నాగోబాకు మహాపూజలు | Thousands of devotees came to Nagoba fair | Sakshi
Sakshi News home page

నాగోబాకు మహాపూజలు

Jan 29 2025 4:40 AM | Updated on Jan 29 2025 4:40 AM

Thousands of devotees came to Nagoba fair

భక్తిశ్రద్ధలతో కొలిచిన మెస్రం వంశీయులు 

ఉట్టిపడిన సాంప్రదాయ, ఆచార వ్యవహారాలు 

కేస్లాపూర్‌ జాతరకు వేలాదిగా తరలివచ్చిన భక్తులు

సాక్షి, ఆదిలాబాద్‌: నాగోబా మహాపూజలందుకుంది. తమ ఆరాధ్య దైవాన్ని మెస్రం వంశీయులు భక్తిశ్రద్ధలతో కొలిచారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయం ఇందుకు వేదికైంది. మంగళవారం ఉదయం 11 గంటలకు పురుషులు కలిసికట్టుగా కాలినడకన బయల్దేరి నాగోబా ప్రతిమను ఊరేగిస్తూ సంప్రదాయ వాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్నారు. 

వారు ధోవతి, చొక్కా, మెడలో కండువా, తలపాగతో పైనుంచి కింది వరకు తెల్లని వ్రస్తాలు ధరించారు. మహిళలు సంప్రదాయ వ్రస్తాలు ధరించి చ్చిచనా, భుజం పైనుంచి తెల్లని వస్త్రాన్ని కప్పుకొని తలపై బిందెల్లో నీళ్లతో అందరూ కలిసికట్టుగా వచ్చారు. మురాడి నుంచి మెస్రం వంశీయులు ఇలా వేలాదిగా ఆలయానికి చేరుకుంటున్న ఘట్టం కన్నుల పండువగా సాగింది.  

కొత్త కుండలు అందజేత 
ఆలయానికి చేరుకున్న తర్వాత మెస్రం వంశీయులు తమ సంప్రదాయ పూజలు మొదలుపెట్టారు. మొదటగా మెస్రం పెద్దలు 22 కితల్లోని మహిళలు, ఆడపడుచులకు కొత్త కుండలను అందజేయగా, ఆడపడుచులు, మహిళలు, అల్లుళ్లు కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ వెళ్లి కోనేరు వద్దకు చేరుకున్నారు. అక్కడ జలాన్ని సేకరించి అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకున్నారు. 

ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగించారు. ఆపై ఆడపడుచులు, మహిళలు పుట్ట మట్టి, పశువుల పేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కొత్త పుట్టలను తయారు చేశారు. ఇలా ఒక్కో ఘట్టంలో వారి సంప్రదాయం, ఆచార వ్యవహారాలు కొట్టొచి్చనట్టుగా కనిపించాయి. నాగోబా ఆలయంలోని బౌల సతీ దేవత ముందు ఏడు వరుసలతో తయారు చేసిన దేవతామూర్తులను ఉంచారు. 

రాత్రి 9 నుంచి 11 గంటల మధ్య నాగోబాకు మహాపూజ నిర్వహించారు. కొద్ది రోజుల ముందు పాదయాత్రగా వెళ్లి గోదావరినది నుంచి కలశాల్లో తీసుకొచి్చన పవిత్ర జలంతో పూజలు చేశారు. ఇలా ఉదయం నుంచి సంప్రదాయ పూజలు, రాత్రి మహాపూజ నిర్వహించి నాగోబా జాతరను మొదలుపెట్టారు.
  
అర్ధరాత్రి కొత్త కోడళ్ల భేటింగ్‌ 
మహాపూజ అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత తమ సంప్రదాయ పద్ధతిలో మెస్రం వంశీయులు భేటింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. కొత్త కోడళ్ల పరిచయమే ఈ భేటింగ్‌. కొత్త కోడళ్లు నాగోబా సన్నిధికి వస్తారు. ఈ సన్నిధికి వచ్చిన తర్వాతే వారు తమ సంప్రదాయ పూజల్లో నిరంతరం పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. 

ఇలా మెస్రం వంశీయులు చేపట్టే ఈ కార్యక్రమంలో వారి ఆచార వ్యవహారాలు నిండుగా కనిపిస్తాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మహాపూజలో పాల్గొన్నారు. జాతరకు పలు రాష్ట్రాల నుంచి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement