‌ నుంచి సాగర్‌ సొసైటీ వైపు వెళ్లే వాహనదారులు కేబీఆర్‌ పార్కు చౌరస్తాలో యూ టర్న్‌ చేసుకుని రావాల్సి ఉంటుంది. అప్పటికే కేబీఆర్‌ పార్కు చౌరస్తాలో వందల సంఖ్యలో బారులు తీరిన వాహనాలకు తోడు ఈ వాహనాలు కూడా కలిపి చుక్కలు కనిపించాయి.

ఇక కేబీఆర్‌ పార్కు వైపు సాగర్‌ సొసైటీ వైపు నుంచి వచ్చే వాహనాలు టీవీ 9 చౌరస్తాలో యూ టర్న్‌ తీసుకుని రావాల్సి ఉంటుంది. ఇది కూడా వాహనదారులకు నరకప్రాయంగా మారింది. రోడ్డు విస్తరించకుండా ఫుట్‌పాత్‌లు లేకుండా చేస్తున్న ఈ ట్రయల్‌ రన్‌లతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు తమకు తోచినట్లుగా ప్రయోగాలు చేస్తూ వాహనదారులపై రుద్దుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45 ట్రాఫిక్‌ మళ్లింపులతో చుట్టూ తిరిగి వస్తున్న వాహనదారులు ఒక వైపు అసహనం వ్యక్తం చేస్తుండగానే తాజాగా సాగర్‌ సొసైటీ చౌరస్తాలో మరో ప్రయోగానికి తెరలేపి గందరగోళం సృష్టించారు. ట్రాఫిక్‌ పోలీసులు చౌరస్తాల్లో ఉండి నియంత్రిస్తే ట్రాఫిక్‌ సజావుగా ముందుకు సాగుతుందని, అందుకు విరుద్ధంగా జంక్షన్లు మూసివేసి మీ దారిన మీరు పోండి అనే విధంగా ప్రయోగాలు చేస్తుండటంతో వాహనదారులు  ట్రాఫిక్‌ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాగర్‌ సొసైటీ జంక్షన్‌ మూసివేత విఫల ప్రయోగమని మొదటి రోజే తేటతెల్లమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top