కేడర్‌ను కదిలించేలా ‘భారత్‌ జోడో యాత్ర’.. టీపీసీసీ ముమ్మర కసరత్తు

TPCC Arrangements For Rahul Gandhi Bharat Jodo Yatra In Telangana - Sakshi

రోజుకో లోక్‌సభ నియోజకవర్గ నేతలతో రాహుల్‌ భేటీ

భారత్‌ జోడో యాత్రకు టీపీసీసీ ముమ్మర కసరత్తు

ప్రతిరోజూ లంచ్‌ తర్వాత సమావేశమయ్యేలా షెడ్యూల్‌కు రూపకల్పన

భారీ స్థాయిలో స్వాగతం .. అదే స్థాయిలో వీడ్కోలు

బహిరంగ సభలతో ఎన్నికల శంఖారావం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ కోసం టీపీసీసీ నాయకత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. అక్టోబర్‌ 24 నుంచి దాదాపు 15 రోజుల పాటు ఆయన రాష్ట్రంలో యాత్ర నిర్వహించనున్న నేపథ్యంలో వీలున్నంత మేర పార్టీ కేడర్‌లో ఉత్సాహం తెచ్చేలా షెడ్యూల్‌ను రూపొందిస్తోంది. ప్రతిరోజూ ఒక లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నేతలతో రాహుల్‌గాంధీ సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలుండగా, ఆ 17 స్థానాల పరిధిలోని ముఖ్య నాయకులు, అసెంబ్లీ ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులతో రాహుల్‌ భేటీ అయి.. పార్టీ బలోపేతం, రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్‌ అనంతరం రాహుల్‌గాంధీతో పార్లమెంటరీ భేటీలుంటాయని, ఈ మేరకు సూత్రప్రాయ నిర్ణయం జరిగిందని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు. ఈ భేటీల్లోనే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో అన్ని అంశాలపై రాహుల్‌ చర్చిస్తారని, అంతర్గత విభేదాలున్న చోట్ల వాటిని సర్దుబాటు చేస్తారని చెప్పారు.

5 బహిరంగ సభలకు ఏర్పాట్లు
రాహుల్‌గాంధీ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించే చోట, రాష్ట్రం నుంచి నిష్క్రమించే చోట భారీ స్థాయిలో స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలను టీపీసీసీ నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేలా ఈ కార్యక్రమాలుండనున్నాయి. మరోవైపు 5 ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలకు కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్లాన్‌ చేస్తోంది. ఈ సభల ద్వారానే ఎన్నికల శంఖారావం పూరించే విధంగా భారీ ఎత్తున జనసమీకరణ కూడా చేయనుంది.

రాష్ట్రంలో మరింత మంది నేతల నడక
రాహుల్‌తో కలిసి దేశ వ్యాప్తంగా నడిచే 118 మంది బృందంతో పాటు రాష్ట్రంలోని 100 మంది నాయకులు కూడా తెలంగాణలో ఆయనతో కలిసి నడవనున్నారు. ఈ 100 మంది బృందంలో ఎవరెవరు ఉండాలన్న దానిపై టీపీసీసీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. వీరితో పాటు రాహుల్‌ యాత్ర జరిగే 4 లోక్‌సభ, 9 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చే జిల్లాల నేతలు కూడా యాత్రలో పాలుపంచుకోనున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎవరెవరు యాత్రలో పాల్గొనాలనే దానిపై ముందుగానే నిర్ణయం తీసుకుని వారికి పాస్‌లు కూడా జారీ చేయనున్నట్టు సమాచారం. 

ఇదీ చదవండి: 2024: ఢిల్లీ ‘పవర్‌’ మనదే.. దేశమంతా ఫ్రీ పవరే!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top