ప్రాథమిక జాబితా ఏది.. కటాఫ్‌ మార్కులేవి?

Telangana Women Development Department Complaints Over Appointment Of Supervisor Posts - Sakshi

మహిళాభివృద్ధి శాఖలోని సూపర్‌ వైజర్‌ పోస్టుల నియామకాలపై ఫిర్యాదులు 

అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసిన యంత్రాంగం 

తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేశారని అభ్యర్థుల అనుమానం 

సాక్షి, హైదరాబాద్‌: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో సూపర్‌వైజర్‌ పోస్టుల నియామకాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియామకాల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని క్షేత్రస్థాయి నుంచి సంబంధిత మంత్రి పేషీ, రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రాథమిక జాబితాను, కటాఫ్‌ మార్కులను ప్రకటించకుండా ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 

జిల్లాల వారీగా 
ఎవరెవరు ఎంపికయ్యారో: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 420 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్‌గా పదేళ్ల సీనియారిటీ, పదో తరగతి విద్యార్హతలను విధించడంతో దాదాపు 24 వేల మంది అభ్యర్థులు జనవరి రెండో తేదీన పరీక్ష రాశారు. రాత పరీక్ష తాలూకు ఫలితాలను ఫిబ్రవరిలో ప్రకటించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ జిల్లాల వారీగా ఉన్న ఖాళీల ప్రకారం 1:2 పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేసి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ కోసం వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చింది.

దీంతో నిర్దేశించిన తేదీల్లో అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. అయితే జిల్లాల వారీగా ఎవరెవరు ప్రాథమికంగా ఎంపికయ్యారో స్పష్టత లేదు. అధికారుల వద్ద జాబితా ఉన్నా ఆ వివరాలను వెబ్‌సైట్‌లో లేదా జిల్లా కార్యాల యాల్లో అందుబాటులో ఉంచ కపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కులనూ ఆ శాఖ వెల్లడించలేదు. దీంతో తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేశారంటూ ఉన్నతాధికారులకు, సంబంధిత మంత్రి కార్యాలయానికి పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు మంత్రిని, ఆ శాఖ కమిషనర్‌ను వ్యక్తిగతంగా కలిసి సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. 

ఫిర్యాదుల కోసం హెల్ప్‌లైన్‌ 
సూపర్‌వైజర్‌ పోస్టుల నియామకాలపై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసింది. ఫోన్‌ ద్వారా లేదా వాట్సాప్‌ ద్వారా ఫిర్యా దులు స్వీకరిస్తోంది. అభ్యర్థుల ప్రశ్నలకు వీలైనంత మేర సమాధానాలిస్తున్నామని చెబుతున్నారు. హెల్ప్‌లైన్‌ ఏర్పాటుతో మంత్రి పేషీకి, కమిషనరేట్‌కు అభ్యర్థుల తాకిడి తగ్గినా ఫిర్యాదులు మాత్రం తగ్గట్లేదు. కాగా, జిల్లాల వారీగా మెరిట్‌ జాబితా, ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితా, కేటగిరీల వారీగా కటాఫ్‌ వివరాలను మాత్రం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఇప్పటికీ ప్రకటించలేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top