Telangana: డీజీపీ రేసులో పోటాపోటీ! | Sakshi
Sakshi News home page

Telangana: డీజీపీ రేసులో పోటాపోటీ!

Published Sat, Dec 24 2022 4:53 PM

Telangana: Who Will be the Next DGP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కొత్త పోలీస్‌ బాస్‌ ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పోలీస్‌ విభాగాధిపతిగా ఎవరు వస్తారన్న చర్చ పోలీస్‌ వర్గాల్లో జోరందుకుంది. ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని కొత్త డీజీపీగా నియమించనుందనే విషయానికి మరో వారంలో తెరపడనుంది. హెచ్‌ఓపీఎఫ్‌ (హెడ్‌ ఆఫ్‌ పోలీస్‌ ఫోర్స్‌) డీజీపీ రేసులో ఏసీబీ డీజీపీ అంజనీకుమార్, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రేసులో మాత్రం వీరి ముగ్గురితోపాటు మరో సీనియర్‌ ఐపీఎస్‌ రాజీవ్‌రతన్‌ సైతం ఉన్నట్టు సమాచారం. 

డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు ప్రస్తుతం సీనియార్టీ ప్రకారం డీజీపీ ర్యాంకులో 1989 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఉమేశ్‌ షరాఫ్, 1990 బ్యాచ్‌కు చెందిన అంజనీకుమార్, రవిగుప్తా ఉన్నారు. సీఐడీ డీజీగా పనిచేసిన మరో సీనియర్‌ ఐపీఎస్‌ గోవింద్‌సింగ్‌ గత నెలలో పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌రతన్‌కు డీజీ ర్యాంకు దక్కనుంది. అయితే, అందరిలోకి సీనియర్‌ అయిన ఉమేశ్‌ షరాఫ్‌ పదవీ కాలం 2023 జూన్‌తో ముగియనుంది. కేవలం ఆరు నెలల కాలమే ఉన్నందున ఆయనకు అవకాశాలు తక్కువే అన్న అభిప్రాయాలు పోలీస్‌ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. 

ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్‌ సీపీగా పనిచేసిన వారికి డీజీపీగా పదోన్నతి లభించింది. తెలంగాణ తొలి డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రస్తుత డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి విషయంలోనూ ఇదే మాదిరి జరిగింది. వారిద్దరు సైతం హైదరాబాద్‌ సీపీగా పనిచేస్తూ డీజీపీగా పదోన్నతి పొందారు. ఆ లెక్కన డీజీపీ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో అంజనీకుమార్‌ గతంలో హైదరాబాద్‌ సీపీగా పనిచేయగా, సీవీ ఆనంద్‌ ప్రస్తుతం ఆ పదవిలో ఉన్నారు. 

ఎక్స్‌కేడర్‌ కోటాలో సీవీ ఆనంద్‌కు పదోన్నతి? 
సీఐడీ డీజీగా పనిచేసి ఇటీవల రిటైరైన గోవింద్‌ సింగ్‌ స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన రాజీవ్‌ రతన్‌కు డీజీ ర్యాంకులో పదోన్నతి దక్కింది. అయితే ప్రభుత్వం ఎక్స్‌కేడర్‌ కోటా కింద ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులకు ఒకే హోదా ఉండేందుకు వీలుగా డీజీ పోస్టు సృష్టించి పదోన్నతి కల్పించవచ్చు. అలా సీవీ ఆనంద్‌ అడిషనల్‌ డీజీ ర్యాంకు నుంచి డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందుతారు. లేదంటే ఈనెల 31న పదవీ విరమణ పొందనున్న మహేందర్‌రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌కు డీజీ హోదా దక్కే అవకాశముంది. 

ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రవిగుప్తా పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 30 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకుని అదనపు డీజీపీ ర్యాంకులో ఉన్న వారిని సైతం డీజీపీ పోస్టులో నియమించే వెసులుబాటు ఉంది. దీని ప్రకారం 1992 బ్యాచ్‌కు చెందిన జితేందర్‌ (ప్రస్తుతం శాంతి భద్రతల అడిషనల్‌ డీజీ) సైతం డీజీపీ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఉమేశ్‌ షరాఫ్‌ (1989), అంజనీకుమార్‌ (1990), రవిగుప్తా (1990), రాజీవ్‌ రతన్‌ (1991), సీవీ ఆనంద్‌ (1991) పేర్లు యూపీఎస్సీ సెలెక్షన్‌ కమిటీకి పంపినట్టు సమాచారం. ఇందులోంచి కేంద్రం ముగ్గురిని షార్ట్‌ లిస్ట్‌ చేస్తే వారిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేయనున్నారు. లేదంటే ముందుగా ఒకరిని ఇంచార్జి డీజీపీగా నియమించి, తర్వాత పూర్తిస్థాయి డీజీపీని నియమించే అవకాశం ఉన్నట్టు పోలీస్‌ వర్గాలు తెలిపాయి. (క్లిక్ చేయండి: అదే జరిగితే బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సీట్లను కోల్పోక తప్పదా?!)

Advertisement
Advertisement