
రాష్ట్ర హైకోర్టుకు జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత
ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్ కలకత్తా హైకోర్టుకు బదిలీ
కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లోని 21 మంది న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన కొలీజియం ఈ మేరకు కేంద్రానికి సిఫార్సు చేసింది. బదిలీలకు సిఫార్సు చేసిన వారిలో జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ చిల్లకూర్ సుమలత కూడా ఉన్నారు. జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ సుమలత మాతృ హైకోర్టు (పేరెంటల్ హైకోర్టు) తెలంగాణ కాగా, జస్టిస్ కన్నెగంటి లలిత తొలుత ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
అనంతరం ఆమె కూడా తెలంగాణకు బదిలీ అయ్యారు. ఇక్కడ విధులు నిర్వహిస్తుండగానే పట్నాకు జస్టిస్ అభిషేక్‌రెడ్డి, కర్ణాటకకు జస్టిస్ లలిత, జస్టిస్ చిల్లకూర్ సుమలత బదిలీపై వెళ్లారు. ఇప్పుడు ఈ ముగ్గురు తెలంగాణ హైకోర్టుకు బదిలీ కానున్నారు. కాగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ సుజోయ్‌పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం హైకోర్టులో ఏసీజేతో కలిపి 29 మంది న్యాయమూర్తులున్నారు.
ఒకరు బదిలీపై వెళ్లడం, ముగ్గురు న్యాయమూర్తుల రాకతో ఈ సంఖ్య 31కి చేరనుంది. ఇంకా 11 పోస్టులు ఖాళీ ఉండనున్నాయి. అలాగే, మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ బట్టు దేవానంద్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసింది. ఇదిలా ఉండగా, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని కొలీజియం సిఫార్సు చేసినట్లు సమాచారం.