ఇంఫాల్‌ నుంచి ఇంటికి వచ్చిన తెలంగాణ విద్యార్థులు.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

Telangana Students Reached Home From Manipur Imphal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/శంషాబాద్‌: మణిపూర్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, ఇతర పౌరులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తోంది. తొలి విడతగా సోమవారం మధ్యాహ్నం 72 మంది విద్యార్థులు శంషాబాద్‌ విమానాశ్రయానికి (6ఈ–3165 విమానంలో) చేరుకున్నారు. మొత్తం 130 మంది విద్యార్థులు అక్కడ ఉన్నట్టు వివరాలు సేకరించిన అధికారులు తరలింపు చర్యలను వేగవంతం చేశారు. రిజర్వేషన్ల అల్లర్లతో మణిపూర్‌ అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే.

కాగా రాష్ట్రానికి చెందిన విద్యార్థులను సురక్షితంగా రప్పించాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ ఎప్పటికప్పుడు మణిపూర్‌ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు సోమవారం ఇంఫాల్‌ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న 72 మందికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీశ్, పలువురు పోలీసు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. తమను మణిపూర్‌ నుండి సురక్షితంగా రప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

మణిపూర్‌లో ఉన్న మిగతా విద్యార్థుల్లో కొందరు సోమవారం రాత్రి, మరికొందరు మంగళవారం ఉదయానికి హైదరాబాద్‌కు చేరుకుంటారని అధికారులు తెలిపారు. విద్యార్థుల తరలింపు వ్యయం అంతా ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. విద్యార్థులను హైదరాబాద్‌ నుంచి స్వస్థలాలకు చేరవేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.

 

రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నా అండగా ఉంటాంమణిపూర్‌లోని ఎన్‌ఐటీ పక్కనే జరిగిన బాంబు దాడులతో విద్యార్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని మంత్రి మల్లారెడ్డి చెప్పారు. అయితే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు అక్కడి అధికారులతో మాట్లాడి విద్యార్థులు సురక్షితంగా రాష్ట్రానికి చేరుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా, భరోసాగా ఉంటుందన్నారు.  
ఇప్పట్లో తిరిగి వెళ్లే పరిస్థితి లేదు..
నాతో పాటు తెలంగాణకు చెందిన నలుగురు అమ్మాయిలం రాష్ట్రానికి చేరుకున్నాం. ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పట్లో తిరిగి వెళ్లి చదువుకునే పరిస్థితులు లేవు. ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారిన తర్వాతే తిరిగి వెళతాం.  
– హరిణి, బీటెక్‌ విద్యార్థిని, మహబూబ్‌నగర్‌  

మాకు సమీపంలోనే బాంబు దాడులు 
అల్లర్లు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. మాకు సమీపంలో బాంబు దాడులు కూడా జరిగాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురయ్యాం. తెలంగాణ ప్రభుత్వం అక్కడి అధికారులతో సంప్రదింపులు ప్రారంభించిన తర్వాత ఆందోళన తగ్గింది.  
– వంశీ, బీటెక్‌ విద్యార్థి, జనగామ 

ప్రభుత్వం అమ్మా, నాన్నలా స్పందించింది 
తాగడానికి నీరు, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం ఓ అమ్మ, నాన్నలా స్పందించి మమ్మల్ని ఇక్కడికి క్షేమంగా చేర్చినందుకు ధన్యవాదాలు. 
 – సాయికిరణ్, బీటెక్‌ విద్యార్థి, ఘట్‌కేసర్, మేడ్చల్‌ జిల్లా
చదవండి: అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top