
వైరా: తెలంగాణలో పీజీలు, పీహెచ్‌డీలు చేసిన యువతీ యువకులు కూలీనాలి చేసుకుం టుంటే.. వారిని చదివించి తప్పు చేశామా? అని తల్లిదండ్రులు బాధపడుతున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా 87వ రోజు మంగళవారం ఆమె ఖమ్మం జిల్లా వైరా మండలంలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్నానాల లక్ష్మీపురంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాల కోసం 54 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే నిరుద్యోగ తీవ్రత అర్థమవుతోం దన్నారు. ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కేసీఆర్ హంతకుడితో సమానమని, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు.