ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టీఫా యంత్రాలు

Telangana: TIFA Machines In Government Hospitals: Harish Rao - Sakshi

ఈనెల 18న ఏకకాలంలో ప్రారంభిస్తాం

టెస్టుల కోసం గర్భిణులు ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరంలేదు

మాతా శిశు సంరక్షణ కేంద్రాల పనులు త్వరగా పూర్తి చేయాలి

వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 అత్యాధునిక టీఫా (టార్గెటెడ్‌ ఇమేజింగ్‌ ఫర్‌ ఫీటల్‌ అనామలీస్‌– పుట్టబోయే పిల్లల్లో ఏవైనా లోపాలున్నాయా అనేది ఈ స్కాన్‌లో తెలుస్తుంది) యంత్రాలను ఈనెల 18న ఏక కాలంలో ప్రారంభించనున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. గర్భిణులు టెస్టుల కోసం ప్రైవేటుకు వెళ్లాల్సిన అవసరం లేదని, టి–డయాగ్నొస్టిక్‌ కేంద్రాల ద్వారా థైరాయిడ్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీఫా స్కానింగ్‌ నిర్వహిస్తారని వెల్లడించారు.

ఆప్తాల్మిక్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా ప్రారంభించనున్నామన్నారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ, ఎన్‌హెచ్‌ఎం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి హరీశ్‌ రావు సోమవారం నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సివిల్, ఎక్విప్‌మెంట్, ఈ– ఉపకరణ్, డ్రగ్స్, సర్జికల్, డయాగ్నొస్టిక్స్, స్పెషల్‌ ప్రాజెక్ట్స్‌ తదితర అంశాలపై చర్చించారు.

గాంధీ, నిమ్స్, జహీరాబాద్, హుస్నాబాద్, మల్కాజ్‌గిరి, కామారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. టీవీవీపీ పరిధిలోని 32 ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్‌ పనులు, 13 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ డయాగ్నొస్టిక్‌ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 41 బస్తీ దవాఖానాలను 31 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని, జిల్లాల్లో ఏర్పాటవుతున్న బస్తీ దవాఖానాల పనులు వేగవంతం చేయాలన్నారు. డీఎంహెచ్‌వోలు బాధ్యత తీసుకొని, జిల్లా కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో పని చేయాలని సూచించారు. ఎప్పటికపుడు క్షేత్ర స్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలన్నారు. జీవన్‌ దాన్‌ ద్వారా ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జరీలు, బ్రెయిన్‌ డెడ్‌ డిక్లరేషన్‌ పెంచేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేతా మహంతి, డీఎంఈ రమేష్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌కుమార్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీనివాస్‌రావు, సీఎం ఓఎస్డీ గంగాధర్, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top