Telangana Govt Will Soon Lift GO 111 Announces CM KCR In Assembly - Sakshi
Sakshi News home page

CM KCR On GO 111: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్‌ వరాల వర్షం

Published Wed, Mar 16 2022 2:20 AM

Time to Revoke GO 111 in Telangana, says CM KCR - Sakshi

తాగునీటి సమస్య ఉండదు
సింగూరు నుంచి మంజీర నీళ్లతోపాటు కృష్ణా, గోదావరి నీళ్లను సరిపడా నగరానికి తెస్తున్నాం. సుంకేశుల నుంచి 40 టీఎంసీలను తేవడానికి రూ.1,450 కోట్లతో పనులు జరుగుతున్నయి. గోదావరి జలాలు గ్రావిటీ ద్వారానే హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 100 ఏళ్లలోనూ హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు. కాబట్టి 111 జీవో అర్థరహితం. 

ఉన్న వస్త్రం పోయే..
కేంద్రం విధానాల వల్ల కరోనా కంటే ముందే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారింది. పనితీరు బాగాలేదని యూపీఏను దింపి బీజేపీని తెచ్చిన దేశ ప్రజల పరిస్థితి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందన్న కాడికి వచ్చింది. మొత్తం దేశం క్రాష్‌ అయింది.

ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన 700 మందిని చదివిస్తాం 
ఉక్రెయిన్‌ నుంచి 740 మందికిపైగా మన పిల్లలు తిరిగి వస్తే అందులో 700 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఉన్నారు. వారి చదువులకు ఎంత ఖర్చయినా భరించి చదివిస్తం. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం. 

ముఖ్యమంత్రి వరాల వర్షం
సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు... తిరిగి విధుల్లోకి ‘ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు

సాక్షి, హైదరాబాద్‌:  హైదరాబాద్‌ నగర దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాలు కలుషితం కాకుండా పరిరక్షించడానికి అమలు చేస్తున్న 111 జీవోను ఎత్తివేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంచలన ప్రకటన చేశారు. ఆ జీవో అర్థరహితమైపోయిందని, అవసరం కూడా తీరిపోయిందని చెప్పారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు.  

ఒక్కసారే ఎత్తేస్తే అరాచకం 
‘111 జీవో పరిధిలో 7 మండలాలు, 83 గ్రామాలు, సుమారు లక్షా 32 వేల 600 ఎకరాల భూమి ఉంది. గతంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ నుంచి నగరానికి నీళ్లు తీసుకునేవారు. ఇప్పుడది తగ్గిపోయింది. ఎండా కాలంలో సంక్షోభం వచ్చినప్పుడు నీళ్లు తీసుకునే సందర్భం ఉంది. ఒక నిపుణుల కమిటీ నివేదిక మేరకు రిజర్వాయర్లు కలుషితం కాకుండా ఉండాలంటే నిషేధం పెట్టాలని ఆ రోజుల్లోనే (1996) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ నగరానికి ఇప్పుడు ఈ రెండు జలాశయాల నీళ్లు వాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఒక్కసారిగా లక్షా 32 వేల ఎకరాల భూములపై జీవోను ఎత్తేస్తే అరాచకానికి అవకాశం ఉంటది.

జీహెచ్‌ఎంసీ తరహాలో 
అక్కడ కూడా గ్రీన్‌ జోన్లు, మాస్టర్‌ప్లాన్‌ రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎస్, పురపాలక శాఖను ఆదేశించిన. జీవోపై నిపుణుల కమిటీ నివేదిక త్వరలో రావాల్సి ఉంది..’అని ముఖ్యమంత్రి తెలిపారు. ఇతర ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

అనుకూల వాతావరణం చెడిపోతే కష్టం 
‘మతకలహాలు పెట్టి ప్రజలను విడదీసి ప్రజలను ఒకరిమీద ఒకరిని పడేసి తన్నేస్తే ఎలా? బెంగళూరులో విమానం దిగితే కర్ఫ్యూ ఉంటదట. హిజాబ్‌ పంచాయతీ, ప్రజలు ధరించే వస్త్రాలతో అక్కడి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఇంత సంకుచిత విధానం చేస్తే దేశం ఎక్కడకు పోతుంది? సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన బెంగళూరులో గత ప్రభుత్వాలు గత కొన్ని దశాబ్దాల పాటు సాగించిన కృషి వల్ల అక్కడ 30 లక్షల మంది ఐటీ రంగంలో పొట్టబోసుకుంటున్నారు. హైదరాబాద్‌లో బాగుంటది, ఫార్మా, పౌల్ట్రీ, ఐటీ పరిశ్రమలు పెట్టుకోవచ్చు అంటే ఎవరైన వస్తరు గానీ, ఎయిర్‌పోర్ట్‌ల దిగగానే.. వాళ్లు కత్తులు పట్టుకుని పొడుచుకుంటరట.. కర్ఫ్యూ, 144 సెక్షన్‌ ఉంటదట అంటే ఎవరొస్తరు? ఎంత పెద్ద ఫార్మా సంస్థ అయినా హైదరాబాద్‌కు వచ్చి సులువుగా కంపెనీ ప్రారంభించుకోవచ్చు. ఇక్కడ అనుకూల వాతావరణం ఉంది. ఈ వాతావరణం చెడిపోతే లక్షలాది మంది యువత భవిష్యత్తు అగమ్యగోచరమైతది.  

దేశంలో విష బీజాలు నాటుతున్నారు.. 
బీజేపీ హయాంలో దేశంలో ఏదైనా పెరిగిందంటే అది మత పిచ్చి, మతోన్మాదం, మూకదాడులే. మేం నలుగురం ఎక్కువ ఉన్నమని ఇద్దరి మీద పడి కొట్టడమేనా? ధర్మమైతదా? పద్ధతా? ఇది దేశాన్ని నడిపే విధానమా? అనేక జాడ్యాలను ప్రబలగొట్టి చక్కగా, ప్రేమపూర్వకంగా ఉన్న ఈ దేశంలో విష బీజాలు నాటుతున్నారు..’అని సీఎం ధ్వజమెత్తారు.  

దేశం ఆకలి రాజ్యమైతా ఉంది 
‘యూపీఏ కాలంలో జీడీపీ వృద్ధి రేటు 8 శాతం ఉంటే ఇప్పుడు 6 శాతానికి పడిపోయింది. దుర్మార్గమైన విధానాలతో 5 లక్షల పైచిలుకు పరిశ్రమలు మూతబడ్డాయి. యూపీఏ ఉన్నప్పుడు 4.7 శాతం ఉన్న నిరుద్యోగిత రేటు 7.11 శాతానికి పెరిగింది. దేశం ఆకలిరాజ్యమైతా ఉంది. హంగర్‌ ఇండెక్స్‌లో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ తర్వాత 101 స్థానంలో ఉన్నం. వ్యక్తిగత హక్కుల పరిరక్షణలో 81 నుంచి 115కు, మానవ అభివృద్ధి సూచిలో 80 నుంచి 131కి, ప్రజాస్వామ్య విలువ పరిరక్షణలో 56 నుంచి 93వ స్థానానికి దేశం దిగజారింది. కోట్ల మంది పేదరికంలోకి పోయారు. ఇవన్నీ యూఎన్‌డీపీ, వరల్డ్‌ బ్యాంక్, రిజర్వ్‌ బ్యాంక్‌ ఇచ్చిన లెక్కలే..’అని తెలిపారు.  

రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారు 
‘రాష్ట్రాల అఖిల భారత సర్వీసు అధికారుల్లో ఏ అధికారినైనా ఎప్పుడుపడితే అప్పుడు పిలిపించుకునే అధికారం తాము పెట్టుకుంటామని కేంద్రం అనడం చాలా దుర్మార్గం. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. దీనిని విరమించుకోవాలని కేంద్రానికి బలంగా చెప్పినం. సింగరేణిని కూడా ఖతం చేసే పని పెడ్తున్నరు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసింది. మన హక్కులు, మన అవసరాలు తీరిన తర్వాతే నదుల అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరాం. త్వరలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేసుకోబోతున్నం..’అని కేసీఆర్‌ వివరించారు.  

త్వరలో పోడు భూములకు పట్టాలు 
‘పోడు భూముల లెక్కలు తేలినయి. త్వరలో నియోజకవర్గాల్లో పోడు భూముల పట్టాలు జారీ చేస్తాం. సుప్రీంకోర్టులో కేసు తేలిన తర్వాత ఎమ్మెల్యేలు, అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి చర్యలు తీసుకుంటాం. వరంగల్‌ జిల్లాలో వర్షాలతో మిర్చి, ఇతర పంటలకు జరిగిన నష్టంపై నివేదికలు వస్తే కడుపునిండా ఆదుకుంటం. వారసత్వ కట్టడాలను పరిరక్షిస్తూనే ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మిస్తాం. దేవరయాంజాల్‌లోని ఆలయ భూముల కబ్జా (మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన ఆరోపణలు) ఆరోపణలపై నలుగురు ఐఏఎస్‌ల కమిటీ నివేదిక ఇచ్చాక గజం భూమి కూడా కబ్జాకు గురికాకుండా ప్రభుత్వం కాపాడుతుంది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో జాప్యం వద్దని అధికారులకు గట్టిగా సూచనలు చేస్తున్న. ధరణి పోర్టల్‌లో చిక్కులు తొలగించడానికి ఏడెనిమిది వెసులుబాట్లను కల్పించాం. భూదాన్‌ భూములను తక్షణమే ధరణిలో తెస్తాం..’అని చెప్పారు. 

భట్టిగారిని పార్లమెంటుకు పంపుదాం.. 
‘బడ్జెట్‌ సమయంలో సీఎల్పీ నేత భట్టి గారి ప్రేమకు మేం నోచుకోలేదు, ఒక్కటన్న మంచి మాట మా గురించి చెప్పలేదు అని ప్రతిసారీ నేను సభలో అంటుంటా. ఈసారి ఆయన మన ఊరు మన బడి కార్యక్రమం గురించి సానుకూలంగా మాట్లాడినట్టు పత్రికల ద్వారా తెలుసుకున్నా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న తీరుపై ఆయన గట్టిగా మాట్లాడుతుంటే మా వాళ్లు, భట్టిగారిని రాష్ట్రం తరఫున పార్లమెంటుకు పంపితే గట్టిగా మాట్లాడతారని అంటున్నారు..’అని కేసీఆర్‌ చెప్పారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంలో భట్టి విక్రమార్క, మజ్లిస్‌ నేత అక్బరుద్దీన్‌లు తన ఆరోగ్యం గురించి మంచిమాటలు చెప్పినందుకు వారికి ధన్యవాదాలని అన్నారు.  

సీఎం వరాల వర్షం
‘సెర్ప్‌లోపనిచేసే 4 వేల పైచిలుకు సిబ్బందితో పాటు మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తాం. సమ్మెకు పోవడంతో గతంలో తొలగించిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను మానవతా దృక్పథంతో మళ్లీ వాపస్‌ తీసుకుని పనిలో పెడ్తం. మళ్లీ సమ్మెకు పోవద్దని పెద్దన్నగా హెచ్చరిస్తున్న. వీఆర్‌ఓలను కూడా ఉద్యోగ నియామకాలతో పాటే శాఖలకు పంపిణీ చేయడం జరుగుతుంది. వీఆర్‌ఏల్లో విద్యాధికులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నరు. పే–స్కేల్‌ ఇచ్చి ఇరిగేషన్‌ శాఖలో లస్కర్‌గా వీఆర్‌ఏలను తీసుకోవాలని ఆలోచన చేస్తున్నం. వారి నుంచి ఆప్షన్లు తీసుకుంటాం. రాష్ట్రంలో 54,201 మంది మధ్యాహ్న భోజనం కార్మికులున్నరు. విద్యాశాఖ మంత్రి సూచన మేరకు వారి గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3 వేలకు పెంచాలని నిర్ణయించాం’ అని కేసీఆర్‌ తెలిపారు. 

మన అప్పులు చాలా తక్కువ.. 
‘అప్పుల్లో మనం 25వ స్థానంలో ఉన్నాం, మనకంటే ఎక్కువ అప్పు తెచ్చుకుంటున్న రాష్ట్రాలు మరో 24 ఉన్నాయి. జీఎప్‌డీపీలో మన అప్పుల వాటా 23 శాతమే. 40 శాతానికి పైబడ్డ రాష్ట్రాలూ ఉన్నాయి. మన అప్పులు చాలా తక్కువ. అప్పులతో మనకొచ్చే నష్టం లేదు. కేంద్రం ఆర్థిక పనితీరు మనకంటే తక్కువగా ఉంది. జీడీపీలో కేంద్రం అప్పుల వాటా 58.5 శాతం. రూ.152 లక్షల కోట్ల అప్పులున్నాయి. కేంద్రం తీరు బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు అన్నట్టుగా ఉంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోంది..’అని విమర్శించారు. 

డబుల్‌ ఇంజన్‌ కాదు ట్రబుల్‌ ఇంజన్‌! 
‘డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌ ఉన్న రాష్ట్రాలు చాలా బాగుపడ్డాయి అని ఓ పుణ్యాత్ముడు మాట్లాడిండు. డబుల్‌ ఇంజన్‌ గ్రోత్‌ ఉన్న యూపీతో పోల్చితే.. రూ. 2.78 లక్షల తలసరి ఆదాయంతో తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంది. రూ.71 వేలతో యూపీ అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది. యూపీ ఆర్థికాభివృద్ధి రేటు 7.26 శాతమైతే తెలంగాణది 10.8 శాతం. యూపీలో 2017 నుంచి 21 వరకు వృద్ధిరేటు 25.6 శాతం అయితే.. మన సింగిల్‌ ఇంజన్‌ గ్రోత్‌ 55.46 శాతం. యూపీలో మాతా మరణాల రేటు 167 ఉంటే తెలంగాణలో కేవలం 56. యూపీలో శిశు మరణాల రేటు 41, తెలంగాణలో 23. మతపిచ్చి, రాష్ట్రాల అధికారాలను హరించే పద్ధతులు, సంస్కరణల పేరిట జరిగే మర్మ మాయాజాలం.. వీటన్నింటినీ తట్టుకుని తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతి సాధించింది..’ అని సీఎం తెలిపారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement