
హైదరాబాద్‌కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శనివారం) భారీ నుంచి అతి భారీ వర్షం తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం ఏకధాటిగా నాలుగు గంటలపాటు కురిసిన వానతో నగరంలో పలుప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇప్పటికే జలదిగ్బంధంలో ఉన్న ప్యాట్నీ సింధీ కాలనీలో బోట్ల సాయంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. కంటోన్మెంట్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీళ్లను తొలగిస్తున్నారు. నాలా రిటైనింగ్ వాల్ కట్టకపోవడంతోనే ఇళ్లలోకి వర్షపు నీరు చేరినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఇక హైదరాబాద్ వర్షాలపై హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. వర్షాలపై సీఎం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నారు. లోతట్టు ప్రాంతాలపై ఎక్కడైనా ఇబ్బందులుంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురండి. ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, హైడ్రా కమిషనర్ , పోలీస్ కమిషనర్, వాటర్ వర్క్ ఇతర అధికారులను అప్రమత్తం చేస్తూ వారితో మాట్లాడడం జరిగింది
.. హైదరాబాద్ నగరానికి సంబంధించి నీళ్లు ఎక్కడ నిల్వ లేకుండా సిబ్బంది వెంట వెంటనే తొలగిస్తున్నారు. మొత్తం 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ పై అధికారులు సమన్వయం చేసుకుంటూ అక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకున్నాం. జీహెచ్‌ఎంసీ ,రెవెన్యూ , పోలీస్ అధికారులు ప్రజల ఇబ్బందులు వస్తె పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాలి ఏదైనా విపత్తు వస్తె అధికారులకు వెంటనే తెలియజేయాలి’’ అని పొన్నం నగరవాసులను కోరారు.
మరోవైపు.. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదులకు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలన్నారు.