కిలో @ రూ.20 | Sakshi
Sakshi News home page

కిలో @ రూ.20

Published Wed, Aug 5 2020 8:35 AM

Tomato Prices Down in Hyderabad Market - Sakshi

సాక్షి సిటీబ్యూరో: టమాటో ధరలు భారీగా తగ్గాయి. గత నాలుగైదు రోజుల క్రితం వరకు కిలో రూ.60 వరకు ధర పలకగా..ఇప్పుడు రూ.20కి ధర పడిపోయింది. కూరగాయల్లో అత్యధికంగా వినియోగంలో ఉండే టమాటో ధరలు పెరగడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నగర శివారు జిల్లాల నుంచి మార్కెట్‌కు టమాటో దిగుమతులు భారీగా పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులుచెబుతున్నారు. వేసవి కాలంలో అంతగాటమాటో ధరలు పెరగకపోయినా వేసవిఅనంతరం ధరలు అమాంతంగా పెరిగాయి. దీనికి కారణం శివారు జిల్లాల నుంచి దిగుబడులు లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులతో ధరలు పెరిగినట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు.  

శివారు జిల్లాల నుంచి పెరిగిన దిగుమతులు 
ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకు స్థానికంగా టమాటో సాగు అంతగా ఉండదు. ఎందుకంటే వేసవి కాలంలో శివారు జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా టమాటో దిగుబడి ఉండదు. దీంతో నగర అవసరాలు తీర్చడానికి హోల్‌సేల్‌ వ్యాపారులు ఇతర  రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో నగర మార్కెట్‌లో ధరలు పెరుగుతాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచి లాక్‌డౌన్‌ ప్రారంభకావడంతో హోటళ్లు,  ఫంక్షన్స్‌తో పాటు ఇతర శుభకార్యాలకు బ్రేక్‌ పడింది. దీంతో టమాటో వినియోగం అంతగా లేదు. జూలై చివరి వారంలో మాత్రం టమాటో ధరలు రూ.60 వరకు పెరిగాయి. తిరిగి స్థానిక పంట రావడంతో ఇప్పుడు ధరలు తగ్గుముఖం పట్టాయి. కాగా ప్రతి ఇంట్లో ఇతర కూరగాయలు ఉన్నా లేకున్నా టమాటో మాత్రం ఉండాల్సిందే. ఇటు వెజ్‌ నుంచి అటు నాన్‌ వెజ్‌ వరకు ప్రతి కూరలో దాదాపు టమాటోను వినియోగిస్తారు. గ్రేటర్‌ జనాభాకు రోజుకు 3 వేల టన్నుల కూరగాయలు అవసరమని మార్కెటింగ్‌ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే 3 వేల టన్నుల్లో ఇతర కూరగాయలకంటే టమాటోనే ఎక్కువ అవసరం. అందుకే టమాటో ధరల్ని మార్కెట్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు.  

వచ్చే మార్చి వరకు బేఫికర్‌ 
వేసవి ప్రారంభంతో స్థానికంగా కూరగాయల సాగు తగ్గుతుంది. దీంతో శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గుతాయి. ఆగస్టు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు స్థానికంగా టమాటో సాగు ఎక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో వచ్చే వేసవి ప్రారంభం వరకు అన్ని రకాల కూరగాయలు, ప్రత్యేకంగా టమాటో «ఎక్కువగా దిగుమతులు ఉంటాయి. ధరలు కూడా అంతగా పెరగవు.   

Advertisement
Advertisement