
కర్ణాటకలోని కొండమవ్వ ఆలయంలో విచిత్ర ఆచారం
అక్కడ తేళ్లను ఒంటిపై వేసుకున్నా కుట్టవని భక్తుల విశ్వాసం
నారాయణపేట: దేశమంతా నాగుల పంచమి పండుగ జరుపుకుంటే మంగళవారం నారాయణపేట జిల్లా సరిహద్దులో ఉన్న కర్ణాటక రాష్ట్రంలోని కందుకూరులో మాత్రం తేళ్ల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాద్గీర్ జిల్లా గురి్మత్కల్ తాలూకా కందుకూరు సమీపంలోని కొండమవ్వ (మహేశ్వరి) అమ్మవారి సన్నిధిలో భక్తులు కొండమవ్వను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏటా నాగుల పంచమి రోజే ఇక్కడ తేళ్ల పంచమి జరుపుకోవడం ఆచారం.
ఈ ఆలయ పరిసరాల్లో తేళ్లు మనుషులకు హాని చేయవు. అమ్మవారి మహిమ వల్లే తేళ్లు తమకు హాని చేయవనేది భక్తుల విశ్వాసం. కొండపై ఆలయ పరిసరాల్లోని ఏ చిన్న రాయిని తొలగించినా.. వాటి కింద తేళ్లు కనిపిస్తాయి. వాటిని చేతితో తాకినా.. పట్టుకున్నా..ముఖం, మెడ నాలుకపై వేసుకున్నా, శరీరంపై పాకించినా కుట్టవు. ఇది అమ్మవారి దివ్యానుగ్రహమని భక్తులు విశ్వసిస్తారు. గుట్టపై ఉండే వాతావరణ పరిస్థితులు, వనమూలికల కారణంగా తేళ్లు కుట్టవని కొందరు విద్యావంతులు చెబుతున్నారు.