అధికారి కాలర్‌ పట్టుకున్న గద్వాల ఎమ్మెల్యే  | Telangana: TRS MLA Holding Government Officer Collar | Sakshi
Sakshi News home page

అధికారి కాలర్‌ పట్టుకున్న గద్వాల ఎమ్మెల్యే 

Nov 23 2022 12:52 AM | Updated on Nov 23 2022 12:52 AM

Telangana: TRS MLA Holding Government Officer Collar - Sakshi

అధికారి కాలర్‌ పట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి 

గద్వాల రూరల్‌: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఓ ప్రభుత్వ అధికారి చొక్కా కాలర్‌ పట్టి బూతులు తిట్టిన ఘటన మంగళవారం గద్వాల జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. గద్వాలలో మహాత్మ జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ సరితను అధికారులు ఆహ్వానించారు. నిర్దేశిత సమయానికి వచ్చిన జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆ గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకొని కోపంతో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే అధికారులపై చిందులు తొక్కారు.

ప్రొటోకాల్‌ ప్రకారం గురుకుల పాఠశాలలకు తాను చైర్మన్‌కాగా, జెడ్పీ చైర్‌పర్సన్‌తో దానిని ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్‌ వెంగళ్‌రెడ్డి సర్దిచెప్పబోగా ఒక్కసారిగా కోపోద్రిక్తులైన ఎమ్మెల్యే ఆయన చొక్కా కాలర్‌ పట్టుకుని బలంగా వెనక్కి నెట్టేశారు. పత్రికలో రాయలేని విధంగా బూతులు తిడుతూ ఊగిపోయారు. దీంతో పక్కనే ఉన్న మహిళా అధికారులు, నాయకులు బిత్తరపోయారు. అక్కడే ఉన్న పార్టీ నాయకులు అధికారి వెంగళ్‌రెడ్డిని పక్కకు తీసుకుపోయారు. ప్రజాప్రతినిధి దాదాగిరికి పాల్పడటంపట్ల అధికార, ఉద్యోగవర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో ఉన్న గ్రూపుల మధ్య నలుగుతున్న అధికారులు తాజా ఘటనతో బెంబేలెత్తుతున్నారు. వారిలో భయాందోళన వ్యక్తమవుతోంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement