ప్రైవేటు చేతికి ఆర్టీసీ కార్గో | TGSRTCs cargo privatization: Telangana | Sakshi
Sakshi News home page

ప్రైవేటు చేతికి ఆర్టీసీ కార్గో

Apr 18 2026 5:27 AM | Updated on Apr 18 2026 5:27 AM

TGSRTCs cargo privatization: Telangana

నిర్వహణ భారంతో వదిలించుకున్న వైనం 

నెలవారీ రూ.3 కోట్లు చెల్లించనున్న ప్రైవేటు సంస్థ 

సరిగ్గా సమ్మె వేళ...మళ్లీ ప్రైవేటుకు అప్పగింత

సాక్షి, హైదరాబాద్‌: కార్గో విభాగాన్ని ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటుకు అప్పగించింది. ప్రత్యేకంగా కార్గో విభాగాన్ని ఏర్పాటు చేసి, దానికి సిబ్బందిని కేటాయించి క్రమంగా విస్తరించుకుంటూ వస్తున్న తరుణంలో, నిర్వహణ భారంగా మారిందంటూ దాన్ని ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టింది. 2019లో 52 రోజుల సుదీర్ఘ సమ్మె జరిగిన తర్వాత ప్రారంభమైన ఆ విభాగం, ఇప్పుడు మరోసారి సమ్మెకు కార్మికులు సిద్ధమవుతున్న వేళ ప్రైవేటు చేతికి వెళ్లడం చర్చకు దారి తీస్తోంది. నెలకు రూ.3 కోట్ల మొత్తం ఆర్టీసీకి చెల్లించేలా ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదిరింది. ఇప్పటి వరకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే ఇది మంచి మొత్తమేనని సంస్థ పేర్కొంటుండగా, కార్గో విభాగాన్ని విస్తరించాలంటూ వస్తున్న డిమాండ్‌తో పోలిస్తే తక్కువ మొత్తమేనన్న భావన వ్యక్తమవుతోంది. సమ్మె సన్నాహకాల్లో ఉన్న కార్మికులకు ఇదో ఆయుధంగా మారింది.  

రూ.లక్షల నుంచి రూ.కోట్లలోకి ఆదాయం 
ఆర్టీసీ బస్సుల్లో పార్సిళ్లను పంపే పద్ధతి ఏళ్లుగా ఉంది. ఆరేళ్ల క్రితం వరకు ఆ ప్రక్రియను ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించేది. ఆ సంస్థ భారీగా ఆదాయం పొందుతూ ఆర్టీసీకి నామమాత్రపు మొత్తాన్ని చెల్లించేది. ఇదో కుంభకోణమంటూ 2019లో సమ్మె సమయంలో కార్మిక సంఘాలు ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తాయి. సమ్మె ముగిసిన తర్వాత, నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రైవేటు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయించి ఆర్టీసీలోనే ప్రత్యేకంగా కార్గో విభాగాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో ప్రభుత్వం రెండువేల బస్సు సర్వీసులను రద్దు చేసింది.

దీంతో పెద్దసంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లు మిగిలిపోగా.. వారిలో దాదాపు 550 మంది సిబ్బంది కార్గో విధుల్లోకి వచ్చారు. రెగ్యులర్‌ బస్సుల్లో పార్సిళ్లను తరలించటంతోపాటు పెద్ద మొత్తంలో సరుకులను తరలించేందుకు ప్రత్యేకంగా కార్గో బస్సులను తయారు చేశారు. క్రమంగా ఆర్టీసీకి కార్గో ఆదాయం పెరుగుతూ నెలకు రూ.కోట్లలోకి చేరుకుంది. వార్షిక ఆదాయం రూ.100 కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

అయితే, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే సిబ్బందికి చెల్లించే జీతంతో పోలిస్తే, ఆర్టీసీ కార్గో సిబ్బంది జీతాలు భారీగా ఉండటం ప్రభావాన్ని చూపింది. వస్తున్న ఆదాయంలో జీతాల వాటా ఎక్కువగా ఉన్నందున ఇది గిట్టుబాటు వ్యవహారం కాదని సంస్థ ఓ నిర్ణయానికి వచ్చింది. క్రమంగా కండక్టర్లు, డ్రైవర్లను తిరిగి బస్సు సర్వీసులకు మళ్లిస్తూ వచ్చింది. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని దాన్ని కొనసాగించే బదులు, ప్రైవేటుకు అప్పగించి వదిలించుకోవటం ఉత్తమమని ఆర్టీసీ నిర్ణయించి, టెండరు ప్రక్రియతో ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించేసింది.

తక్కువ జీతాలతో సిబ్బందిని ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆ సంస్థకు భారీగానే గిట్టుబాటవుతున్నట్టు తెలిసింది. క్రమంగా కార్గో సేవలను విస్తరిస్తుండటంతో, గతంతో పోలిస్తే ఆర్టీసీకి వచ్చే ఆదాయం కూడా పెరిగిందని సమాచారం. ఏడాదికి రూ.100 కోట్ల ఆదాయాన్ని పొందేలా ప్లాన్‌ చేసుకున్న ఆర్టీసీకి మాత్రం అది కలగానే మిగిలిపోయింది.

Advertisement
 
Advertisement
Advertisement